Scientific Assistants
-
అంతుచిక్కని బంగారం రహస్యం.. పుత్తడి పుట్టిందెక్కడ?
బంగారం. ఈ పేరు వింటేనే భారతీయులు మైమరిచిపోతారు. మనోళ్ల బంగారం మోజు దెబ్బకు పదిగ్రాముల పుత్తడి ధర ఏకంగా రూ.లక్ష మార్కు దాటేయడం తెల్సిందే. పసిడి అంటే సామాన్యులతో పాటు శాస్త్రవేత్తలకు సైతం ప్రత్యేక ఆసక్తి. పుత్తడి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునేందుకు వాళ్లు తెగ ఆసక్తి చూపిస్తారు. ‘‘స్వర్ణం మూలాలెక్కడున్నాయి? బంగారు లోహం భూమ్మీదకు ఎలా వచ్చింది?’’ అన్న ప్రశ్నలు శాస్త్రజు్ఞలను ఎప్పటినుంచో తొలుస్తున్నాయి. పేలిపోయిన నక్షత్రాల నుంచి బంగారం ఉద్భవించిందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. న్యూట్రాన్ నక్షత్రాలే పుత్తడికి పుట్టిల్లు అని సరికొత్త అధ్యయనం తెలిపింది. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రం తాజాగా ‘ది ఆస్ట్రో ఫిజిక్స్ జర్నల్ లెటర్స్’లో ప్రచురితమైంది. దాదాపు 1,380 కోట్ల సంవత్సరాల క్రితం బిగ్‌బ్యాంగ్ వల్ల విశ్వం ఆవిర్భవించిందన్నది శాస్త్రవేత్తల సిద్ధాంతం. విశ్వం ఏర్పడిన తొలినాళ్లలో అత్యంత తేలికైన హైడ్రోజన్, హీలియం, అంతకంటే తక్కువ పరిమాణంలో లిథియం వంటి మూలకాలు మాత్రమే ఏర్పడ్డాయి. ఆ సమయంలో పేలిన నక్షత్రాలు ఇనుము వంటి కాస్త బరువైన మూలకాలను విశ్వమంతటా వెదజల్లాయి. ఇనుము కంటే సాంద్రత ఎక్కువ ఉండే బంగారం ఎప్పుడు, ఎలా ఉద్భవించిందనే ప్రశ్నకు ‘మ్యాగ్నెటార్’ సరైన సమాధానమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏమిటీ మ్యాగ్నెటార్లు? మనకు అతి సమీపంలోని నక్షత్రమైన సూర్యుడు అపారమైన శక్తిని వెలుతురు, ఉష్ణశక్తి రూపంలో నిరంతరం విశ్వంలోకి వెదజల్లుతూనే ఉంటాడు. ఇలా నక్షత్రం తనలోని అపారమైన శక్తినంతా వెదజల్లాక గురుత్వాకర్షణ బలాలను కోల్పోతుంది. దీంతో ఎర్రరంగుకు మారి తుదకు పేలిపోతుంది. దాన్ని సూపర్నోవా అంటారు. పేలిన నక్షత్రం న్యూట్రాన్ నక్షత్రంగా, లేదంటే బ్లాక్‌హోల్ (కృష్ణబిలం)గా రూపాంతరం చెందుతుంది. ఈ న్యూట్రాన్ నక్షత్ర ద్రవ్యరాశి అత్యంత ఎక్కువగా ఉంటుంది. ఈ స్థితిలో అది గురుత్వాకర్షణ శక్తిని తరంగాల రూపంలో విశ్వంలోకి వెదజల్లుతుంది. వాటితోపాటు ‘గామా’ కిరణాలను, అణు కేంద్రకాలను కూడా అతివేగంగా వెదజల్లుతుంది. దీన్ని ఆర్–ప్రాసెస్ అంటారు. బరువైన మూలకమైన బంగారం ఈ క్రమంలోనే జనించిందని అధ్యయనం విశ్లేషించింది. ‘‘విశ్వంలోని ప్రాథమిక అంశాల పుట్టుక నిజంగా నవ్వు తెప్పించే క్లిష్టతరమైన పజిల్ వంటిది. వాటి పుట్టుపూర్వోత్తరాలను మనం పూర్తిగా కనుక్కోలేం. రెండు న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకొంటే బంగారం పుట్టిందని గతంలో భావించేవారు. కానీ అత్యంత శక్తివంతమైన మ్యాగ్నెటార్ (న్యూట్రాన్ నక్షత్రం) నుంచి కూడా బంగారం పుడుతోందని అధ్యయనంలో తేలింది’’ అని కొలంబియా వర్సిటీ ఫిజిక్స్ డాక్టోరల్ విద్యారి్థ, పరిశోధన ముఖ్య రచయిత అనిరుధ్ పటేల్ చెప్పారు. 20 ఏళ్ల సమాచారం... ‘‘2017లో రెండు నక్షత్రాలు ఢీకొనడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. దాంతో అంతరిక్షంలో అలల్లా గురుత్వాకర్షణ తరంగాలు విస్తరించాయి. వీటితోపాటే గామా కిరణాలు పెద్దమొత్తంలో వెలువడ్డాయి. ఇలా ఢీకొనడాన్ని కిలోనోవాగా పేర్కొన్నారు. దాని ఫలితంగా బరువైన బంగారం, ప్లాటినం, లెడ్ ఏర్పడ్డాయి. అందుకే కిలోనోవాలను బంగారం కర్మాగారాలుగా చెబుతారు. మ్యాగ్నెటార్లు గామా కిరణాలను వెదజల్లినప్పుడే బంగారం పుట్టింది’’ అని లూసియానా స్టేట్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎరిక్ బర్న్స్ చెప్పారు.నక్షత్రకంపం! న్యూట్రాన్ నక్షత్రాల్లో అత్యంత కాంతిమయ నక్షత్రాలనే మ్యాగ్నెటార్లు అంటారు. కేవలం టీస్పూన్ సైజులో ఉండే మ్యాగ్నెటార్ ద్రవ్యరాశి కూడా ఏకంగా 100 కోట్ల భూగోళాలంత బరువుంటుంది! మ్యాగ్నెటార్ చుట్టూ అత్యంత శక్తివంతమైన గురుత్వాకర్షణ క్షేత్రం ఉంటుంది. బిగ్‌బ్యాంగ్ జరిగిన 20 కోట్ల ఏళ్లకే మ్యాగ్నెటార్లు ఏర్పడ్డాయని భావిస్తున్నారు. భూమి అంతర్గత పొరల్లో సర్దుబాటు వల్ల భూకంపాలు వచి్చనట్టే నక్షత్రంలోనూ నక్షత్రకంపం పుడుతుంది. మాగ్నెటార్ అంతర్భాగంలోని ద్రవరూప పదార్థంలో సర్దుబాటు కారణంగా నక్షత్ర బాహ్యవలయాల్లో ‘స్టార్క్వేక్’లు వస్తాయట.– సాక్షి, నేషనల్ డెస్క్ -
జాబిల్లిపై ల్యాండర్ల సందడి!
చంద్రుడిపై ‘బ్లూ ఘోస్ట్’ ల్యాండర్ ఆదివారం సాఫీగా దిగింది. ఈ ల్యాండర్ సృష్టికర్త, ఆపరేటర్ అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ‘ఫైర్ ఫ్లై ఏరోస్పేస్’. 1972లో అపోలో-17 మానవసహిత మిషన్ తర్వాత చంద్రుడిపై అమెరికా వ్యోమనౌక ఒకటి ‘సాఫ్ట్ ల్యాండింగ్’ కావడం ఇది రెండోసారి. అమెరికన్ ప్రైవేటు సంస్థ ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ ప్రయోగించిన ‘ఒడిస్సియస్’ ల్యాండర్ (ఐఎం-1) సైతం నిరుడు ఫిబ్రవరిలో జాబిల్లి దక్షిణ ధృవంపై ఓ బిలంలో దిగింది. 1972లో చివరిసారిగా చంద్రుడిపై ఇద్దరు అమెరికన్ వ్యోమగాములు దిగి నడయాడిన 50 ఏళ్ల అనంతరం ‘ఒడిస్సియస్’ తొలి సాఫ్ట్ ల్యాండింగ్ ఘనత సాధించింది. అయితే దిగుతూనే ఓ కాలు విరిగి ల్యాండర్ ఒక పక్కకు ఒరిగినప్పటికీ దాన్ని కూడా సాఫ్ట్ ల్యాండింగ్ గానే శాస్త్రవేత్తలు పరిగణించారు. మనకు కనిపించే చంద్రుడి (ఇవతలి వైపు) ఈశాన్య ప్రాంతంలో ఘనీభవించిన లావాతో నిండిన ఓ ప్రాచీన, సువిశాల బిలం ‘మేర్ క్రిసియం’ ఉపరితలంపై నాలుగు కాళ్లతో ‘బ్లూ ఘోఃస్ట్’ ల్యాండర్ ఆదివారం దిగింది. కారు సైజులో ఉన్న ఈ ల్యాండర్ నిర్మాణానికి ‘నాసా’ నిధులు అందించింది. దీని జీవిత కాలం రెండు వారాలు. ఈ వ్యవధిలో అది చంద్రుడి ఉపరితలంపై నాసా నిర్దేశించిన సుమారు పది శాస్త్ర, సాంకేతిక ప్రయోగాలు చేపడుతుంది. ఇళ్లలో మనం వాడే వాక్యూమ్ క్లీనర్ తెలుసు కదా. అలాంటి ‘వాక్యూమ్’తో చంద్రధూళిని లోపలికి పీల్చుకుని ల్యాండర్ విశ్లేషిస్తుంది. చంద్రుడి ఉపరితలంపై పది అడుగుల లోతు వరకు డ్రిల్ చేసి ఉష్ణోగ్రతలను కొలుస్తుంది. ‘ఒడిస్సియస్’, ‘బ్లూ ఘోస్ట్’ రెండూ ప్రైవేటు సంస్థల ల్యాండర్లు కావడం మరో విశేషం. చంద్రబిలం చీకట్లోకి దూకనున్న ‘గ్రేస్’ హోపర్!‘ఇంట్యూటివ్ మెషీన్స్’ సంస్థ గత నెల 26న ప్రయోగించిన మరో ల్యాండర్ ‘అథీనా’ (ఐఎం-2) కూడా ఈ నెల 6న చంద్రుడి దక్షిణ ధృవం చెంత దిగబోతోంది. ‘స్పేస్ ఎక్స్’ సంస్థ రాకెట్ ఫాల్కన్-9తో కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ‘అథీనా’తోపాటే ‘లూనార్ ట్రైల్ బ్లేజర్’ ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించారు. ‘లాక్ హీద్ మార్టిన్’ సంస్థ తయారుచేసిన 200 కిలోల ఈ బుల్లి ఉపగ్రహం చంద్రుడికి దగ్గరగా ధ్రువకక్ష్యలో పరిభ్రమిస్తూ నీటి వనరుల మ్యాపింగ్ పనిలో నిమగ్నమవుతుంది. చంద్రుడి దక్షిణ ధృవానికి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత ఎత్తైన పర్వతం ‘మాన్స్ మౌటన్’ వద్ద దిగనున్న 15 అడుగుల ల్యాండర్ ‘అథీనా’లో... మినీ రోవర్ ‘మాప్’ (మొబైల్ అటానమస్ ప్రాస్పెక్టింగ్ ప్లాట్‌ఫామ్), ‘గ్రేస్’ హోపర్ ఉన్నాయి. కంప్యూటర్ సైంటిస్టు గ్రేస్ హోపర్ పేరు దానికి పెట్టారు. చంద్రుడిపై ల్యాండర్ దిగిన పరిసరాల చుట్టూతా ఓ మైలు వ్యాసార్ధం పరిధిలో ‘గ్రేస్’… హైడ్రజీన్ ఇంధనం నింపిన తన థ్రస్టర్స్ సాయంతో గెంతుతూ అన్వేషిస్తుంది. ల్యాండర్ దిగే ప్రదేశానికి 400 మీటర్ల దూరంలో... ఎన్నడూ సూర్యకాంతి సోకని, శాశ్వతంగా చీకటిగా ఉండే 65 అడుగుల లోతైన ‘హెచ్ బిలం’లోకి ‘గ్రేస్’ లంఘించబోతోంది. గడ్డ కట్టిన నీటి కోసం బిలంలోని నేల ప్రాంతాన్ని శోధించడం దాని ప్రధాన లక్ష్యం. ఎందుకంటే ఈ పనిని చక్రాలతో కదిలే రోవర్ చేయలేదు! ‘గ్రేస్’ రోబో మూడు అడుగుల పరిమాణంలో ఉంటుంది. పరిసరాలు, పరిస్థితులను నిశితంగా పరిశీలించి, నిర్ణయం తీసుకుని, కార్యోన్ముఖం చేయగల (సిచ్యువేషనల్ అవేర్నెస్) కెమెరా, లిడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్), నక్షత్రాల స్థానాన్ని గుర్తిస్తూ ముందుకు కదలడానికి ఉపయోగపగే ‘స్టార్ ట్రాకర్’ సాయంతో ‘గ్రేస్’ ఒక చోట నుంచి మరో చోటికి గెంతుతుంది. మొదట 20, తర్వాత 50, ఆ తర్వాత 100 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. ఈ మూడు గెంతుల్లో బిలం చేరుకుని దాని నేలపై వాలుతుంది. గడ్డకట్టిన నీటి ఆనవాళ్ల కోసం అన్వేషిస్తుంది. ముప్పావు గంట సేపు అక్కడ ఉండి, ఫొటోలు తీశాక మళ్లీ ‘గ్రేస్’ ఉపరితలంపైకి వస్తుంది. చంద్రుడిపై హోపర్ ప్రయోగం ఇదే ప్రథమం. రోవర్లు చేయలేని పనులను సుసాధ్యం చేసేందుకు తలపెట్టిన సాంకేతిక ప్రదర్శన ఇది. చైనా వచ్చే ఏడాది ‘చాంగే-7 మిషన్’తో చంద్రుడిపైకి ఇలాంటి హోపర్ పంపనుంది. ‘పెర్సెవరెన్స్’ రోవర్ వెంట అరుణగ్రహం అంగారకుడిపైకి నాసా పంపిన ‘ఇంజెన్యుటీ’ హెలికాప్టర్ ఆ గ్రహ వాతావరణంలో ఎగురుతూ పరిశోధనలు చేసిన సంగతి తెలిసిందే. చందమామపై ‘అథీనా’ ల్యాండర్ పనిచేసేది పది రోజులే. ‘నాసా’ రూపొందించిన పది శాస్త్రీయ పరికరాలను అందులో అమర్చారు. వీటిలో ఎక్కువ పరికరాలు చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలో గడ్డకట్టిన నీరు, ఇతర వనరుల జాడను కనుగొనడానికి ఉద్దేశించినవి. ఈ అన్వేషణలో నీటి ఆధారాలేవైనా బయల్పడితే వాటిని చంద్రుడిపై భవిష్యత్తులో నిర్మించే మానవ ఆవాసాలకు వినియోగించుకోవాలనేది నాసా ఆలోచన. 14న చంద్రగ్రహణానికి ప్రత్యక్ష సాక్షులు!పరిస్థితులన్నీ సవ్యంగా సాగితే... ఈ నెల 14న చంద్రగ్రహణానికి ‘బ్లూ ఘోస్ట్’, ‘అథీనా’ ల్యాండర్లు ప్రత్యక్ష సాక్షులవుతాయి. గ్రహణ వేళలో భూమి ఛాయ చంద్రుడిని క్రమంగా కప్పివేయడాన్ని ల్యాండర్లు రెండూ వీక్షిస్తాయి. ఆ తర్వాత మరో రెండు రోజులకు చంద్రుడిపై ల్యాండర్లు దిగిన ప్రాంతంలో ‘14 రోజుల రాత్రి కాలం’ మొదలై క్రమంగా చీకట్లు ముసురుకుంటాయి. అప్పుడిక ల్యాండర్లు పనిచేయడానికి సౌరశక్తి ఉండదు. పైగా అక్కడ అతి శీతల వాతావరణం నెలకొంటుంది. అంటే... ల్యాండర్లు రెండూ డెడ్ అవుతాయి. 2030 కల్లా చంద్రుడిపైకి అమెరికన్లు!తమ ‘ఆర్టెమిస్’ కార్యక్రమంతో ఈ దశాబ్దం చివరికల్లా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాలని నాసా యోచిస్తోంది. వాస్తవానికి ‘ఐఎం-2 మిషన్’ను నాసా రూ.550 కోట్లకు కొనుగోలు చేసింది. ‘బ్లూ ఘోస్ట్’, ఐఎం-1, ఐఎం-2... ఇవన్నీ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో కూడిన నాసా కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ (సీఎల్పీఎస్)లో భాగం. 2028 వరకు ఇలాంటి మిషన్స్ చేపట్టడానికి నాసా రమారమి రూ.25 వేల కోట్లు కేటాయిస్తోంది. ప్రైవేటు సంస్థలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటూ శాస్త్ర సాంకేతికతను వృద్ధి చేస్తోంది. (Credits: Sky News, NASASpaceflight.com, Space Intelligence, The Hindu, India Today, Space.com, Gizmodo, Scientific American, CNN)-జమ్ముల శ్రీకాంత్ -
18 ఏళ్ల కుర్రాడిగా కనిపించాలని..! ఎంత ఖర్చు చేస్తున్నాడంటే..
వయసుపై బడే కొద్దీ అందంగా, ఫిట్‌గా కనిపించేందుకు.. ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల మార్గాలను ఆశ్రయిస్తుంటారు కొందరు. అయితే.. ఈ మార్గాల్లో కాకుండా విరుద్ధమైన మార్గాలను ఎంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్న వాళ్లనూ తరచూ చూస్తున్నాం. రివర్స్ ఏజింగ్.. అంటే వయసు వెనక్కి తీసుకెళ్లడం. అసలు అది సాధ్యమేనా? అనే విషయం పక్కనపెడితే.. వైద్యసాంకేతిక విధానాల ద్వారా సుసాధ్యం చేయొచ్చనే ప్రయోగాలు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. తాజాగా.. అలాంటి ప్రక్రియతో వార్తల్లోకి ఎక్కిన ఓ సాఫ్ట్వేర్ మిలియనీర్ ప్రయత్నం గురించి బ్లూమ్‌బర్గ్ కథనం ఆధారంగా. బ్రయాన్ జాన్సన్.. వయసు 45 ఏళ్లు. బయోటెక్ మేధావిగా ఈయనకంటూ యూఎస్‌లో ఓ పేరుంది. పైగా సంపాదనతో మిలియనీర్‌గా ఎదిగాడు. అయితే 18 ఏళ్ల టీనేజర్‌గా కనిపించేందుకు ఈయనగారు ఏడాదికి 2 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టేశారు. మన కరెన్సీలో అది 16,29,68,990 రూపాయలు. ఈ ట్రీట్మెంట్లో భాగంగా.. శరీర తత్వం 18 ఏళ్లుగా కనిపించాలని, గుండె 37 ఏళ్ల వ్యక్తికి ఉండేలా, చర్మం 28 ఏళ్ల వ్యక్తి ఉండేలా కనిపించేందుకు చికిత్సలు తీసుకుంటున్నాడట. అంతేకాదు.. ప్రతీరోజూ 30 మంది వైద్యులు, ఆరోగ్య నిపుణులు అతని శరీర పనితీరును పర్యవేక్షిస్తున్నారట. ఈ రివర్స్ ఏజింగ్ ప్రక్రియ మొత్తం 29 ఏళ్ల ఫిజిషియన్ ఒలీవర్ జోల్మాన్ నేతృత్వంలో జరుగుతోంది. విశేషం ఏంటంటో.. జోల్మాన్తో పాటు జాన్సన్‌కు కూడా వృద్ధాప్యం, దీర్ఘాయువు లాంటి అంశాలపై ఆసక్తి ఎక్కువట. అందుకే.. గినియా పందులపై చేయాల్సిన ప్రయోగాలను నేరుగా తనపైనే చేయించుకునేందుకు ముందుకు వచ్చాడతను. అందుకోసం కాలిఫోర్నియా వెనిస్లోని తన నివాసాన్నే ప్రయోగశాలగా మార్చేశాడతను. అధికారికంగా యాంటీ ఏజింగ్ కోసం అతను చేస్తున్న ఖర్చు(వ్యక్తిగతంగా) ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పింది కూడా. ఒకవైపు వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్సతో పాటు.. రెగ్యులర్‌గా చేయాల్సిన ఎక్స్ర్సైజులు, తీసుకోవాల్సిన ఆహారం.. ఇలాంటివన్నీ షరామాములుగా కాకుండా వైద్యుల సమక్షంలోనే ప్రత్యేకంగా చేస్తున్నాడు. గత ఏడాది కాలంగా.. 2 మిలియన్ డాలర్ల డబ్బు ఖర్చు చేశాడతను. ఈ ఏడాదిలో బ్రెయిన్, లంగ్స్, లివర్, కిడ్నీలు, పళ్లు, చర్మం, జుట్టు, మర్మాంగం.. ఇతర అవయవాలన్నింటిని 18 ఏళ్ల వ్యక్తిగా మార్చుకునేందుకు యత్నిస్తున్నాడతను. ఈ ప్రయోగంలో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లినా పర్వాలేదని, ఒకవేళ ప్రయోగం సక్సెస్ అయితే నవయవ్వనంగా కనిపించాలనుకుంటున్న మనిషి కోరిక నెరవేరేందుకు ఒక మార్గం దొరుకుతుందని అంటున్నాడు బ్రయాన్ జాన్సన్. -
జిల్లాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్‌లు
* తొలి దశలో నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో * వరంగల్‌లో డీఎన్ఏ కేంద్రం.. ఎఫ్ఎస్ఎల్ అధికారుల ప్రతిపాదన * త్వరలోనే సర్కారు గ్రీన్‌సిగ్నల్ సాక్షి, హైదరాబాద్: నేరస్తుల నిగ్గు తేల్చడంలో కీలక పాత్ర వహించే ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాంతీయ కేంద్రాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. దీంతోపాటు హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఉన్న డీఎన్ఏ కేంద్రం తరహాలో మరో కేంద్రాన్ని వరంగల్‌లో ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్ఎస్ఎల్కు కేసుల తాకిడి పెరిగింది. ఓవైపు కేసులు పెరుగుతుండటం.. మరోవైపు సైంటిఫిక్ అసిస్టెంట్లు, శాస్త్రవేత్తల కొరత వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వరంగల్‌లో ఓ ప్రాంతీయ కేంద్రం ఉన్నా.. మిగతా జిల్లాల నుంచి వచ్చే కేసులకు సంబంధించి ఘటనా స్థలం నుంచి సేకరించిన ఆధారాల విశ్లేషణ బాధ్యత హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్పైనే పడుతోంది. దీంతో అనేక కేసుల్లో దర్యాప్తు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాల కేసుల్లో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించే ప్రక్రియ మందకొడిగా సాగుతోందనే విమర్శలున్నాయి. అయితే, డీఎన్ఏ పరీక్షలకు సంబంధించి ప్రతి నెలా 60కి పైగా కేసులు వస్తుండటం.. సంస్థలో నిష్ణాతుల సంఖ్య తక్కువగా ఉండటం వంటివి ఈ జాప్యానికి కారణమని ఎఫ్ఎస్ఎల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్‌లో మరో డీఎన్ఏ కేంద్రం ఏర్పాటు చేయాలని ఎఫ్ఎస్ఎల్ అధికారులు ప్రతిపాదించారు. అదేవిధంగా మిగిలిన కేసులకు సంబంధించి ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌లను తొలి దశలో మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్‌లలో ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు. అనంతరం మిగిలిన జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. వీరి ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇదిలా ఉండగా.. ఎఫ్ఎస్ఎల్కు 220 మందికి పైగా నిపుణుల అవసరముండగా.. ప్రస్తుతం 150 మంది వరకే ఉన్నారని.. ఆ కొరతను కూడా తీర్చాలని అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు.