
- చంద్రునిపై దిగిన ‘బ్లూ ఘోస్ట్’
- 6న కాలుమోపనున్న ‘అథీనా’
- బిలంలోకి లంఘించనున్న ‘గ్రేస్’ హోపర్
- గడ్డకట్టిన నీరు దొరికేనా?
చంద్రుడిపై ‘బ్లూ ఘోస్ట్’ ల్యాండర్ ఆదివారం సాఫీగా దిగింది. ఈ ల్యాండర్ సృష్టికర్త, ఆపరేటర్ అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ‘ఫైర్ ఫ్లై ఏరోస్పేస్’. 1972లో అపోలో-17 మానవసహిత మిషన్ తర్వాత చంద్రుడిపై అమెరికా వ్యోమనౌక ఒకటి ‘సాఫ్ట్ ల్యాండింగ్’ కావడం ఇది రెండోసారి. అమెరికన్ ప్రైవేటు సంస్థ ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ ప్రయోగించిన ‘ఒడిస్సియస్’ ల్యాండర్ (ఐఎం-1) సైతం నిరుడు ఫిబ్రవరిలో జాబిల్లి దక్షిణ ధృవంపై ఓ బిలంలో దిగింది. 1972లో చివరిసారిగా చంద్రుడిపై ఇద్దరు అమెరికన్ వ్యోమగాములు దిగి నడయాడిన 50 ఏళ్ల అనంతరం ‘ఒడిస్సియస్’ తొలి సాఫ్ట్ ల్యాండింగ్ ఘనత సాధించింది. అయితే దిగుతూనే ఓ కాలు విరిగి ల్యాండర్ ఒక పక్కకు ఒరిగినప్పటికీ దాన్ని కూడా సాఫ్ట్ ల్యాండింగ్ గానే శాస్త్రవేత్తలు పరిగణించారు.
మనకు కనిపించే చంద్రుడి (ఇవతలి వైపు) ఈశాన్య ప్రాంతంలో ఘనీభవించిన లావాతో నిండిన ఓ ప్రాచీన, సువిశాల బిలం ‘మేర్ క్రిసియం’ ఉపరితలంపై నాలుగు కాళ్లతో ‘బ్లూ ఘోఃస్ట్’ ల్యాండర్ ఆదివారం దిగింది. కారు సైజులో ఉన్న ఈ ల్యాండర్ నిర్మాణానికి ‘నాసా’ నిధులు అందించింది. దీని జీవిత కాలం రెండు వారాలు. ఈ వ్యవధిలో అది చంద్రుడి ఉపరితలంపై నాసా నిర్దేశించిన సుమారు పది శాస్త్ర, సాంకేతిక ప్రయోగాలు చేపడుతుంది. ఇళ్లలో మనం వాడే వాక్యూమ్ క్లీనర్ తెలుసు కదా. అలాంటి ‘వాక్యూమ్’తో చంద్రధూళిని లోపలికి పీల్చుకుని ల్యాండర్ విశ్లేషిస్తుంది. చంద్రుడి ఉపరితలంపై పది అడుగుల లోతు వరకు డ్రిల్ చేసి ఉష్ణోగ్రతలను కొలుస్తుంది. ‘ఒడిస్సియస్’, ‘బ్లూ ఘోస్ట్’ రెండూ ప్రైవేటు సంస్థల ల్యాండర్లు కావడం మరో విశేషం.
చంద్రబిలం చీకట్లోకి దూకనున్న ‘గ్రేస్’ హోపర్!
‘ఇంట్యూటివ్ మెషీన్స్’ సంస్థ గత నెల 26న ప్రయోగించిన మరో ల్యాండర్ ‘అథీనా’ (ఐఎం-2) కూడా ఈ నెల 6న చంద్రుడి దక్షిణ ధృవం చెంత దిగబోతోంది. ‘స్పేస్ ఎక్స్’ సంస్థ రాకెట్ ఫాల్కన్-9తో కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ‘అథీనా’తోపాటే ‘లూనార్ ట్రైల్ బ్లేజర్’ ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించారు. ‘లాక్ హీద్ మార్టిన్’ సంస్థ తయారుచేసిన 200 కిలోల ఈ బుల్లి ఉపగ్రహం చంద్రుడికి దగ్గరగా ధ్రువకక్ష్యలో పరిభ్రమిస్తూ నీటి వనరుల మ్యాపింగ్ పనిలో నిమగ్నమవుతుంది. చంద్రుడి దక్షిణ ధృవానికి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత ఎత్తైన పర్వతం ‘మాన్స్ మౌటన్’ వద్ద దిగనున్న 15 అడుగుల ల్యాండర్ ‘అథీనా’లో... మినీ రోవర్ ‘మాప్’ (మొబైల్ అటానమస్ ప్రాస్పెక్టింగ్ ప్లాట్ఫామ్), ‘గ్రేస్’ హోపర్ ఉన్నాయి. కంప్యూటర్ సైంటిస్టు గ్రేస్ హోపర్ పేరు దానికి పెట్టారు. చంద్రుడిపై ల్యాండర్ దిగిన పరిసరాల చుట్టూతా ఓ మైలు వ్యాసార్ధం పరిధిలో ‘గ్రేస్’… హైడ్రజీన్ ఇంధనం నింపిన తన థ్రస్టర్స్ సాయంతో గెంతుతూ అన్వేషిస్తుంది. ల్యాండర్ దిగే ప్రదేశానికి 400 మీటర్ల దూరంలో... ఎన్నడూ సూర్యకాంతి సోకని, శాశ్వతంగా చీకటిగా ఉండే 65 అడుగుల లోతైన ‘హెచ్ బిలం’లోకి ‘గ్రేస్’ లంఘించబోతోంది. గడ్డ కట్టిన నీటి కోసం బిలంలోని నేల ప్రాంతాన్ని శోధించడం దాని ప్రధాన లక్ష్యం. ఎందుకంటే ఈ పనిని చక్రాలతో కదిలే రోవర్ చేయలేదు! ‘గ్రేస్’ రోబో మూడు అడుగుల పరిమాణంలో ఉంటుంది. పరిసరాలు, పరిస్థితులను నిశితంగా పరిశీలించి, నిర్ణయం తీసుకుని, కార్యోన్ముఖం చేయగల (సిచ్యువేషనల్ అవేర్నెస్) కెమెరా, లిడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్), నక్షత్రాల స్థానాన్ని గుర్తిస్తూ ముందుకు కదలడానికి ఉపయోగపగే ‘స్టార్ ట్రాకర్’ సాయంతో ‘గ్రేస్’ ఒక చోట నుంచి మరో చోటికి గెంతుతుంది.
మొదట 20, తర్వాత 50, ఆ తర్వాత 100 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. ఈ మూడు గెంతుల్లో బిలం చేరుకుని దాని నేలపై వాలుతుంది. గడ్డకట్టిన నీటి ఆనవాళ్ల కోసం అన్వేషిస్తుంది. ముప్పావు గంట సేపు అక్కడ ఉండి, ఫొటోలు తీశాక మళ్లీ ‘గ్రేస్’ ఉపరితలంపైకి వస్తుంది. చంద్రుడిపై హోపర్ ప్రయోగం ఇదే ప్రథమం. రోవర్లు చేయలేని పనులను సుసాధ్యం చేసేందుకు తలపెట్టిన సాంకేతిక ప్రదర్శన ఇది. చైనా వచ్చే ఏడాది ‘చాంగే-7 మిషన్’తో చంద్రుడిపైకి ఇలాంటి హోపర్ పంపనుంది. ‘పెర్సెవరెన్స్’ రోవర్ వెంట అరుణగ్రహం అంగారకుడిపైకి నాసా పంపిన ‘ఇంజెన్యుటీ’ హెలికాప్టర్ ఆ గ్రహ వాతావరణంలో ఎగురుతూ పరిశోధనలు చేసిన సంగతి తెలిసిందే. చందమామపై ‘అథీనా’ ల్యాండర్ పనిచేసేది పది రోజులే. ‘నాసా’ రూపొందించిన పది శాస్త్రీయ పరికరాలను అందులో అమర్చారు. వీటిలో ఎక్కువ పరికరాలు చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలో గడ్డకట్టిన నీరు, ఇతర వనరుల జాడను కనుగొనడానికి ఉద్దేశించినవి. ఈ అన్వేషణలో నీటి ఆధారాలేవైనా బయల్పడితే వాటిని చంద్రుడిపై భవిష్యత్తులో నిర్మించే మానవ ఆవాసాలకు వినియోగించుకోవాలనేది నాసా ఆలోచన.
14న చంద్రగ్రహణానికి ప్రత్యక్ష సాక్షులు!
పరిస్థితులన్నీ సవ్యంగా సాగితే... ఈ నెల 14న చంద్రగ్రహణానికి ‘బ్లూ ఘోస్ట్’, ‘అథీనా’ ల్యాండర్లు ప్రత్యక్ష సాక్షులవుతాయి. గ్రహణ వేళలో భూమి ఛాయ చంద్రుడిని క్రమంగా కప్పివేయడాన్ని ల్యాండర్లు రెండూ వీక్షిస్తాయి. ఆ తర్వాత మరో రెండు రోజులకు చంద్రుడిపై ల్యాండర్లు దిగిన ప్రాంతంలో ‘14 రోజుల రాత్రి కాలం’ మొదలై క్రమంగా చీకట్లు ముసురుకుంటాయి. అప్పుడిక ల్యాండర్లు పనిచేయడానికి సౌరశక్తి ఉండదు. పైగా అక్కడ అతి శీతల వాతావరణం నెలకొంటుంది. అంటే... ల్యాండర్లు రెండూ డెడ్ అవుతాయి.
2030 కల్లా చంద్రుడిపైకి అమెరికన్లు!
తమ ‘ఆర్టెమిస్’ కార్యక్రమంతో ఈ దశాబ్దం చివరికల్లా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాలని నాసా యోచిస్తోంది. వాస్తవానికి ‘ఐఎం-2 మిషన్’ను నాసా రూ.550 కోట్లకు కొనుగోలు చేసింది. ‘బ్లూ ఘోస్ట్’, ఐఎం-1, ఐఎం-2... ఇవన్నీ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో కూడిన నాసా కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ (సీఎల్పీఎస్)లో భాగం. 2028 వరకు ఇలాంటి మిషన్స్ చేపట్టడానికి నాసా రమారమి రూ.25 వేల కోట్లు కేటాయిస్తోంది. ప్రైవేటు సంస్థలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటూ శాస్త్ర సాంకేతికతను వృద్ధి చేస్తోంది.
(Credits: Sky News, NASASpaceflight.com, Space Intelligence, The Hindu, India Today, Space.com, Gizmodo, Scientific American, CNN)
-జమ్ముల శ్రీకాంత్
Comments
Please login to add a commentAdd a comment