మృతుల గుర్తింపుకు పది రోజులు! | Volvo bus tragedy: Identification of the deceased will take ten days | Sakshi
Sakshi News home page

మృతుల గుర్తింపుకు పది రోజులు!

Published Fri, Nov 1 2013 1:44 AM | Last Updated on Thu, Oct 4 2018 5:51 PM

Volvo bus tragedy: Identification of the deceased will take ten days

* దేహాలు బాగా కాలిపోయినందున డీఎన్‌ఏ పరీక్షల్లో ఆలస్యమవుతుందని  ఫోరెన్సిక్ నిపుణుల వెల్లడి
* ఒక్కరు మినహా మిగతావారి బంధువుల నుంచి నమూనాల సేకరణ
* నగలు, వాచీ, సిమ్‌కార్డుల ఆధారాలతో కొన్ని మృతదేహాల గుర్తింపు
* అయినా డీఎన్‌ఏ రిపోర్టు వచ్చేవరకూ ఇవ్వలేమన్న ఉస్మానియా వైద్యులు, పోలీసులు
* ఫోరెన్సిక్ అధికారులు, పోలీసుల వ్యవహార శైలిపై మండిపడ్డ మృతుల బంధువులు
 
సాక్షి, హైదరాబాద్: బస్సు దగ్ధం ఘటనలో మృతులను గుర్తించేందుకు ఎనిమిది నుంచి పది రోజుల వరకూ పట్టవచ్చని అధికారులు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద బుధవారం తెల్లవారుజామున బస్సు దగ్ధమై 45 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన అనంతరం మృతదేహాలను హైదరాబాద్‌లోని ఉస్మానియా మార్చురీకి తరలించారు. దీంతో మృతుల బంధువులంతా గురువారం ఉదయం 8 గంటలకే ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు.

ఈ దుర్ఘటనలో దేహాలూ పూర్తిగా కాలిపోవడంతో.. డీఎన్‌ఏ పరీక్షలు చేయాల్సి వచ్చింది. మృతుల వివరాలకు అనుగుణంగా రక్త సంబంధీకుల నుంచి రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఏపీఎఫ్‌ఎస్‌ఎల్) నిపుణులు డీఎన్‌ఏ నమూనాలను సేకరించారు. గుజరాత్‌కు చెందిన ఒక మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం శుక్రవారం ఇక్కడకు చేరుకుని నమూనాలు ఇవ్వనున్నారు. మృతదేహాల నుంచి కాలర్ బోన్, దవడ ఎముకలను సేకరించామని, వారి రక్త సంబంధీకుల నమూనాలతో పోల్చి మృతులు ఎవరనేదీ నిర్ధారిస్తామని ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు.

ప్రమాదంలో ఎముకలు కూడా బాగా కాలిపోవడంతో డీఎన్‌ఏ సేకరణ కూడా కష్టంగా మారిందని, అందువల్ల డీఎన్‌ఏ పరీక్షల ప్రక్రియలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని వారు చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు సాధారణంగా 15 రోజుల వరకూ పడుతుందని, బస్సు దుర్ఘటన కేసును ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని రోజూ మూడు బృందాలు 24 గంటలూ పరిశోధన చేసేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. అయినప్పటికీ డీఎన్‌ఏ పరీక్షలు పూర్తయ్యేందుకు 8 నుంచి 10 రోజుల వరకూ సమయం పట్టవచ్చని వివరించారు.

అయితే, డీఎన్‌ఏ పరీక్షలు పూర్తయిన తరువాత మాత్రమే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంటుంది. పోలీసులు కూడా ఇదే విషయాన్ని మృతుల కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. కానీ, తమ ఆప్తులు మరణించారనే వేదనతో ఉన్న తమను... అంత్యక్రియలు కూడా సకాలంలో నిర్వహించుకోలేకపోతున్నామనే బాధ మరింత ఆవేదనకు గురిచేస్తోందని మృతుల బంధువులు పేర్కొంటున్నారు.

ఆధారాలున్నా ఇవ్వలేం
బస్సు దుర్ఘటన మృతదేహాలను గుర్తించేందుకు నగలు, వాచీలు, సెల్‌ఫోన్ సిమ్‌కార్డులూ వంటి ఆధారాలు దొరికినా.. డీఎన్‌ఏ రిపోర్టు వచ్చే వరకూ బంధువులకు అప్పగించలేమని అధికారులు తేల్చిచెప్పారు. దాంతో ఆధారాలు దొరికితే తమవారి భౌతికకాయాలను అప్పగిస్తారేమోనని వచ్చిన బంధువులు ఆవేదనలో మునిగి పోయారు. అయితే, బస్సు ప్రమాదంలో సజీవ దహ నమైన ఘటనలో 42 మృతదేహాలకు శవపరీక్షలు పూర్తయ్యాయని ఉస్మానియా ఫోరెన్సిక్ విభాగాధిపతి టకీయుద్దీన్ తెలిపారు.

శాంపిళ్లను ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించామని చెప్పారు. ఈ విషయంలో తాము చేయాల్సిన పని పూర్తయిందని, ఇక చేయాల్సిందంతా పోలీసులేనని స్పష్టం చేశారు. పోలీసులు చెప్పాకే మృతదేహాలను అప్పగిస్తామన్నారు. మరోవైపు.. పోలీసులు మృతుల డీఎన్‌ఏ రిపోర్టు వచ్చాకే భౌతికకాయాలు అప్పగిస్తామని, అంతవరకూ ఆగాల్సిందేనన్నారు. దీంతో కొందరు మృతుల బంధువులు.. గుర్తించిన మృతదేహాలనైనా ఇవ్వాలని అధికారులను నిలదీశారు.

అయితే, అధికారులు వారిగోడు పట్టించుకోకుండా.. నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని ఫోరెన్సిక్ లేబొరేటరీకి వెళ్లి, శాంపిళ్లు ఇవ్వాలని మృతుల బంధువులకు సూచించారు. అయితే, మృతుల బంధువుల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారున్నారు. వారికి ఫోరెన్సిక్ లేబొరేటరీ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. ఎక్కడికెళ్లాలో, ఎలా వెళ్లాలో తెలియక కొంతమంది బాధితులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి బంధువులంతా  ఫోరెన్సిక్ ల్యాబ్ వెళ్లినా... నమూనాలు ఇవ్వడానికి గంటల తరబడి నిల్చోవాల్సి వచ్చింది.
 
 కొన్ని ఆధారాలు లభ్యమైనా
 ప్రమాదానికి గురైన బస్సులో మృతదేహాల వద్ద దొరికిన కొన్ని వస్తువులు, నగలు, సెల్‌ఫోన్లను ఉస్మానియా ఆస్పత్రిలో ఆయా మృతదేహాలతో పాటే భద్రపరిచారు. ఆ వస్తువులను కొందరి బంధువులు గుర్తించారు కూడా. వెంకటేష్ యాదవ్ అనే ప్రయాణికుడికి చెందిన వెండి మొలతాడు, ఆయన సోదరి అనిత నగల ఆధారంగా బంధువులు అన్నాచెల్లెళ్ల మృతదేహాలను గుర్తించారు. కానీ, అవే నగలు తమ బంధువు ధరించినవిగా మరో కుటుంబం చెప్పడంతో ఆ మృతదేహాలను ఎవరికీ అప్పగించలేదు.

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన శివకిరణ్ మృతదేహాన్ని.. బెల్టు, సెల్‌ఫోన్‌లోని మెమొరీకార్డు, చేతి వాచీ ఆధారంగా బంధువులు గుర్తుపట్టారు. కానీ, ఆ మృతదేహాన్ని బుధవారమే ఎవరో తమవారిదని చెప్పారని పేర్కొంటూ అధికారులు అప్పగించలేదు. మరో మృతుడు వేదపతి ధరించిన జీన్స్‌ప్యాంట్, సాక్స్, బనియన్‌ల ఆధారంగా బంధువులు మృతదేహాన్ని గుర్తించినా, అధికారులు అప్పగించలేదు. ఇలా మరో ఇద్దరికి సంబంధించి కూడా ఆధారాలను గుర్తించినా మృతదేహాలను ఇవ్వలేదు. ఆధారాలు ఉంటే మృతదేహాన్ని అప్పగించాలని మంత్రులు కూడా చెబుతున్నారని, అయినా ఇవ్వడం లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 పట్టించుకునే దిక్కులేదు
 ఘటన మృతదేహాలను బుధవారం సాయంత్రం ఉస్మానియా మార్చురీలో భద్రపరిచారు. కానీ, బంధువులు, బాధితుల గురించి ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. నమూనాల సేకరణ ఎలా జరుగుతోంది? మృతుల బంధువులకు దిశానిర్దేశం చేయడం తదితర అంశాలపై ఒక్క ఉన్నతాధికారి కూడా వచ్చి పర్యవేక్షణ చెయ్యలేదు. మరోవైపు ఫోరెన్సిక్ అధికారులు, పోలీసులు కూడా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు. ఒక్కరంటే ఒక్క రాష్ట్రస్థాయి అధికారి కూడా రాలేదు. కనీసం మృతుల బంధువులకు మంచినీళ్లు కూడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. చివరకు బంధువులు గొడవ చేస్తే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అధికారి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
 
ఉత్తరాఖండ్ ఘటన సమయంలోనూ ఇదే తంతు..
ఉత్తరాఖండ్‌లో వరదలు ముంచెత్తినప్పుడు కూడా రాష్ట్రప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. వందలాది మంది జాడ తెలియక ఆందోళన చెందిన బంధువులకు ప్రభుత్వం కనీస భరోసా ఇవ్వలేకపోయింది. కొన్ని మృతదేహాలు లభ్యమైన తర్వాత ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆ మృతదేహాలు కావాలంటే డెహ్రాడూన్‌కు వచ్చి నమూనాలు ఇవ్వాలని, డీఎన్‌ఏ పరీక్షలు చేసి వాటిని అప్పగిస్తామని చెప్పింది. డెహ్రాడూన్‌కు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణ సౌకర్యం కల్పించలేదు. ప్రస్తుతం బస్సు దుర్ఘటనలోనూ రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
 

ఆరు విధాలుగా గుర్తించొచ్చు!
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో 45 మంది మరణించగా.. వారికి సంబంధించి 42 మృతదేహాలను ఇంకా గుర్తించలేకపోయారు. అగ్నికీలలకు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడమే దానికి కారణం. డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా మృతదేహాలను వారి బంధువులకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాల సమయంలో మృతులను ముఖ్యంగా ఆరు విధాలుగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవి..

1. సీటు నెంబర్: మృతదేహమున్న సీటు నంబర్‌ను బస్సు బయల్దేరే ముందు రూపొందించిన ప్రయాణికుల జాబితాతో పోల్చిగుర్తిస్తారు. అయితే మార్గమధ్యలో సీట్లు మారే అవకాశమున్నందున ఈ విధానంతో కచ్చితంగా గుర్తించలేం.

2. ఆభరణాలు: మృతదేహాలను స్వాధీనం చేసుకునే క్రమంలో పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహిస్తారు. అందులో మృతదేహం ఉన్న ప్రాంతం (సీటు లేదా మధ్య ఖాళీ స్థలంలో) నుంచి తీశారు? దానిపై లభించిన నగలు, ఆభరణాల వివరాలను పొందుపరుస్తారు. వాటి ఆధారంగా కుటుంబ సభ్యులు గుర్తించవచ్చు. ఈ తరహాలోనే ప్రస్తుత ఘటనలోనూ నగల ఆధారంగా ఇద్దరి మృతదేహాలను బంధువులు గుర్తించారు.

3. వస్త్రాలు, వస్తువులు: ప్రయాణిస్తున్న సమయంలో ధరించిన వస్త్రాలు, వెంట తీసుకువెళ్తున్న వస్తువులు సైతం కీలక ఆధారాలే. అవి లభించకపోతే సూట్‌కేసులు, బ్యాగులు, సెల్‌ఫోన్లు, లైటర్లు వంటి వాటిని సేకరిస్తారు. వాటి ఆధారంగానూ గుర్తించవచ్చు.

4. శరీరం, గాయాలు: మృతుల ఒడ్డు, పొడుగు వంటి శరీరాకృతులను ఎముకల ద్వారా తెలుసుకోవడంతో పాటు గాయా లు, అంగవైకల్యాలు తదితరాలు సైతం గుర్తింపునకు ఉపకరిస్తాయి. దంతాలతో గానీ, గతంలో ఆపరేషన్లు జరగడం, కాళ్లు-చేతులు విరగడం వంటి ఆధారాలూ గుర్తింపునకు పనికొస్తాయి.

5. రక్తం, డీఎన్‌ఏ: శరీరం పూర్తిగా కాలిపోయినా.. అంతర్గత అవయవాల్లో కొంత వరకు రక్త నమూనాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. అదీ సాధ్యం కానప్పుడు బోన్ మ్యారోను సేకరించి విశ్లేషిస్తారు. అవీ లభ్యమయ్యే పరిస్థితి లేకపోతే డీఎన్‌ఏ పరీక్షలే శరణ్యం. మృతదేహానికి సంబంధించి, ఏ చిన్న ఆధారం నుంచైనా దీనిని గుర్తించొచ్చు.

6. సూపర్ ఇంపోషన్: మృతదేహం నుంచి డీఎన్‌ఏ, రక్తనమూనాలను కూడా సేకరించే అవకాశం లేనప్పుడే ఈ విధానాన్ని అనుసరిస్తారు. ఇందులో మృతదేహం పుర్రెను ఆధునిక పరికరాలు, కంప్యూటర్ సాయం తో విశ్లేషించి, ముఖాకృతిని ఇస్తారు. దాన్ని అనుమానితుల ఫొటోతో సరిపోల్చడం ద్వారా నిర్ధారిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement