డీఎన్ఏ పరీక్షల కోసం మృతుల బంధువుల పడిగాపులు
హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి బంధువులు డీఎన్ఏ పరీక్షల కోసం నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ వద్ద పడిగాపులు పడుతున్నారు. కడసారి చూపుకు నోచుకోకపోయినా... కనీసం తమవారి మృతదేహాన్ని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షల కోసం బంధువులు ఎదురు చూపులు చూస్తున్నారు.
అయితే అక్కడ హెల్ప్లైన్ నంబర్లు పరిచేయకపోవటం... వైద్య సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటంతో మృతుల బంధువులు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. పరీక్షల నిర్వహణకు జరుపుతున్న జాప్యంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమవారి మృతదేహాలను త్వరగా అప్పగించాలని బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహాలను రేపటికల్లా అందచేయకుంటే ఆత్మహత్యలకు కూడా వెనకాడమని వారు స్పష్టం చేశారు.
కాగా 39మంది మృతుల బంధువుల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించినట్లు మహబూబ్‌నగర్ డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్ తెలిపారు. వారం తర్వాత డీఎన్ఐ నమూనా ఫలితాలు వెల్లడి అవుతాయని... అప్పటివరకూ మృతదేహాలు ఉస్మానియా మార్చురీలోనే ఉంటాయని తెలిపారు.
మరోవైపు ఉస్మానియా మార్చరీలో తమ రాష్ట్ర వాసుల వివరాలపై కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి, రవాణాశాఖ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. మంత్రి రామలింగారెడ్డి...మృతుల బంధువులను పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.