ఆరు విధాలుగా గుర్తించొచ్చు!
మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో 45 మంది మరణించగా.. వారికి సంబంధించి 42 మృతదేహాలను ఇంకా గుర్తించలేకపోయారు. అగ్నికీలలకు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడమే దానికి కారణం. డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా మృతదేహాలను వారి బంధువులకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాల సమయంలో మృతులను ముఖ్యంగా ఆరు విధాలుగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవి..
- సీటు నెంబర్: మృతదేహమున్న సీటు నంబర్‌ను బస్సు బయల్దేరే ముందు రూపొందించిన ప్రయాణికుల జాబితాతో పోల్చిగుర్తిస్తారు. అయితే మార్గమధ్యలో సీట్లు మారే అవకాశమున్నందున ఈ విధానంతో కచ్చితంగా గుర్తించలేం.
- ఆభరణాలు: మృతదేహాలను స్వాధీనం చేసుకునే క్రమంలో పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహిస్తారు. అందులో మృతదేహం ఉన్న ప్రాంతం (సీటు లేదా మధ్య ఖాళీ స్థలంలో) నుంచి తీశారు? దానిపై లభించిన నగలు, ఆభరణాల వివరాలను పొందుపరుస్తారు. వాటి ఆధారంగా కుటుంబ సభ్యులు గుర్తించవచ్చు. ఈ తరహాలోనే ప్రస్తుత ఘటనలోనూ నగల ఆధారంగా ఇద్దరి మృతదేహాలను బంధువులు గుర్తించారు.
- వస్త్రాలు, వస్తువులు: ప్రయాణిస్తున్న సమయంలో ధరించిన వస్త్రాలు, వెంట తీసుకువెళ్తున్న వస్తువులు సైతం కీలక ఆధారాలే. అవి లభించకపోతే సూట్‌కేసులు, బ్యాగులు, సెల్‌ఫోన్లు, లైటర్లు వంటి వాటిని సేకరిస్తారు. వాటి ఆధారంగానూ గుర్తించవచ్చు.
- శరీరం, గాయాలు: మృతుల ఒడ్డు, పొడుగు వంటి శరీరాకృతులను ఎముకల ద్వారా తెలుసుకోవడంతో పాటు గాయా లు, అంగవైకల్యాలు తదితరాలు సైతం గుర్తింపునకు ఉపకరిస్తాయి. దంతాలతో గానీ, గతంలో ఆపరేషన్లు జరగడం, కాళ్లు-చేతులు విరగడం వంటి ఆధారాలూ గుర్తింపునకు పనికొస్తాయి.
- రక్తం, డీఎన్‌ఏ: శరీరం పూర్తిగా కాలిపోయినా.. అంతర్గత అవయవాల్లో కొంత వరకు రక్త నమూనాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. అదీ సాధ్యం కానప్పుడు బోన్ మ్యారోను సేకరించి విశ్లేషిస్తారు. అవీ లభ్యమయ్యే పరిస్థితి లేకపోతే డీఎన్‌ఏ పరీక్షలే శరణ్యం. మృతదేహానికి సంబంధించి, ఏ చిన్న ఆధారం నుంచైనా దీనిని గుర్తించొచ్చు.
- సూపర్ ఇంపొజిషన్: మృతదేహం నుంచి డీఎన్‌ఏ, రక్తనమూనాలను సేకరించే అవకాశం లేనప్పుడే ఈ విధానాన్ని అనుసరిస్తారు. ఇందులో మృతదేహం పుర్రెను ఆధునిక పరికరాలు, కంప్యూటర్ సాయంతో విశ్లేషించి, ముఖాకృతి ఇస్తారు. దాన్ని అనుమానితుల ఫొటోతో సరిపోల్చడం ద్వారా నిర్ధారిస్తారు.