డీఎన్‌ఏతో 19 మంది గుర్తింపు | 19 bodies of bus accident victims identified | Sakshi
Sakshi News home page

డీఎన్‌ఏతో 19 మంది గుర్తింపు

Published Tue, Nov 5 2013 3:36 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

19 bodies of bus accident victims identified

పాలెం బస్సు దుర్ఘటనలో ఇద్దరి మృతదేహాల అప్పగింత
 మిగతా మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం
 మిగిలిన శవాలను నేడు గుర్తించే అవకాశం
 ఉస్మానియా మార్చురీ వద్ద బంధువుల పడిగాపులు


 సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద అక్టోబర్ 30వ తేదీ తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన వారిలో 19 మంది మృతులను డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తించగలిగారు. గాలి బాలసుందరరాజు(55), ఆయన భార్య మేరి విజయలక్ష్మి(52)తోపాటు అక్షయ్‌సింగ్(22) మృత దేహాలను పోలీసులు సోమవారం రాత్రి బంధువులకు అప్పగించారు. మిగిలిన వారి మృతదేహాలను మంగళవారం తీసుకెళ్లనున్నట్లు వారి బంధువులు పోలీసులకు తెలిపారు. ఘటనలో 45 మంది మృత్యువాత పడగా క్లీనర్ సహా మరో ఐదురుగు ప్రయాణికులు తీవ్రంగా గాయపడి అపోలో డీఆర్‌డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. 42 మృతదేహాలను పోస్టుమార్టం కోసం అదే రోజు రాత్రి ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో డీఎన్‌ఏ పరీక్షలు జరిపి నివేదిక వచ్చాకే బంధువులకు అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబీకుల నుంచి రక్త నమూనాలు సేకరించి విశ్లేషించారు. వీరిలో 19 మందికి సంబంధించిన డీఎన్‌ఏ నివేదికలు రావడంతో మృత దేహాలను తీసుకెళ్లేందుకు రావాలని సూచిస్తూ మహబూబ్‌నగర్ పోలీసులు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బాధితుల బంధువులకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చారు. మృతదేహాల తరలింపుకు అవసరమైన ఫ్రీజర్ బాక్సులు, వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. అయితే మరో 23 మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉన్నందున వారి బంధువులు మార్చురీ వద్దే ఎదురు చూస్తున్నారు. మంగళవారం సాయంత్రంలోగా మిగిలిన మృతదేహాలను కూడా గుర్తించే అవకాశం ఉందని కొత్తకోట సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు.
 
 డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తించింది వీరినే
 బి.అక్షయ్‌సింగ్(22), మహ్మద్ సర్దార్(32), సయ్యద్ మహ్మద్ జమాలుద్దీన్(27), ఎన్.రుహియా(32), కుసుమ వేదపతి(27), వెంకటేష్ యాదవ్(45), ఆడారి రవి(27), జి.బాలసుందరరాాజు(55), మేరి విజయలక్ష్మి(52), రఘువీర్(33), శివకిరణ్(33) ప్రశాంత్‌గుప్తా, నంజుండగౌడ, అష్‌తోష్‌పాం డ, ఫణికుమార్, జ్యోతిరంజన్‌సాహూ, మోషిన్‌పాషా, నాగశ్రవంతి,  వి.ఎన్.కృష్ణ
 
 కోలుకుంటున్న క్షతగాత్రులు
 తీవ్రంగా గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బెంగళూరు వాసి యోగేష్‌గౌడ(29) ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్లు వైద్యు లు తెలిపారు. బస్సు క్లీనర్ ఇజాజ్‌పాషా(25), వ్యాపారి మజార్‌పాషా(30), సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాజేష్(28), సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సాయి శ్రీకర్(32)లు క్రమంగా కోలుకుంటున్నట్లు ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ డా.సమి తెలిపారు.
 
 మధ్యంతర నివేదిక ఇచ్చాం: ఎఫ్‌ఎస్‌ఎల్ డెరైక్టర్
 బస్సు దగ్ధం ఘటనకు సంబంధించి మృతదేహాల గుర్తింపునకు వీలుగా ఉస్మానియా ఆస్పత్రి వైద్యులకు మధ్యంతర నివేదిక సమర్పించినట్లు రాష్ర్ట ఫొరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఏపీఎఫ్‌ఎస్‌ఎల్) డెరైక్టర్ శారద ‘సాక్షి’కి సోమవారం తెలిపారు. ఇప్పటివరకూ 19 మృతదేహాలను డీఎన్‌ఏ ద్వారా గుర్తించామని, మిగతా మృతదేహాలను త్వరితగతిన గుర్తించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు.
 
 కేశినేని ట్రావెల్స్ బస్సు సీజ్
 నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తున్న కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సును సోమవారం మేడ్చల్ ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. రాయ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కేశినేని ట్రావెల్స్ బస్సు(ఏపీ 31 టివి 5656) పలుచోట్ల ప్రయాణికులను ఎక్కించుకుంటూ దింపుతూ వస్తోంది. ఆర్టీవో శంకర్ ఆధ్వర్యంలో కొంపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించి బస్సును సీజ్ చేశారు.
 
 బెంగళూరులో పాలమూరు పోలీసుల దర్యాప్తు
 బస్సులో 45 మంది సజీవ దహనమైన  సంఘటనకు సంబంధించి మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు సోమవారం బెంగళూరులో దర్యాప్తు చేపట్టారు. స్థానిక కళాసిపాళ్యలోని జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయానికి వెళ్లి సిబ్బందిని ప్రశ్నించారు. బస్సుకు చెందిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బస్సులో రసాయనాలున్న ప్లాస్టిక్ కంటైనర్లను తీసుకెళ్లారా? అవి ఎవరివి అంటూ సిబ్బందిని అడిగారు. అనంతరం కోలారు సమీపంలో హొసకోటె వద్ద ఉన్న వోల్వో కర్మాగారానికి వెళ్లిన పోలీసులు.. బస్సు నిర్మాణంపై సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. బస్సు డ్రైవర్ ఫిరోజ్ బాషా సొంతూరు కోలారుకు వెళ్లి.. అక్కడి పోలీ సుస్టేషన్‌లో అతనిపై ఏవైనా కేసులున్నాయా అని వాకబు చేసినట్లు సమాచారం.
 
 మండే వాటివల్లే బస్సు దగ్ధమైందా?
 మండే స్వభావం ఉన్న వాటివల్లే మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద వోల్వో బస్సు నిమిషాల వ్యవధిలో దగ్ధమై ఉంటుందా? అన్న కోణంలో రాష్ట్ర నేర పరిశోధన విభాగం(సీఐడీ) దర్యాప్తు చేపట్టనుంది. ఇందుకోసం సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగనున్నాయి. అలాగే, దివాకర్ ట్రావెల్స్ పేరుతో ఉన్న బస్సు జబ్బార్ ట్రావెల్స్ పేరుతో నడుస్తున్న వైనంపై కూడా విచారణ జరగనుంది. ఇందుకోసం రవాణా శాఖ అధికారులను విచారించనున్నారు. మృతదేహాల అప్పగింత పూర్తయిన తర్వాత దర్యాప్తు ముమ్మరం కానుంది. మంటలు రేగడానికి కారణం ఏమిటి? అంత వేగంగా ఎలా వ్యాపించాయి? మండే స్వభావం ఉన్న పదార్థాలేవైనా బస్సులో ఉన్నాయా? అన్న అంశాలపై సీఐడీ దృష్టి సారించనుంది. ప్రయాణికుల సామాన్లను ఉంచే డిక్కీలో బాణసంచ వంటి పేలుడు పదార్థాలు ఉండవచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బస్సు అనుమతులకు సంబంధించి ఆర్‌టీఏ అధికారులను విచారించనున్నట్లు సీఐడీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement