భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వే స్టేషన్‌లో జూన్ 2న జరిగిన ఘోర రైలు ప్రమాదం జరిగిన నాలుగు వారాల తర్వాత డీఎన్‌ఏ పరీక్షల నివేదిక వెల్లడైంది. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కోసం ఒకరి కంటే ఎక్కువ మంది మందుకు రావడంతో వాస్తవ సంబంధీకుల వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో డీఎన్‌ఏ పరీక్షలకు ఆదేశించిన విషయం తెలిసిందే. 81 మృతదేహాల గుర్తింపు వివాదాస్పదం కావడంతో మొత్తం 88మంది నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి, ఢిల్లీ లేబరేటరీకి పంపారు. ఈ నివేదిక అందేంత వరకు స్థానిక ఎయిమ్స్‌లోని కంటైనర్లలో ఆయా మృతదేహాలను భద్రపరిచారు.
వీటిలో 29మంది పరీక్ష నివేదికలు అందాయని భువనేశ్వర్ నగరపాలక సంస్థ(బీఎంసీ) మేయర్ సులోచన దాస్ శుక్రవారం తెలిపారు. మిగిలిన మృతదేహాల పరీక్ష నివేదికలు త్వరలో చేరుతాయన్నారు. గుర్తించిన 29మంది మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించారు. ఐదుగురు తక్షణమే స్పందించి ఎయిమ్స్‌కు చేరుకున్నారు. గుర్తించిన మృతదేహాలను భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్, రైల్వే, ఒడిశా రవాణాశాఖ, ఎయిమ్స్ అధికారుల సమక్షం లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అధికారుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఇతరులు త్వరలో వస్తారని మేయర్ వివరించారు.
ఉచిత సౌకర్యాలు..
మృతదేహాలను స్వగ్రామానికి తీసుకు వెళ్లాలనుకునే కుటుంబ సభ్యులకు ఒడిశా రవాణాశాఖ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తోంది. ఎయిమ్స్ ప్రాంగణంలో దాదాపు 10 అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచినట్లు రవాణాశాఖ అధికారి తెలిపారు. కుటుంబ సభ్యులు ఎవరైనా భువనేశ్వర్‌లో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకుంటే, స్థానిక యంత్రాంగం భరత్‌పూర్, సత్యనగర్ శ్మశానవాటిక లలో వారికి అన్ని ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment