
ఐదు రోజుల పసికూనగా వెళ్లిపోయిన కూతురు 40 ఏళ్ల తరువాత తల్లి ముందు నిలబడితే.. ఆ ఆనందానికి అవధులు ఉండవు కదా! ఈ అంతులేని సంతోషానికి ఇటీవల వేదికయ్యింది చిలీలోని శాన్ ఆంటోనియో. వివరాల్లోకి వెళ్తే.. 40 ఏళ్లకిందట.. శాన్ అంటోనియాకు చెందిన 24 ఏళ్ల ఎడిటా బిజామాకు అప్పటికే ఇద్దరమ్మాయిలు. మూడో సారి కుమార్తె పుట్టింది. పిల్లల్లో పేదరికాన్ని తగ్గించడానికి అప్పటి అగస్టో పినోచెట్ నాయకత్వంలోని సైనిక నియంతృత్వ ప్రభుత్వం అంతర్జాతీయ దత్తతలే మార్గమని భావించింది.
అట్లా దాదాపు 20వేల మంది పిల్లలను బలవంతపు దత్తత ఇచ్చింది. బిడ్డ కడుపులో ఉండగా.. బిజామా సైతం దత్తతకు అంగీకరించింది. కానీ.. పాప పుట్టిన తరువాత పంపించడానికామె ఒప్పుకోలేదు. ‘ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, స్థిరత్వం లేదు. పిల్లలను ఎలా పెంచుతావ్’అంటూ ప్రశ్నించిన ప్రభుత్వాధికారులు ఆమె ఐదు రోజుల కూతురిని తీసుకెళ్లిపోయారు. బిజామా కుటుంబంలోని చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు. కానీ పేగు తెంచుకు పుట్టింది కదా.. బిజామా బిడ్డకోసం రోదిస్తూనే ఉంది. వెదకడానికి కనీసం పేరు తెలియదు. మార్గం కూడా లేదు.
మరోవైపు.. ఆమె కూతురు అడామరీ గార్సియా ఫ్లోరిడాలో పెరిగింది. ఇప్పుడు ప్యూర్టో రికోలో నివసిస్తోంది. తనను దత్తత తీసుకున్నారని చిన్నతనం నుంచే తెలుసు. కానీ కన్న తల్లిదండ్రులను కలుసుకోవడమెలాగో తెలియదు. అలాంటి సమయంలో ఆమె ఫ్రెండ్ ఒకరు.. శిశువుగా దత్తతకు వచ్చి.. చిలీలోని తన సొంత కుటుంబాన్ని కలుసుకున్న టెక్సాస్ అగ్నిమాపక అధికారి టేలర్ గ్రాఫ్ గురించి చెప్పారు. అలాంటివారికోసం సాయం చేసేందుకు ఆయన ఏర్పాటు చేసిన ‘కనెక్టింగ్ రూట్స్’స్వచ్ఛంద సంస్థ గురించి వివరించారు. వెంటనే ఆ సంస్థను కలిసింది గార్సియా. కుటుంబం గురించి తెలుసుకోవడానికి గార్సియా తపన చూసి.. ఆమెను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు సైతం ప్రోత్సాహమందించారు. సోదరి బర్త్ సరి్టఫికెట్ ద్వారా కుటుంబ వివరాలు తెలిసాయి.
అయినా.. డీఎన్‌ఏ పరీక్షతో బిజామానే గార్సియా కన్నతల్లని కనెక్టింగ్ రూట్స్ నిర్ధారించింది. వెంటనే మొదటిసారి జూమ్ ద్వారా మాట్లాడుకున్నారు. గార్సియాది ప్యూర్టో రికన్ స్పానిష్, మయామీ యాస. కానీ తల్లి, అక్కలది విలక్షణమైన చిలీ యాస. మొదటిసారి సంభాషణ కష్టమే అయ్యింది. ఒకరినొకరు చూసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. గతవారం కుటుంబం చెంతకు చేరుకుంది గార్సియా. 41 ఏళ్ల గార్సియాకు తల్లికి, ఇద్దరు అక్కలకు దగ్గరకు పోలికలున్నాయి. అంతేకాదు.. పెద్దక్కకు ఇష్టమున్నట్టే ఆమెకూ కుక్కలంటే చాలా ఇష్టం. ఇప్పుడు గార్సియా చిలీయాస, వంటకాలు, సంగీతం అన్నింటినీ నేర్చుకుంటోంది. అక్కలతో ఎక్కువకాలం గడపాలని నిర్ణయించుకుంది.
కనెక్టింగ్ రూట్స్ ఈ ఏడాది చిలీకి తీసుకువచి్చన ఐదుగురు దత్తతదారుల్లో గార్సియా ఒకరు. ఇది ఆ ఎన్జీవో చేసిన నాలుగవ పునరేకీకరణ. ఎన్జీవో చర్యలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. 40 ఏళ్ల కిందట దత్తతకు పోవడంతో ఇప్పుడు తల్లులు పెద్దవారవుతున్నారు. కొందరు చనిపోయారు. అందుకే ఆలస్యం కాకముందే సాధ్యమైనన్ని ఎక్కువ కుటుంబాలను తిరిగి కలపాలని లక్ష్యంగా పెట్టుకుంది కనెక్టింగ్ రూట్స్.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment