San Antonio
-
విమానం ఇంజిన్ లోపలికి లాగేసింది!
హూస్టన్: ఊహించని ఘటన ఇది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం 23న రాత్రి 10.25 గంటల సమయంలో లాస్ ఏంజెలెస్ నుంచి టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఎరైవల్ గేట్ వద్దకు చేరిన ఆ విమానంలోని ఒక ఇంజిన్ పనిచేస్తోంది. ఇంజిన్ వేగం ప్రభావానికి అదే సమయంలో అటుగా వెళ్లిన ఉద్యోగి ఒకరిని లోపలికి లాగేసింది. అతడు చనిపోయినట్లు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ ఏజెన్సీ(ఎన్టీఎస్బీ)తెలిపింది. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై డెల్టా ఎయిర్ లైన్స్ అధికారులను విచారిస్తున్నట్లు పేర్కొంది. మృత్యువాత పడిన ఉద్యోగి వివరాలను వెల్లడించలేదు. విమానాశ్రయాల్లో హ్యాండ్లింగ్ కార్యకలాపాలకు కాంట్రాక్టు సేవలందించే యునిఫి ఏవియేషన్ సంస్థ అతడిని నియమించుకున్నట్లు సమాచారం. కాగా, గత ఏడాది అలబామా ఎయిర్‌పోర్టులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. విమానం ఇంజిన్ ఒక ఉద్యోగిని లోపలికి గుంజుకోవడంతో అతడు చనిపోయాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన అధికారులు ఇటీవలే సదరు విమాన సంస్థకు రూ.12.80 లక్షల జరిమానా విధించారు. -
‘తప్పు చేశాను.. నాకేం కాదనుకున్నాను’
న్యూయార్క్ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. దాదాపు అన్ని దేశాలు ఈ వైరస్‌తో పోరాడుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. అగ్ర రాజ్యంలో ఇప్పటి వరకు 34,13,995 మంది కరోనా బారిన పడగా.. 1,35,000 మంది కరోనాతో పోరాడి మృతి చెందారు. ఓ వైపు కరోనా ప్రజలను గడగడలాస్తున్నప్పటికీ వైరస్ తీవ్రతను కొంతమంది పట్టించుకోవడం లేదు. తమకు ఏం కాదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. (అగ్రరాజ్యంలో కరోనావిలయతాండవం) ఈ క్రమంలో కోవిడ్ సోకిన వ్యక్తి ఇచ్చిన పార్టీకి హాజరవ్వడం వల్ల మహమ్మారి సోకి ఓ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది. ఇటీవల ఓ వ్యక్తి కరోనా వ్యాధి సోకి బాధపడుతుంటే.. తమకు వైరస్ సోకుతుందో లేదో చూడటానికి స్నేహితులతో కలిసి ఆదివారం పార్టీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పార్టీకి హాజరైన ఓ యువకుడు లక్షణాలు లేకపోయినప్పటికీ కరోనా సోకి మృత్యువాత పడ్డాడు. మహమ్మారితో మరణించే ముందు ఆ వ్యక్తి నర్సుతో ఇలా మాట్లాడాడు. ‘నేను తప్పు చేశానని అనిపిస్తోంది. కరోనా వ్యాధి అబద్దమని, తప్పుడు వార్త అని అనుకున్నాను. నేను యువకుడిని కాబట్టి నాకు వైరస్ సోకదని విర్రవీగాను. వైరస్ కంటికి కనిపించకపోవడంతో నాకు ఏం కాదని భ్రమపడ్డాను’ అని చివరి క్షణాల్లోని తన ఆవేదనను చెప్పుకొచ్చాడు. (అంత్యక్రియల్లో పాల్గొన్న 20 మందికి పాజిటివ్) యువకుడి మరణంపై శాన్ఆంటోనియోలోని మెథడిస్ట్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ జేన్ఆపిల్బీ మాట్లాడుతూ.. యువకుడు అనారోగ్యంగా కనిపించకపోయినప్పటికీ పరీక్షలు నిర్వహించడం వల్ల అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించి పోయిందని తెలిపారు. దేశంలో ఆందోళనకర స్థాయిలో కరోనా మరణాలు సంభవిస్తున్నప్పటికీ యువత వైరస్ తీవ్రతను అర్థం చేసుకోవడం లేదన్నారు. కరోనాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యువకులు ఎంతో మంది వైరస్ బారిన పడుతునట్లు పేర్కొన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో భారీ స్థాయిలో ప్రమాదం ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. (భార్యను బతికించండని వేడుకోవడం కలచివేసింది..) -
ప్రజలు, కార్యకర్తలు వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలవాలి
టెక్సాస్: ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నానని భరోసానిస్తూ దిగ్విజయంగా ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి టెక్సాస్ రాష్ట్రం శాన్ అంటోనియో నగరంలోని ఆ పార్టీ అభిమానులు అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వారు కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జననేతపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం అందరికి తెలిసిందేనని అన్నారు. తనపై హత్యాయత్నం జరిగిన అవేమీ లెక్కచేయకుండా, ప్రజలకిచ్చిన మాట కోసం జననేత మడమ తిప్పకుండా ప్రజాసంకల్పయాత్రను కొనసాగిస్తున్నారని తెలిపారు. నిరంతరం ప్రజల కోసం తపిస్తు, ప్రజల మధ్యలో ఉండే వైఎస్ జగన్‌కు ప్రజలు, కార్యకర్తలు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ అభిమానులు వేణుగోపాల్ రెడ్డి కొత్తపల్లి, పరమేశ్వరరెడ్డి నంగి, ఆదినారాయణ రెడ్డి లక్కు, రెడ్డిభాస్కర్ రెడ్డి బండ్లపల్లి, సునీల్‌కుమార్‌రెడ్డి మేడ, రాజశేఖర్‌రెడ్డి మాకిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీరామ్‌రెడ్డి, నరసింహారావు, అంజన్ రెడ్డి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. -
సాన్ ఆంటోనియోలో సద్దుల బతుకమ్మ సంబరాలు
బతుకమ్మ సంబరాలు విదేశాల్లో కూడా ఉత్సాహంగా జరుగుతున్నాయి. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గల సాన్ అంటోనియో నగరంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాన్ ఆంటోనియో (టాగ్సా) నేతృత్వంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలలో ఆడబిడ్డలు, చిన్నారులు భక్తి శ్రద్ధలతో కోలాహంగా బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలాడుతూ మహా గౌరీదేవిని బతుకమ్మగా పూజించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మను నీటి కొలను వరకు ఊరేంగిచి "పోయి రావమ్మా..." అంటూ నిమజ్జనం చేసి ఆ పై వెంట తెచ్చుకొన్న సద్దులు, నువ్వుల పొడి, పల్లీపొడి, కొబ్బరి పొళ్లను అందరితో పంచుకొని వీడుకోలు చెప్పారు. సాన్ ఆంటోనియోలో గత ఏడెనిమిదేళ్లుగా సంప్రదాయంగా జరుపుకొంటున్న ఈ బతుకమ్మ వేడుకలలో అతి పెద్ద సంఖ్యలో హాజరైన తెలంగాణ వాసులకు టాగ్సా కార్యవర్గ సభ్యులు, కార్యక్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవత్సరపు వేడుకలు మరపు రాని అనుభవమని వర్ణించారు. -
కారులో ప్రాణం వదిలిన పసివాడు
హెలోటెస్: తండ్రి నిర్లక్ష్యం కారణంగా 7 నెలల పసిబాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన అమెరికాలోని టెక్సాస్ లో చోటు చేసుకుంది. హాట్ స్పోర్ట్ యూటిలిటీ వెహికిల్(ఎస్ యూవీ) చిన్నారిని రోజంతా వదిలివేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. శాన్ అంటోరియాలోని వాల్ మార్ట్ పార్కింగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. హెలోటెస్ సబర్బన్ లోని స్టోర్ లో బాలుడి తండ్రి పనిచేస్తున్నాడు. తన కొడుకును డేర్ కేర్ సెంటర్ లో వదిలిపెట్టడం మర్చిపోయి కారులోనే వదిలేశాడు. ఉదయం 6.15 గంటలకు విధులకు వెళ్లి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తిరిగొచ్చాడు. కారులో అపస్మారక స్థితిలో పడివున్న కొడుకును గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే చిన్నారి మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కారులో ఉష్టోగ్రత కనీసం 100 డిగ్రీలు ఉంటుంది. హాట్ కారుల్లో చిన్నారుల మరణాలు అమెరికాలో పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 27 మంది పిల్లలు మృతి చెందారు. టెక్సాస్ లోనే ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని కిడ్స్ అండ్ కార్స్.ఓఆర్జీ వ్యవస్థాపకుడు జనెటీ ఫెనెల్ తెలిపారు. -
తుదిఘడియల్లోనూ చేతిలో చెయ్యేసి..!
58 ఏళ్ల వైవాహిక బంధం వారిది. చివరిక్షణంలో మృత్యువు కూడా వారిని వేరు చేయలేకపోయింది. ముగ్గురు పిల్లలతో నిండు సంసార జీవితాన్ని ఆస్వాదించిన ఆ జంట చివరిఘడియల్లోనూ పక్కపక్కనే పడుకొని.. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని తుదిశ్వాస విడిచింది. టెక్సాస్‌లోని సాన్ అంటోనియోలో ఈ ఘటన జరిగింది. సాన్ అంటోనియోకు చెందిన జార్జ్, ఒరా లీ రోడ్రిగ్యుజ్ తొలిసారి ఓ మీట్ మార్కెట్లో కలుసుకున్నారు. ఆ తర్వాత పాఠశాలలో కలిసి చదువుకున్నారు. అప్పడే వీరి మధ్య స్నేహం ఏర్పడింది. జార్జ్ మిలిటరీలో పనిచేసి వచ్చిన తర్వాత ఒరా లీని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కలిగారు. గడిచినవారమే 58వ పెళ్లిరోజున ఘనంగా జరుపుకున్న ఈ దంపతులు వయస్సు మీద పడటంతో అనారోగ్యానికి గురయ్యారు. జార్జ్ కు స్వల్పంగా గుండెపోటు వచ్చింది. ఈ నేపథ్యంలో దంపతులిద్దరు పక్కపక్కనే చేతులు పట్టుకొని పడుకొన్నారని, నిద్రలో తన తండ్రి జార్జ్ ప్రాణాలు విడవగా, ఆ తర్వాత మూడు గంటలకు తన తల్లి ఒరా కూడా కన్నుమూసిందని వారి కూతురు కొరినా మార్టినెజ్ స్థానిక ఫాక్స్ 29 చానెల్‌కు తెలిపింది. అచ్చం ‘నోట్‌బుక్’ హాలీవుడ్ సినిమాలో జరిగినట్టే తమ తల్లిదండ్రులు ఒకేసారి ప్రాణాలు విడిచారని, తుదిఘడియల్లోనూ వారు ఒకరి చేతులను ఒకరు పట్టుకొని ఉన్నారని, ఒకరిని విడిచి ఒకరు ఉండలేని వారి అనుబంధం ఇందుకు కారణమని ఆమె వివరించింది. -
సాన్ అంటానియోలో 'మీట్ అండ్ గ్రీట్'
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాన్ అంటానియో(టీఏజీఎస్ఏ) టెక్సాస్ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సాక్షి ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి హాజరయ్యారు. ఔత్సాహికులైన తెలంగాణ ప్రాంత ఎన్నారైలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ, ఆర్థిక కార్యచరణలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమాన్ని టీఏజీఎస్ఏ ప్రెసిడెంట్ కొండా శ్రీనివాస్ ప్రారంభించగా, అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు జగదీశ్వర్ ప్రముఖ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డిని సభకు పరిచయం చేశారు. మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ కు సమన్వయకర్తగా టీఏజీఎస్ఏ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ శ్రీకాంత్ బిల్లా, పాండు కదిరే వ్యవహరించారు. జూన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించడంలో భాగంగా ఇక్కడ 'మీట్ అండ్ గ్రీట్' నిర్వహించారు. టీఏజీఎస్ఏ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ దొంతుల, వంశీ గొబ్బురు, స్మరణ్ పాకాల, జి.మనోహర్, శ్రీ సంగిశెట్టి, వేణు కొలను, గంజి మల్లిక్ తో పాటు వెంకట్ పాకాల, పాండు కదిరే, వెంకట్ కొమ్మెర, హరిరెడ్డి, రమేష్ సిద్ధబత్తుల, లక్ష్మారెడ్డి దొంతుల, సుధీర్ రెడ్డి, ప్రవీణ్ అనుముల, తదితరులు 'మీట్ అండ్ గ్రీట్' పాల్గొన్నారు.