సాన్ ఆంటోనియోలో సద్దుల బతుకమ్మ సంబరాలు
బతుకమ్మ సంబరాలు విదేశాల్లో కూడా ఉత్సాహంగా జరుగుతున్నాయి. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గల సాన్ అంటోనియో నగరంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాన్ ఆంటోనియో (టాగ్సా) నేతృత్వంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలలో ఆడబిడ్డలు, చిన్నారులు భక్తి శ్రద్ధలతో కోలాహంగా బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలాడుతూ మహా గౌరీదేవిని బతుకమ్మగా పూజించారు.
రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మను నీటి కొలను వరకు ఊరేంగిచి "పోయి రావమ్మా..." అంటూ నిమజ్జనం చేసి ఆ పై వెంట తెచ్చుకొన్న సద్దులు, నువ్వుల పొడి, పల్లీపొడి, కొబ్బరి పొళ్లను అందరితో పంచుకొని వీడుకోలు చెప్పారు. సాన్ ఆంటోనియోలో గత ఏడెనిమిదేళ్లుగా సంప్రదాయంగా జరుపుకొంటున్న ఈ బతుకమ్మ వేడుకలలో అతి పెద్ద సంఖ్యలో హాజరైన తెలంగాణ వాసులకు టాగ్సా కార్యవర్గ సభ్యులు, కార్యక్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవత్సరపు వేడుకలు మరపు రాని అనుభవమని వర్ణించారు.