కన్నపేగు పోరాటం.. ఆ బిడ్డ అనుపమ బిడ్డే అయి ఉండాలని.. | Anupama child brought back to Thiruvananthapuram | Sakshi
Sakshi News home page

కన్నపేగు పోరాటం.. ఆ బిడ్డ అనుపమ బిడ్డే అయి ఉండాలని..

Published Tue, Nov 23 2021 12:50 AM | Last Updated on Tue, Nov 23 2021 4:31 PM

Anupama child brought back to Thiruvananthapuram - Sakshi

కేరళ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఓ సంఘటన ఈ సోమవారం నాడు చోటు చేసుకుంది. అధికార యంత్రాంగం, పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తంగా విధుల్లో నిమగ్నమై ఉన్నారు. జరగాల్సిన కార్యక్రమం యథావిధిగా నడుస్తోంది. మీడియా అటెన్షన్‌ కూడా ఈ విషయం మీదనే కేంద్రీకృతమై ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టిన కేసు అది. అనుపమ అనే ఓ తల్లి తన బిడ్డ కోసం చేస్తున్న పోరాటం. కన్నపేగు చేస్తున్న పోరాటంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం భాగమైంది. పోలీసులు బిడ్డను వెతికి రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఇక అనుపమ చేతిలో పెట్టడమే తరువాయి.

బిడ్డను చూపించండి!
ఆదివారం నాటి రాత్రి పోలీసులు బిడ్డతో కేరళ రాజధాని తిరువనంతపురం చేరారు. ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్‌ ఆదేశం మేరకు డీఎన్‌ఏ పరీక్ష కోసం సోమవారం నాడు బిడ్డ నుంచి నమూనా సేకరించారు. డీఎన్‌ఏ పరీక్ష తమ కళ్ల ముందే జరగాలని అనుపమ పట్టుపట్టింది. తన బిడ్డ నమూనాలను మార్చివేయరనే నమ్మకం ఏమిటని ప్రశ్నించింది అనుపమ. ఒక్కసారి బిడ్డను కళ్లారా చూస్తానని ప్రాధేయపడింది.

ఇప్పటి వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో అంతా సవ్యంగా జరుగుతుందనే నమ్మకం కలగడం లేదని ఆమె పడుతున్న ఆవేదన, ఆందోళన అందరికీ అర్థమవుతోంది. నమూనా సేకరణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్‌ చేసినట్లు చెబుతూ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి. అనుపమ, ఆమె ప్రేమికుడు, బిడ్డ నమూనాలు స్థానిక రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీకి చేరినట్లు ఆ రాష్ట్రంలోని కౌముది మీడియా తెలిపింది. నమూనాలు సరిపోలినట్లు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత న్యాయపరమైన నిబంధనలు పూర్తి చేసి బిడ్డకు అనుపమకు ఇస్తారు. అప్పటివరకు బిడ్డను జిల్లా చైల్డ్‌ ప్రొటెషన్‌ ఆఫీసర్‌ సంరక్షణలో ఉంచుతారు.

ఆ బిడ్డ ఈ బిడ్డేనా!
జరుగుతున్న పరిణామాలు అనుపమకు సంతోషాన్నిస్తున్నట్లే కనిపిస్తున్నట్లు స్థానిక మీడియా చెప్తోంది. అలాగే పోలీసులు తీసుకువచ్చిన బిడ్డ అనుపమకు పుట్టిన బిడ్డ అనడానికి తార్కికపరమైన ఆధారాలు అందుతున్నాయి. బిడ్డ మాయమైన తర్వాత ఒకటి– రెండు రోజుల తేడాలో ఆ రాష్ట్రంలో అమ్మ తొట్టిల్‌ (ఉయ్యాల) పథకంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉయ్యాలలోకి ఇద్దరు బిడ్డలు వచ్చారు. వారిలో ఒక బిడ్డకు గత నెలలో పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. ఓ బిడ్డను దత్తత ఇచ్చినట్లు తెలిసింది. ఆ బిడ్డ కోసం గాలించి ఆదివారం నాడు విజయవంతంగా ఛేదించారు. కన్నపేగు పోరాటం వృథా కాదని, ఆ బిడ్డ అనుపమ బిడ్డే అయి ఉండాలని రాష్ట్రం మొత్తం కోరుకుంటోంది. అనుపమ ఒడికి చేరే క్షణం కోసం ఎదురు చూస్తోంది.

ఇదీ జరిగింది!
అనుపమ గత ఏడాది అక్టోబర్‌లో ఓ బిడ్డకు తల్లయింది. ఆమె కేరళ సమాజంలో అగ్రవర్ణంగా గుర్తింపు పొందిన సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఆమె ప్రేమించిన వ్యక్తి షెడ్యూల్డ్‌ కులానికి చెందిన వ్యక్తి. అనుపమ ప్రేమను అంగీకరించని ఆమె తండ్రి స్వయానా కూతురినే మోసం చేశాడు. ఆమె కన్నబిడ్డను ఆమె నుంచి వేరు చేశాడు. ‘బిడ్డను రహస్య ప్రదేశంలో సంరక్షిస్తున్నట్లు’ కొద్ది నెలల పాటు ఆమెను మభ్యపెట్టాడు. తాను మోసపోయానని తెలిసిన తర్వాత ఆమె ఇంటి నుంచి పారిపోయి, ప్రేమికుడితో కలసి పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చింది.

ఆమె తండ్రి సమాజంలో పరపతి కలిగిన వ్యక్తి, కమ్యూనిస్ట్‌ నాయకుడు, ప్రజాప్రతినిధి కూడా కావడంతో పోలీసులు మొదట్లో ఆమె కంప్లయింట్‌ను ఫైల్‌ చేయడానికి మీనమేషాలు లెక్కపెట్టారు. ఆమె పోలీసులు, శిశు సంక్షేమశాఖతోపాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులను కలిసి తన బిడ్డను తనకు ఇప్పించమని వేడుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అభ్యర్థించింది. అనుపమ తండ్రి చేసిన ఘోరం రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారి తీసింది. మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ నెల 18వ తేదీన వెలువడిన ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో కదలిక వచ్చింది. సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన పోలీసులు బిడ్డను సొంత రాష్ట్రానికి తీసుకువెళ్లారు. బిడ్డ రాష్ట్రానికి చేరిన వార్త సోమవారంనాడు ఆ రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement