Government of Kerala
-
జాక్‌పాట్ కొట్టిన మెకానిక్.. లాటరీలో రూ.25 కోట్లు
మాండ్య: కర్ణాటకకు చెందిన స్కూటర్ మెకానిక్ ఒకరు జాక్‌పాట్ కొట్టేశారు. మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్ పాషాకు కేరళ ప్రభుత్వం నిర్వహించే తిరుఓనమ్ లాటరీలో ఏకంగా రూ.25 కోట్లు దక్కాయి. కేరళలోని స్నేహితుడికి అప్పుడప్పుడు వెళ్లే అల్తాఫ్ ప్రతిసారీ అక్కడ లాటరీ టిక్కెట్ కొనడం అలవాటు. ఇటీవల అక్కడికి వెళ్లిన అల్తాఫ్ వయనాడ్ జిల్లా సుల్తాన్ బాతెరీలో రూ.500 పెట్టి టిక్కెట్ కొనుగోలు చేశారు. ఈ లాటరీ ఈ నెల 9న తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డ్రా తీశారు. అల్తాఫ్‌ను మొదటి బహుమతి వరించింది. అల్తాఫ్ కొన్న టీజీ 43422 నంబర్ టిక్కెట్ ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్న విషయాన్ని వయనాడ్ జిల్లా పనమారమ్‌లోని లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పారు. మొదట్లో నమ్మలేదు. కానీ, ఆ తర్వాత నిజమేనని బంధువులు చెప్పడంతో ఎగిరి గంతేశారు. లాటరీ సొమ్ము కోసం కుటుంబంతో కలిసి తిరువనంతపురం వెళ్లారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇటీవలే ఆ టిక్కెట్‌ను తన పక్క దుకాణదారుకు అమ్మజూపగా, కొనేందుకు నిరాకరించాడని అల్తాఫ్ తెలిపారు. గంటలోనే లాటరీ విజేతగా నిలిచినట్లు తనకు సమాచారం అందిందన్నారు.‘బెంగళూరులో సెటిలవుతా.నా కూతురి పెళ్లి ఘనంగా చేద్దామనుకుంటున్నా. అప్పులన్నీ తీర్చేస్తా’అని అల్తాఫ్ ఆనందంతో చెప్పారు. రూ.25 కోట్ల మొత్తంలో అన్ని రకాల పన్నులు పోను అల్తాఫ్ చేతికి రూ.13 కోట్లు వస్తాయని చెబుతున్నారు. -
పాఠ్యపుస్తకాల్లో లింగసమానత్వ చిత్రాలు
కొచ్చి: వంటగది అనగానే అమ్మ వండుతున్నట్లు చూపే ఫొటోలు పాఠ్యపుస్తకాల్లో ముద్రిస్తుంటారు. ఇలాంటి ధోరణికి చెల్లుచీటి ఇస్తూ కేరళ ప్రభుత్వం లింగసమానత్వ చిత్రాలకు పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చోటు కలి్పంచింది. అమ్మ అంటే ఉద్యోగం చేయదని, ఇంట్లోనే ఉంటుందనే భావన బడిఈడు పిల్లల్లో నాటుకుపోకుండా ఉండేందుకు, సమానత్వాన్ని వారి మెదడులో పాదుకొల్పేందుకు కేరళ సర్కార్ కృషిచేస్తోంది. ఈ ప్రయత్నానికి ఉపాధ్యాయుల నుంచి మద్దతు లభిస్తోంది. మూడో తరగతి మలయాళం మాధ్యమం పాఠ్యపుస్తకం పేజీలను కేరళ సాధారణ విద్యాశాఖా మంత్రి వి.శివాన్కుట్టి సోషల్‌మీడియాలో షేర్చేశారు. తండ్రి వంటింట్లో కూర్చుని పచ్చి కొబ్బరి తురుము తీస్తున్నట్లు ఒక పేజీలో డ్రాయింగ్ ఉంది. తన కూతురు కోసం తండ్రి అల్పాహారం సిద్ధంచేస్తున్నట్లు మరో పేజీలో డ్రాయింగ్ ఉంది. ఇంటి పనిలో పురుషులు ఎంత బాధ్యతగా ఉండాలని ఈ చిత్రాలు చాటిచెబుతున్నాయని నెటిజన్లు మెచ్చుకున్నారు. -
గవర్నర్‌పై సుప్రీంకోర్టులో కేరళ పిటిషన్
న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులకు అంగీకారం తెలపడంలో రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్ విపరీతమైన జాప్యం చేస్తున్నారని కేరళ ప్రభుత్వం ఆక్షేపించింది. బిల్లులకు త్వరగా అంగీకారం తెలిపేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ లు చేసింది. ప్రజల హక్కులను గవర్నర్ అగౌరవపరుస్తున్నారని పేర్కొంది. ప్రస్తుతం 8 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. వాటిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలియజేసింది. ఇవన్నీ ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులేనని ఉద్ఘాటించింది. -
స్కూలు సిలబస్‌లో ‘పోక్సో’ చట్టం
తిరునంతపురం: పోక్సో చట్టాన్ని పాఠ్యాంశంగా తీసుకువచ్చేందుకు తాజాగా కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర హైకోర్టు ప్రశంసించింది. పాఠశాల స్థాయి విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించడంలో ఇప్పటికే 12 ఏళ్లు ఆలస్యమైందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ చట్టంపై అవగాహన లేకపోవడంతోనే స్కూలు విద్యార్థులు, టీనేజర్లపై లైంగిక దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. ఇటీవల ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ బెచు కరియన్ థామస్ ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్నారులు, ముఖ్యంగా టీనేజర్లపై లైంగిక నేరాలు ఇటీవల పెరిగి పోయాయని ఆయన అన్నారు. పోక్సో చట్టంలోని తీవ్రమైన శిక్షల గురించి తెలియకనే చాలా మంది విద్యార్థులు పరస్పరం లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారన్నారు. పోక్సో చట్టంపై వారికి ఎలాంటి అవగాహన లేదన్నారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం.. లైంగిక నేరాలు, వాటి పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గాను పాఠశాల సిలబస్‌లో పోక్సో చట్టం చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ), కేరళ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కేరళ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ కలిసి బడికి వెళ్లే బాలల్లో లైంగిక నేరాలపై అవగాహన కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను హైకోర్టు ప్రశంసించింది. -
ఆ మాత్రం ఎవరైనా చేస్తారు.. రాబియా వేరే పని కూడా చేసింది!
ఆమె క్లాస్‌లో ఆమె అమ్మ, అమ్మమ్మ విద్యార్థుల్లా పాఠాలు విన్నారు. అమ్మమ్మ తన మనవరాలిని ‘టీచర్’ అంటూ పిలిచేది. ఆ పల్లెటూళ్లో చదువురాని గృహిణులందరూ ఆమె స్కూల్లో బుద్ధిగా చదువుకునేవారు. కేరళ ప్రభుత్వం అక్షరాస్యత ఉద్యమం చేపట్టడానికి ఆమె కూడా స్ఫూర్తి. జీవితం ఆమెను చిన్నప్పుడే చక్రాల కుర్చీకి పరిమితం చేసింది. కాని చదువే మనిషికి చలనం ఇస్తుందని అందరికీ చదువు అందే పనిని చూసింది. కె.వి.రాబియా కేరళలో ఎందరికో స్ఫూర్తి. నేడు పద్మశ్రీ ప్రకటనతో దేశానికి కూడా స్ఫూర్తిగా నిలిచింది. 56 ఏళ్ల రాబియా జీవితం కేరళలో స్కూలు పిల్లల టెక్ట్స్‌బుక్స్‌లో పాఠ్యాంశంగా ఉంది. కేరళ అనే ఏముంది... దేశంలో ఏ భాషలోని పిల్లలలైనా ఆమె జీవితాన్ని పాఠంగా చదువుకోవాలి. స్ఫూర్తి పొందాలి. ఎందుకంటే అలాంటి పోరాటం చేసిన వారు చాలా తక్కువ ఉంటారు. స్త్రీలలో మరీ తక్కువగా ఉంటారు. అందుకే ప్రతి చిన్నారి, యువతి, గృహిణి, ఉద్యోగిని రాబియాను చూసి జీవితంలో అలుపెరగని పోరాటం ఎలా చేయవచ్చో నేర్చుకోవచ్చు. ఎందుచేత ఆమె స్ఫూర్తి? ఆమె మలప్పురం జిల్లాలోని తిరురంగడి అనే ఊరికి దగ్గరలోని ‘వెల్లిలక్కడు’ అనే ఊరిలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రికి రేషన్‌షాప్ ఉండేది. రాబియాకు చదువుకోవాలని బాగా కోరిక. కాని 9వ క్లాసుకు రాగానే ఆమెకు రెండు కాళ్లకూ పోలియో వచ్చింది. అయినా సరే ఇంటర్ వరకూ మేనమామ సహాయంతో కాలేజీకి వెళ్లింది. కాని ఇంటర్లో నడుము కింద నుంచి పూర్తిగా చచ్చుబడి వీల్‌చైర్‌కు పరిమితం అవ్వాల్సి వచ్చేసరికి ఇక కాలేజీ మానుకుంది. కాని చదువంటే ఇష్టం. ఎలా? ఇంట్లోనే ఉంటూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ ఆ తర్వాత పిజి చదవడం మొదలెట్టింది. ఆ మాత్రం ఎవరైనా చేస్తారు? రాబియా వేరే పని కూడా చేసింది. ఆడవాళ్ల స్కూలు రాబియా ఉన్న పల్లెటూళ్లో అందరూ పేదవాళ్లు. చిన్న చిన్న పనులు చేసుకునేవారు. ఆ ఇళ్ల ఆడవాళ్లకు అక్షరం ముక్క చదువు లేదు. నేను ఇంటి దగ్గరే ఉన్నా కదా వీరికి ఎందుకు చదువు చెప్పకూడదు అని డిగ్రీలోనే రాబియాకు అనిపించింది. వెంటనే ఆమె తన ఇంటిలోనే స్కూల్ ప్రారంభించింది. కేవలం ఆడవాళ్లకే ఆ స్కూలు. ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ఆమె ఇల్లు ‘కడలుండి’ అనే నది ఒడ్డున ఉంటుంది. మెల్లగా అదొక గురుకులంలాగా తయారైంది. రాబియా టీచర్ అసలు ఏమాత్రం రాజీ పడకుండా ఆడవాళ్లకు చదువు చెప్పడం, వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉపాధి అవకాశాలు అందుతాయో తెలియచేసి, ప్రతి ఇంటికి ఏదో ఒక దారి చూపడం మొదలెట్టింది. రాబియా తల్లి, అమ్మమ్మ ఇది గమనించి ఆఖరుకు వారు కూడా ఆమె స్టూడెంట్స్‌గా మారక తప్పలేదు. తనను ఎత్తుకుని ఆడించినవారు తన దగ్గర బుద్ధిగా పాఠాలు వినడం రాబియాకు చాలా సంతోషం కలిగించింది. ఈ వార్త అటూ ఇటూ వెళ్లి ప్రభుత్వానికి చేరింది. ఒకరోజు అధికారులు వచ్చేసరికి రాబియా క్లాసులో 80 ఏళ్ల పెద్దామె నుంచి 8 ఏళ్ల పాపాయి వరకూ చదువుకుంటూ కనిపించారు. అధికారులు చాలా సంతోషించి ఏం కావాలి అని అడిగితే మా ఊరికి రోడ్ వేయండి అంది రాబియా. వెంటనే రోడ్ వేసిన అధికారులు దానికి ‘అక్షర రోడ్’ అని పేరు పెట్టారు. అంతే కాదు లైట్లు, నీటి వసతి ఇలాంటివన్నీ రాబియా వల్ల ఆ ఊరికి వచ్చాయి. ‘చలనం’ సంస్థ రాబియాకు తెలుసు... తాను తన కాళ్ల మీద నడవలేనని. కాని తన చదువు సమాజాన్ని నడిపించగలదు... తాను చెప్పే చదువు నలుగురికీ చలనం ఇవ్వగలదు... అందుకే ఆమె ‘చలనం’ అనే సంస్థను స్థాపించి ముఖ్యంగా దివ్యాంగులకు, మానసిక అవస్థలు ఉన్న పిల్లలకు స్కూళ్లు తెరిచింది. అంతే కాదు... తన ఇంటిని ఒక నాలెడ్జ్ సెంటర్‌గా మార్చింది. లైబ్రరీ, కౌన్సెలింగ్... అన్నీ అక్కడే. తన్నుకొని తనదగ్గరకు వచ్చిన భార్యాభర్తలకు ఆమె కౌన్సెలింగ్ ఇచ్చేది. అయితే ఆమె జీవితానికి ఇంకా పరీక్షలు ఎదురయ్యాయి. కేన్సర్ సర్వయివర్ 32 ఏళ్ల వయసులో ఆమెకు కేన్సర్ వచ్చింది. దానిని ఆమె విజయవంతంగా ఎదుర్కొంది. శరీర బలం కంటే మనోబలంతోనే ఆమె దానిని జయించింది. ఆ తర్వాత 40 ఏళ్ల వయసులో ఆమె బాత్రూమ్లో పడటంతో వెన్నుపూస ఆమె శరీరాన్ని మరింత చలనం లేకుండా చేసింది. ఆ సమయంలో ఆమె పూర్తిగా మంచం మీద ఉండి ‘మౌన రోంబనంగల్’ (నిశ్శబ్ద కన్నీరు) అనే తన జ్ఞాపకాల గ్రంథాన్ని రాసింది. అది హిట్ అయ్యి వచ్చిన డబ్బుతో ఆమె వైద్యం చేయించుకుంది. ఆ తర్వాత ‘స్వప్నాలకు రెక్కలుంటాయి’ అనే పేరుతో ఆత్మకథను రాసింది. మనిషి ఎంత వీలుంటే అంత చదువుకోవాలని జ్ఞానమే సమాజాన్ని మరింత వికాసంలోకి తీసుకెళుతుందని రాబియా గట్టిగా నమ్ముతుంది. ప్రచారం చేస్తుంది. ఆమె కృషి వల్ల ఆమె ఊరి చుట్టుపక్కల 8 గ్రామాలు పూర్తిగా అక్షరాస్యతలోకి ప్రయాణించాయి. ప్రజలు రాబియాను ఎంతో అభిమానిస్తారు. ఏ కృషీ వృధా పోదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆమెను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. గొప్పవాళ్లు కొందరు చక్రాల కుర్చీకి పరిమితం కావచ్చు. కాని వారి సంకల్పం ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉంటుంది. ఆ సంకల్పం అందరికీ దక్కాలి. రాబియాను అభినందిస్తున్న పలువురు ప్రముఖులు -
కన్నపేగు పోరాటం.. ఆ బిడ్డ అనుపమ బిడ్డే అయి ఉండాలని..
కేరళ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఓ సంఘటన ఈ సోమవారం నాడు చోటు చేసుకుంది. అధికార యంత్రాంగం, పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తంగా విధుల్లో నిమగ్నమై ఉన్నారు. జరగాల్సిన కార్యక్రమం యథావిధిగా నడుస్తోంది. మీడియా అటెన్షన్ కూడా ఈ విషయం మీదనే కేంద్రీకృతమై ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టిన కేసు అది. అనుపమ అనే ఓ తల్లి తన బిడ్డ కోసం చేస్తున్న పోరాటం. కన్నపేగు చేస్తున్న పోరాటంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం భాగమైంది. పోలీసులు బిడ్డను వెతికి రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఇక అనుపమ చేతిలో పెట్టడమే తరువాయి. బిడ్డను చూపించండి! ఆదివారం నాటి రాత్రి పోలీసులు బిడ్డతో కేరళ రాజధాని తిరువనంతపురం చేరారు. ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఆదేశం మేరకు డీఎన్ఏ పరీక్ష కోసం సోమవారం నాడు బిడ్డ నుంచి నమూనా సేకరించారు. డీఎన్ఏ పరీక్ష తమ కళ్ల ముందే జరగాలని అనుపమ పట్టుపట్టింది. తన బిడ్డ నమూనాలను మార్చివేయరనే నమ్మకం ఏమిటని ప్రశ్నించింది అనుపమ. ఒక్కసారి బిడ్డను కళ్లారా చూస్తానని ప్రాధేయపడింది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో అంతా సవ్యంగా జరుగుతుందనే నమ్మకం కలగడం లేదని ఆమె పడుతున్న ఆవేదన, ఆందోళన అందరికీ అర్థమవుతోంది. నమూనా సేకరణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేసినట్లు చెబుతూ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి. అనుపమ, ఆమె ప్రేమికుడు, బిడ్డ నమూనాలు స్థానిక రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చేరినట్లు ఆ రాష్ట్రంలోని కౌముది మీడియా తెలిపింది. నమూనాలు సరిపోలినట్లు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత న్యాయపరమైన నిబంధనలు పూర్తి చేసి బిడ్డకు అనుపమకు ఇస్తారు. అప్పటివరకు బిడ్డను జిల్లా చైల్డ్ ప్రొటెషన్ ఆఫీసర్ సంరక్షణలో ఉంచుతారు. ఆ బిడ్డ ఈ బిడ్డేనా! జరుగుతున్న పరిణామాలు అనుపమకు సంతోషాన్నిస్తున్నట్లే కనిపిస్తున్నట్లు స్థానిక మీడియా చెప్తోంది. అలాగే పోలీసులు తీసుకువచ్చిన బిడ్డ అనుపమకు పుట్టిన బిడ్డ అనడానికి తార్కికపరమైన ఆధారాలు అందుతున్నాయి. బిడ్డ మాయమైన తర్వాత ఒకటి– రెండు రోజుల తేడాలో ఆ రాష్ట్రంలో అమ్మ తొట్టిల్ (ఉయ్యాల) పథకంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉయ్యాలలోకి ఇద్దరు బిడ్డలు వచ్చారు. వారిలో ఒక బిడ్డకు గత నెలలో పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. ఓ బిడ్డను దత్తత ఇచ్చినట్లు తెలిసింది. ఆ బిడ్డ కోసం గాలించి ఆదివారం నాడు విజయవంతంగా ఛేదించారు. కన్నపేగు పోరాటం వృథా కాదని, ఆ బిడ్డ అనుపమ బిడ్డే అయి ఉండాలని రాష్ట్రం మొత్తం కోరుకుంటోంది. అనుపమ ఒడికి చేరే క్షణం కోసం ఎదురు చూస్తోంది. ఇదీ జరిగింది! అనుపమ గత ఏడాది అక్టోబర్‌లో ఓ బిడ్డకు తల్లయింది. ఆమె కేరళ సమాజంలో అగ్రవర్ణంగా గుర్తింపు పొందిన సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఆమె ప్రేమించిన వ్యక్తి షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి. అనుపమ ప్రేమను అంగీకరించని ఆమె తండ్రి స్వయానా కూతురినే మోసం చేశాడు. ఆమె కన్నబిడ్డను ఆమె నుంచి వేరు చేశాడు. ‘బిడ్డను రహస్య ప్రదేశంలో సంరక్షిస్తున్నట్లు’ కొద్ది నెలల పాటు ఆమెను మభ్యపెట్టాడు. తాను మోసపోయానని తెలిసిన తర్వాత ఆమె ఇంటి నుంచి పారిపోయి, ప్రేమికుడితో కలసి పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. ఆమె తండ్రి సమాజంలో పరపతి కలిగిన వ్యక్తి, కమ్యూనిస్ట్ నాయకుడు, ప్రజాప్రతినిధి కూడా కావడంతో పోలీసులు మొదట్లో ఆమె కంప్లయింట్‌ను ఫైల్ చేయడానికి మీనమేషాలు లెక్కపెట్టారు. ఆమె పోలీసులు, శిశు సంక్షేమశాఖతోపాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులను కలిసి తన బిడ్డను తనకు ఇప్పించమని వేడుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అభ్యర్థించింది. అనుపమ తండ్రి చేసిన ఘోరం రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారి తీసింది. మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ నెల 18వ తేదీన వెలువడిన ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో కదలిక వచ్చింది. సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన పోలీసులు బిడ్డను సొంత రాష్ట్రానికి తీసుకువెళ్లారు. బిడ్డ రాష్ట్రానికి చేరిన వార్త సోమవారంనాడు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. -
పింక్ ప్రొటెక్షన్ ‘సర్వే’యలెన్స్ చెక్ చేస్తారు... చెక్ పెడతారు
జ్వరాలు ఉన్నాయేమోనని ఇంటింటి సర్వే చేయడం తెలుసు. కాని ఇక మీదట కేరళలో గృహ హింస జరుగుతున్నదా అని ఇంటింటినీ చెక్ చేస్తారు. కాలేజీల దగ్గర పోకిరీల పని పడతారు. కట్నం మాటెత్తితే లోపల వేస్తారు. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే చిప్పకూడు తినిపిస్తారు. స్త్రీలకు విరోధులుగా మారిన పురుషులకు గుణపాఠం చెప్పడానికి కేరళ ప్రభుత్వం సోమవారం ‘పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్’ ప్రారంభించింది. ఆ వివరాలు... పోలీస్ వెహికిల్ అంటే మగ డ్రైవర్, మగ ఇన్స్పెక్టర్, మగ కానిస్టేబుల్స్... ఇలాగే ఉంటుంది అన్ని చోట్లా. కాని కేరళలో ఇక మీదట ‘పింక్’ కార్లు కూడా కనిపిస్తాయి. లేడీ డ్రైవర్, లేడీ ఇన్స్పెక్టర్, లేడీ కానిస్టేబుల్స్.... వీళ్లే ఉంటారు. ఈ పింక్ కార్లు రోడ్ల మీద తిరుగుతుంటాయి. తమ కోసం ఈ వాహనాలు రక్షణకు పరిగెత్తుకొని వస్తాయి అనే నమ్మకాన్ని స్త్రీలకు ఇస్తాయి. కేరళలో ఇటీవల గృహ హింస కేసులు, వరకట్న చావులు మితి మీరాయి. ఇప్పటికే అక్కడ స్త్రీల రక్షణకు వివిధ మహిళా పోలీసు దళాలు విధుల్లో ఉన్నా సోమవారం (జూలై 19) ‘పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్’ పేరుతో అక్కడి ముఖ్యమంత్రి పినరయి విజయన్ దృఢమైన సందేశం ఇచ్చేలా కొత్త దళాలను తిరువనంతపురంలో ప్రారంభించారు. మూడు సంరక్షణలు స్త్రీలకు మూడుచోట్ల భద్రత కల్పించాలని కేరళ ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఒకటి పబ్లిక్ ప్లేసుల్లో (రోడ్లు, పార్కులు, బస్‌స్టాప్‌లు..), రెండు ప్రయివేటు ప్లేసుల్లో (నివాస గృహాలు, హాస్టళ్లు...), మూడు సోషల్ మీడియాలో (ఫేస్బుక్, ట్విటర్..)... ఈ మూడు చోట్ల స్త్రీలకు ఏ మాత్రం అసౌకర్యం జరగడానికి వీల్లేకుండా ‘పింక్ ప్రొటెక్షన్’ కింద మహిళా దళాలు అలాగే పురుష దళాలు పరస్పర సహకారంతో పని చేయాలని అక్కడ చర్యలు మొదలయ్యాయి. ఇంటికి వచ్చే ‘పింక్ జనమైత్రి’ గృహ హింస, వరకట్న వేధింపులకు చెక్ పెట్టడానికి కేరళలో మొదలెడుతున్న వినూత్న రక్షణ చర్య ‘పింక్ జనమైత్రి’. సాధారణంగా ఇళ్లల్లో గృహ హింస జరుగుతూ ఉన్నా, వరకట్న వేధింపు జరుగుతూ ఉన్నా అది ఆ ఇంటికి, ఇరుగు పొరుగు వారికీ తెలుస్తూ ఉంటుంది తప్ప స్టేషన్ వరకూ చేరదు. అనేక కారణాల వల్ల, చట్టం సహాయం తీసుకోవచ్చని స్త్రీలకు తెలియకపోవడం వల్ల పోలీసులకు ఈ వేధింపు తెలియదు. అది దృష్టిలో పెట్టుకుని కేరళలోని ప్రతి జిల్లాలోని ప్రతి ఊళ్లోని పంచాయితీ సభ్యులతో ‘పింక్ జనమైత్రి’ కార్యక్రమం కింద మహిళా పోలీసులు ‘టచ్’లో ఉంటారు. ఊళ్లో ఏ ఇంట్లో అయినా స్త్రీలపై హింస జరుగుతుందా ఆరా తీస్తారు. అలాగే ఇంటింటిని సర్వే చేస్తూ ఆ ఇంటి మహిళలతో మాట్లాడతారు. మహిళలు విషయం దాచాలనుకున్నా వారి వొంటి మీద దెబ్బపడి ఉంటే ఆ దెబ్బ పెద్ద సాక్ష్యంగా నిలిచే అవకాశం ఉంది. దాంతో ఆ హింసకు పాల్పడిన కుటుంబ సభ్యులపై చర్యలు ఉంటాయి. ముఖ్యంగా ఇది వరకట్న వేధింపులు ఎదుర్కొనే కోడళ్లకు పెద్ద తోడు అయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులను కూడా ఇంట్లో అడుగుపెట్టనీకుండా కోడళ్లను రాచి రంపాన పెట్టే భర్త, అత్తామామలు ఉంటారు. కాని పోలీసులను రావద్దు అనడానికి లేదు. కోడలు నోరు విప్పి ఏం చెప్పినా అంతే సంగతులు. పింక్ షాడో పెట్రోల్, పింక్ రోమియో కేరళలో స్త్రీలకు నీడలా ఉంటూ వేధించే పురుషులకు సింహ స్వప్నంగా నిలిచేదే ‘పింక్ షాడో పెట్రోల్’. ఇందుకోసమే పింక్ వెహికిల్స్‌ను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్లు పూర్తిగా మహిళా పోలీసులతో తిరుగుతాయి. ‘మా వెహికిల్ వస్తుంటే అల్లరి వెధవలు తోక ముడిచి పారిపోతున్నారు’ అని ఆ వెహికల్స్‌లో విధి నిర్వహిస్తున్న ఒక మహిళా ఇన్స్పెక్టర్ చెప్పింది. ‘అమాయక యువతులకు మాయమాటలు చెప్పి పార్కులకు సినిమాలకు తిరిగే మేక వన్నె పులులు కూడా ఇప్పుడు మా బండ్లు ఎక్కడ పసి గడతాయోనని ఒళ్లు దగ్గర పెట్టుకుంటున్నారు.’ అని కూడా ఆమె అంది. పింక్ షాడో పెట్రోల్ మొదలయ్యాక కేరళలో బీచ్‌ల వద్ద జరిగే క్రైమ్ బాగా తగ్గింది. ఇక ఆడపిల్లలను సిటీ బస్సుల్లో, కాలేజీల దగ్గర, స్కూళ్ల దగ్గర అల్లరి పెట్టేవారి భరతం పట్టడానికే ‘పింక్ రోమియో’ మహిళా పోలీసు దళం పని చేస్తుంది. వీరికి బుల్లెట్లు, సైకిళ్లు కూడా పోలీసు శాఖ సమకూర్చింది. పింక్ హెల్మెట్లతో వీరు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ విధులలో ఉంటారు. అలాగే 24 గంటలూ అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్ నంబర్ కూడా ఉంటుంది. భావజాలం మారాలి ‘ఎన్ని దళాలు ఎన్ని విధాలుగా పని చేసినా అవి దుర్మార్గ పురుషులను నియంత్రించొచ్చుగాని వారిని పూర్తిగా మార్చలేవు. మారాల్సింది పురుషులే. తమకు తాముగా వారు స్త్రీల పట్ల ఎలా వ్యవహరించాలో వారిని ఎంత గౌరవించాలో తెలుసుకోవాలి. అప్పుడే అత్యాచారాలు, హింస, వేధింపులు ఆగుతాయి’ అని పింక్ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న ఒక మహిళా ఆఫీసర్ అన్నారు. అవును. అబ్బాయిలకు హైస్కూలు వయసు నుంచే ఇంట్లో, బయట స్త్రీలతో ఎలా వ్యవహరించాలో నేర్పించాల్సిన బాధ్యత కుటుంబానికి ఉంది. వారిని జెండర్ సెన్సిటైజ్ చేయాల్సిన బాధ్యత విద్యా వ్యవస్థకు ఉంది. ఈ రెండు చోట్ల పురుష భావజాలం సంస్కరింపబడిన నాడు పింక్ ప్రొటెక్షన్ అవసరమే ఉండదు. -
Menstrual Hygiene Day: ప్యాడ్ ఎక్కడ మార్చుకుందాం?
స్త్రీల బహిష్టు సమస్యలను ప్రపంచం 2013 నుంచి మాట్లాడటం మొదలెడితే భారతదేశం గత నాలుగైదేళ్లుగా మాట్లాడుతోంది. విద్యార్థినులకు ప్యాడ్స్ ఇవ్వడం, పేద వర్గాల మహిళలకు ప్యాడ్స్ అవసరం చెప్పడం ఇప్పుడిప్పుడే జరుగుతోంది. కాని నిజంగా బహిష్టును దాంతో పాటు స్త్రీలను అర్థం చేసుకుని దానితో ముడిపడిన సమస్యలకు పరిష్కారాన్ని, ఆపై స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని సమాజం ఇస్తోందా? బహిష్టులో ఉన్న స్త్రీ ఇంట్లో ఉంటే సరే, బయటకు వస్తే ప్యాడ్ ఎక్కడ మార్చుకోవాలో తెలియని ఆందోళన లో నేటికీ ఉందంటే బహిష్టు ధర్మం పట్ల ఈ సమాజం ఇంకా స్నేహంగా లేనట్టే లెక్క. మే 28 ‘బహిష్టు పరిశుభ్రతా దినోత్సవం’ సందర్భంగా కొన్ని చర్చలో ఉన్న ఆలోచనలు.... ఒక రచయిత్రి రాసిన తెలుగు కథలో ఒక మహిళా పాత్రధారి విమాన ప్రయాణం చేస్తూ ఉంటుంది. సడన్‌గా ఆమెకు పిరియెడ్స్ మొదలైపోతాయి. దగ్గర ప్యాడ్స్ ఉండవు. చీరలో ఉంటుంది. ప్రయాణ హడావిడిలో ప్యాంటిస్ కూడా వేసుకుని ఉండదు. ఒక పెద్ద దురవస్థగా ఉంటుందామెకు. విమానంలో మహిళలకు సడన్ గా పిరియడ్స్ వస్తాయేమోనని ప్యాడ్స్ ఉంచరు. ఇప్పటికీ ఎన్ని విమానాలలో ఈ సదుపాయం ఉందో మనకు తెలియదు. కాని తోటి ప్రయాణికులు ఆమెను అభ్యంతరకరంగా చూస్తూ ఉంటే ఎయిర్ హోస్టెస్‌లు సహకరిస్తే ఆ మహిళా పాత్రధారి ఆ దురవస్థ నుంచి బయటపడుతుంది. ఆ కథలో రచయిత్రి అంటుంది– ‘ఈ పాత్రధారి దురవస్థ సరే, దేశంలో బహిష్టు వస్త్రాన్ని ఉతికి మళ్లీ వాడుకునే కోట్లాది మహిళలు ఆ వస్త్రాలను ఆరేసుకోవాలంటే కొంచెం ఎండ కూడా దొరకదు’ అని. అంటే బహిరంగంగా వాటిని ఆరబెట్టుకోవడానికి ఈ సమాజం అంగీకరించదు అని. చీకటిలో, నీడలో, ఇంట్లో దండేలకు వాటిని ఆరబెట్టి తిరిగి వాడటం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో వచ్చాయో వైద్యనిపుణులు చెబుతూనే ఉన్నారు. ∙∙ విమానం వంటి ఖరీదైన వ్యవస్థలో, ‘నాగరికులు’ రాకపోకలు జరిపే ప్రయాణ సాధనాలలోనే పరిస్థితి ఇలా ఉంటే ఈ దేశంలో నేటికీ రైళ్లలో, రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో, బస్సులలో ఎంతమేరకు స్త్రీలకు ప్యాడ్స్ అందుబాటులో ఉన్నాయి? వాటి అవసరాన్ని ఈ సమాజం, వ్యవస్థలు ఏ మేరకు గుర్తించాయి? ఇంకా గుర్తించాల్సి ఉంది? ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు ఉన్నట్టు ప్యాడ్ బాక్స్‌లు ఎందుకు ఉండవు అని ఇంకా అడగాల్సిన పరిస్థితే ఉంది. ∙∙ గత సంవత్సరం కేరళ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయ్యాల్లో ఫ్రీ ప్యాడ్స్‌ను ఏర్పాటు చేయడమే కాక, వాడిన ప్యాడ్స్‌ను బూడిద చేసే ‘ఇన్సినెరేటర్’లు కూడా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. పిరియెడ్స్లో ఉన్న మహిళా ఉద్యోగులకు ఆఫీసులో ప్యాడ్స్ మార్చుకునే వీలు ఏదో మేరకు ఉన్నా అంతవరకూ ఉపయోగించిన ప్యాడ్‌ను ఎక్కడ పడేయాలనే వత్తిడిలో ఉంటారు. అందువల్ల ఒకే ప్యాడ్‌ను ఎక్కువ సేపు వాడుతూ ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటూ ఉంటారు. వాటిని మార్చుకునే స్థలంతో పాటు వాటిని ఎవరూ చూడకుండా చేసే బూడిద యంత్రాలు అందుబాటులో ఉన్నప్పుడే వారికి మరింత సౌకర్యంగా ఉంటుంది. అయితే మహిళలు ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేస్తారా? ప్రయివేటు ఆఫీసుల్లో చేయరా? ఎన్ని ప్రయివేటు కార్యాలయాలు ఇలాంటి ఏర్పాటు చేస్తున్నాయి అనేది పెద్ద ప్రశ్న. మహిళలు తమ బహిష్టు పరిశుభ్రతను పాటించాలంటే సమాజం మొత్తం అడుగడుగునా అందుకు అవసరమైన స్నేహాన్ని, సౌకర్యాన్ని కలిగించాల్సి ఉంటుంది. ∙∙ ‘బాడీ లిటరసీ’ అనే మాటను వాడుతున్నారు మహిళల కోసం పని చేసే కార్యకర్తలు, ఆలోచనాపరులు. అంటే స్త్రీ శరీర ధర్మాలను సమాజం సరిగ్గా అర్థం చేసుకుని ఆ ధర్మాలను గౌరవించే స్థాయిలో విద్యావంతం కావాలి. అప్పుడే ‘బహిష్టు’కు సంబంధించిన కట్టుబాట్లు, ఏహ్యత, వెలి దూరం అవుతాయి. స్త్రీల శరీరం గురించి స్త్రీలకు తెలుసు. స్త్రీలు తమ లోపలి దొంతరల్లో మొదట ఈ శరీర ధర్మాల పట్ల స్వీయగౌరవం పెంచుకోవడం ఎంత అవసరమో ఇంటి పురుషులతో మొదలెట్టి అధికార పదవులలో కూచుని పురుషదృష్టితో పాలసీలు చేసే పాలకుల వరకూ వీటి పట్ల గౌరవం కలిగించడం కూడా అంతే అవసరం. ఇంట్లోని తల్లి, కుమార్తె బహిష్టు గురించి నార్మల్‌గా మాట్లాడే పరిస్థితితోపాటు తండ్రి, కుమారుడు కూడా అంతే నార్మల్‌గా మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు అవసరమైన మార్పు వస్తుంది. ∙∙ బహిష్టు పట్ల ఉండే చూపును, అప్రకటిత నిబంధనలను వ్యతిరేకిస్తూ ‘హ్యాపీ టు బ్లీడ్’తో మొదలెట్టి ఇటీవలి కాలంలో ఎన్నో విజ్ఞాన నిరసనలు స్త్రీలు చేస్తున్నారు. తమ శరీర ధర్మాన్ని తాము ఓన్ చేసుకోవడం అవసరమని, గట్టిగా మాట్లాడటం కూడా అవసరమే అని వారు తెలుసుకుని మాట్లాడుతున్నారు. దాంతోపాటు ‘నల్ల కవర్‌ను పారేయడం’ గురించి కూడా మాట్లాడుతున్నారు. మెడికల్ షాప్‌కు వెళ్లి ప్యాడ్స్ అడిగితే వాటిని ఒక నల్ల కవర్లో చుట్టి ఇచ్చే ఆనవాయితీ ఉంది ఈ దేశంలో. ఎందుకు నల్లకవర్? అదేమైనా తప్పు పదార్థమా? మామూలు టానిక్‌లు ఎంత ఓపెన్ గా కొంటామో అంతే ఓపెన్‌గా వీటిని కొని, తీసుకెళ్లే పరిస్థితి ఉండాలని స్త్రీలు అంటారు. భార్యకు అవసరమైన ప్యాడ్స్ కోసం భర్త, కుమార్తెకు అవసరమైన ప్యాడ్స్ కోసం తండ్రి మెడికల్ షాపుకు వెళ్లడం ఏ మేరకు ఉంది... వాటిని తెచ్చిపెట్టడం లో ఇబ్బంది/నామోషీ ఎందుకు ఉంది అని ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన రోజు ఈ రోజు. ∙∙ సాధారణంగా స్త్రీలకు పిరియెడ్స్ 28 రోజులకు వస్తాయి. అవి ఐదు రోజులు ఉంటాయి. అందుకే సంవత్సరంలో ఐదో నెల అయిన మేలో, 28వ తేదీని ‘మెన్స్ట్రువల్ హైజీన్ డే’గా పాటిస్తున్నారు. ఈ రోజు స్త్రీలు తమ శరీర ధర్మం పట్ల సమాజంలో రావాల్సిన మార్పు గురించి మాట్లాడతారు. గుర్తు చేస్తారు. సమాజం దీనిగురించి స్పందించాల్సి ఉంటుంది. స్త్రీల గురించి ఎన్నో చేయాలి. అనుక్షణం ఆలోచించాలి. ప్రత్యేకంగా రోజులను ఖరారు చేసి పదే పదే చెప్పేది అందుకే. స్త్రీలు కోరే ‘విద్యావంతమైన’ సమాజం త్వరలోనే వస్తుందని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
శబరిమలలో భక్తులకు నో ఎంట్రీ
తిరువనంతపురం: అయ్యప్ప భక్తులకు నిరాశే ఎదురయ్యింది. దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి భక్తులను అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. నెలవారీ పూజా కార్యక్రమాల్లో భాగంగా జూన్ 14న తెరవనున్న శబరిమల ఆలయాన్ని పూజా కార్యక్రమాల అనంతరం తిరిగి మూసివేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 19 నుంచి 10 రోజుల పాటు జరిగే ఉత్సవాలను సైతం వాయిదా వేస్తున్నట్టు మంత్రి సురేంద్రన్ వెల్లడించారు. 14 నుంచి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని ఇటీవల ట్రావెన్కోర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బోర్డు అధికారులు, ఆలయ పూజారులు, కేరళ ప్రభుత్వం సమావేశం అయి ఆలయం తెరవాలన్న ఆలోచనను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో భక్తులకు ఆలయ ప్రవేశం లేదు. -
సెకన్లలో కూల్చేశారు
కొచ్చి: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ భవనాలపై కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా కేరళలోని మారడులో నిర్మించిన రెండు భవంతులను శనివారం కూల్చివేసింది. హోలీ ఫెయిత్ హెచ్2ఓ, ఆల్ఫా సెరీన్ అపార్ట్మెంట్లోని ట్విన్ టవర్లను పేలుడు పదార్థాల సాయంతో కూల్చివేశామని అధికారులు వెల్లడించారు. దీనికి గానూ మొత్తం 212.4 కేజీల పేలుడు పదార్థాలను ఉపయోగించామని పేర్కొన్నారు. మొత్తం 19 అంతస్తులు ఉన్న హోలీ ఫెయిత్ భవనం సెకన్ల వ్యవధిలో నేలకూలిందని చెప్పారు. హోలీ ఫెయిత్‌ను శనివారం ఉదయం 11.18 గంటలకు, ఆల్ఫా సెరీన్‌ను 11.46కి కూల్చివేసినట్లు తెలిపారు. భవంతుల కూల్చివేతకు ముందు సమీపంలోని ప్రజలకు, ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఆల్ఫా సెరీన్‌ను కూల్చే క్రమంలో సమీప భవంతులకు నష్టం వాటిల్లకుండా.. కొంతభాగం నీటిలో పడేలా ఏర్పాటు చేశామని తెలిపారు. అనుకున్న రీతిలోనే భవంతి వ్యర్థాలు నీటిలో పడ్డాయని పేర్కొన్నారు. కేరళలో తీర ప్రాంతాల నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు 2019 సెప్టెంబర్‌లో ఆదేశించింది. 138 రోజుల్లోగా ఈ భవనాలను కూల్చివేయాలని తెలిపింది. -
మాజీ సైంటిస్ట్‌కు 1.3 కోట్ల పరిహారం
తిరువనంతపురం: గూఢచర్యం కేసులో నిరపరాధిగా విడుదలైన ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు రూ.1.3కోట్ల పరిహారం ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. 1994లో దేశ రహస్యాలను ఇతరులకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై నారాయణన్‌పై కేసు నమోదు కాగా.. విచారణలో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. తనను అన్యాయంగా కేసులో ఇరికించిన కారణంగా నష్టపరిహారం చెల్లించాలని 77 ఏళ్ల నారాయణన్ కేసు దాఖలు చేయగా కోర్టు అనుకూల తీర్పునిచ్చింది. దేశ అత్యున్నత న్యాయస్థానం, మానవ హక్కుల కమిషన్ ఈ కేసులో ఇస్రో మాజీ శాస్త్రవేత్తకు రూ.50 లక్షలు, రూ. పది లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పివ్వడం తెల్సిందే. తాజాగా ప్రభుత్వం నిర్ణయించిన రూ.1.3 కోట్లు సుప్రీంకోర్టు పరిహారానికి అదనం. నారాయణన్ లేవనెత్తిన అంశాల పరిశీలనకు ప్రభుత్వం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జయకుమార్‌కు బాధ్యతలు అప్పగించగా ఆయన రూ.1.3 కోట్ల పరిహారం చెల్లించాలని సిఫారసు చేశారు. -
ఆంక్షలపై అసంతృప్తి
నల్ల దుస్తులలో అయ్యప్ప భక్తులు కనిపిస్తున్నారు. పడిపూజలు జరుగుతున్నాయి. దీక్షలో ఉన్నవారు శబరిమల ప్రయాణానికి సిద్ధమవు తున్నారు. ఇదే సమయంలో సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్ తాను శబరిమలకు వెళ్తున్నట్లు ప్రకటించారు. కేరళ ప్రభుత్వం తనకు రక్షణ కల్పించినా, కల్పించకపోయినా సరే, తాను దర్శనానికి వెళ్లేది వెళ్లేదేననికచ్చితంగా చెప్పారామె. మరోవైపు కేరళ దేవాదాయ మంత్రి సురేంద్రన్ మాత్రం ‘ఆలయంలోకి ప్రవేశించ డానికి ప్రయత్నించే మహిళలకు రక్షణ కల్పించడం అనేది ఉండదు’ అంతే కచ్చితంగా చెప్పారు. అయినా తృప్తికి ఏమిటింత పట్టు? ఆమె పట్టుదల వెనుక పరిస్థితులు ఎలాంటివి? భారత రాజ్యాంగంలో మగవాళ్లు, మహిళలు సమానమే అని ఉంది. మరి ధార్మిక సంస్థల్లో ఈ రకమైన లింగ వివక్ష ఎందుకు అనేది తృప్తీ దేశాయ్ ప్రశ్న. దేశాయ్.. దేశానికి ధార్మిక సంస్థల్లో మహిళల ప్రవేశం కోసం పోరాడుతున్న కార్యకర్తగానే తెలుసు. కానీ ఆమె అంతకు ముందు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ఆమెది çపుణెలోని సామాన్య కుటుంబం. మొత్తం ముగ్గురు అక్కచెల్లెళ్లు. ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఆమె తండ్రి ఇంటిని వదిలి ఆశ్రమాలకు వెళ్లిపోయాడు. ముగ్గురు ఆడపిల్లలను పెంచి పోషించాల్సిన బాధ్యత తృప్తి తల్లి మీద పడింది. తృప్తి పుణెలో ఉమెన్స్ యూనివర్సిటీలో హోమ్‌సైన్స్ గ్రాడ్యుయేషన్‌లో చేరారు. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఏడాది తర్వాత చదువు ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత తృప్తి ఒక స్వచ్ఛంద సంస్థలో చేరి మురికివాడల్లో సేవ చేశారు. పన్నెండేళ్ల కిందట మహారాష్ట్రలోని అజిత్ కో ఆపరేటివ్ బ్యాంకులో జరిగిన యాభై కోట్ల కుంభకోణానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు తృప్తి. ఆ బ్యాంకు అప్పటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ది. అజిత్ పవార్ దిష్టిబొమ్మను తగులబెట్టిన ఆందోళనలో తృప్తి నియమాలను ఉల్లంఘించారనే ఆరోపణతో ఆమెను అరెస్టు చేశారు. ఆమెకు అవినీతికి వ్యతిరేకంగా కూడా ఉద్యమించిన నేపథ్యం కూడా ఉంది. ‘భూమాత బ్రిగేడ్’ స్థాపన ఒక సామాన్యమైన అమ్మాయి.. సామాజిక కార్యకర్తగా మారడానికి, వ్యవస్థలో కరడుగట్టి ఉన్న లోపాలను ప్రశ్నిస్తూ గళం విప్పడానికి, వివక్షను ఎలుగెత్తుతూ పిడికిలి బిగించడానికి వెనుక పెద్ద మధనమే జరిగి ఉండాలి. అగాధమంత అసంతృప్తి ఏదో ఆమెను ఆవరించి ఉండాలి. తండ్రి తన బాధ్యతల నుంచి పారిపోవడం, తల్లి కుటుంబ బరువు మోయాల్సి రావడం తృప్తి మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. బాధ్యతలను గాలికొదిలేసి సన్యాసం స్వీకరించిన మగవాడికి మాత్రం ఆలయాల్లోకి సగౌరవంగా స్వాగతం పలుకుతూ, ఆడవాళ్ల పట్ల వివక్ష చూపించడాన్ని ఆమె సహించలేకపోయారు. భూమాత బ్రిగేడ్ పేరుతో 2010లో స్వచ్ఛంద సంస్థను స్థాపించి ధార్మిక ప్రదేశాల్లో అమలవుతున్న లింగ వివక్ష మీద పోరాటానికి సిద్ధమయ్యారు. శని శింగణాపూర్ విజయం మహారాష్ట్రలోని శనిశింగణాపూర్‌లోని శనిదేవుడి ఆలయంలోకి మగవాళ్లకు మాత్రమే ప్రవేశం ఉండేది. తృప్తి లేవదీసిన ఉద్యమంతో సుప్రీంకోర్టు ఆ ఆంక్షను తొలగించింది. తర్వాత 2016 ఏప్రిల్‌లో ముంబయిలోని హాజీ అలీ దర్గాలోకి ప్రవేశించడానికి తృప్తి చేసిన ప్రయత్నం విఫలమైంది. అదే ఏడాది మే నెలలో ఆమె కట్టుదిట్టమైన భద్రత నడుమ మసీదు గర్భగుడిలోకి మహిళలకు అనుమతి లేని నియమాన్ని గౌరవిస్తూ శాంతియుతంగా ఆ మసీదులోని మిగతా భాగంలోకి ప్రవేశించారు. అలాగే నాసిక్ త్రయంబకేశ్వర్ ఆలయంలో మగవాళ్లలాగానే తడివస్త్రాలతో గర్భగుడిలోకి వెళ్లి శివలింగాన్ని దర్శించుకున్నారు. అయితే కొల్హాపూర్‌లో మాత్రం ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కొల్హాపూర్ లక్ష్మీదేవిని అర్చించుకోవడానికి మహిళలకు గర్భగుడిలోకి ప్రవేశం కల్పించాలనే వాదన ఎప్పటినుంచో ఉంది. సుప్రీంకోర్టు అనుమతించిన తర్వాత తృప్తీదేశాయ్ మరికొందరు కార్యకర్తలతోపాటు ‘విజయ్ ర్యాలీ’ నిర్వహించారు. అయితే భక్తులు ఆ ర్యాలీని అడ్డుకుని తృప్తీదేశాయ్ని గాయపరిచారు. మహాలక్ష్మి ఆలయంలోకి చీరతోనే రావాలనే నియమాన్ని ఉల్లంఘించి సల్వార్ కమీజ్‌తో రావడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మీద దాడి జరిగింది. ఈ క్రమంలో గత ఏడాది నవంబర్ నెలలో శబరిమల ఆలయంలో ప్రవేశించడానికి తృప్తి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆమెను కొచ్చి ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. ‘మహిళల గొంతు నొక్కడమే’ ఈ ఏడాది ఆలయం తెరిచిన తర్వాత తిరిగి ప్రవేశానికి ప్రయత్నిస్తానని ఆమె ప్రకటించారు. శబరిమల ఆలయంలోకి రుతుక్రమ వయసులో ఉన్న మహిళల ప్రవేశం మీద సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. ఈ వివాదం మీద న్యాయమూరులు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో తీర్పు కోసం విస్తృత ధర్మాసనాన్ని అప్పగించారు గత ఏడాది మహిళలకు రక్షణ కల్పించిన కేరళ ప్రభుత్వం ఈ ఏడాది ఆ ప్రయత్నం చేయడం లేదు. ప్రభుత్వం రక్షణ బాధ్యత చేపట్టకపోవడం మహిళల గొంతుకను అణచివేయడమే అంటున్నారు తృప్తీదేశాయ్ ఆవేశంగా, ఆవేదనగా. – మంజీర ►తృప్తీ దేశాయ్ నాస్తికురాలని కొందరు, హిందూ వ్యతిరేకి అని కొందరు అభివర్ణించడాన్ని ఆమె భర్త ప్రశాంత్ తప్పు పట్టారు. ఆమె పరమభక్తురాలని, కొల్హాపూర్‌లోని గగన్‌గిరి మహారాజ్ భక్తురాలని చెప్పారాయన. ఆమె తన కొడుకును కూడా ఆస్తికవాదిగానేపెంచుతోందని, ఆమె పోరాటం స్త్రీల పట్ల వివక్షకు వ్యతిరేకంగా మాత్రమేనని అంటారు ప్రశాంత్. ►అయ్యప్ప దర్శనం కోసం శబరిమల చేరుకున్న భక్తులతో శనివారం నాడు కిక్కిరిసిపోయిన ఆలయ ప్రాంగణం. అదేరోజు.. వయోపరిమితి నిబంధనలకు విరుద్ధంగా దర్శనం కోసం వచ్చిన కొంతమంది మహిళా భక్తులను ఆలయ నిర్వాహ కులు ‘పంబ’ ప్రాంతం నుంచే వెనక్కు పంపించేశారు. అలా పంపించడం వివక్షేనని తృప్తీ దేశాయ్ అంటున్నారు. ఎన్ని ఆంక్షలున్నా తను అయ్యప్పను దర్శించుకునే తీరుతానని ఆమె ప్రకటించారు. -
నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం
తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం నేడు తెరుచుకోనుంది. దేవాలయ ప్రధాన పూజారి కందరారు మహేశ్ మోహనరు, ముఖ్య పూజారి సుధీర్ నంబూద్రి శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించే విషయంలో కేరళ ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది. ఆలయాన్ని సందర్శించాలనుకునే మహిళలు సంబంధిత కోర్టు ఆర్డరుతో రావాలని స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు అనుమతిస్తూ 2018లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..శబరిమల సహా మహిళలకు సంబంధించిన ఇతర మతాల్లోని అన్ని వివాదాస్పద అంశాలను విచారించేందుకు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, 2018 నాటి∙తీర్పుపై స్టే ఇవ్వలేదు. శబరిమలలోని కీలక ప్రాంతాల్లో 10 వేల మంది పోలీసులను మోహరించనున్నారు. అయితే, నిషేధాజ్ఞలు విధించబోమని పత్తనతిట్ట కలెక్టర్ మీడియాకు తెలిపారు. మా ఆదేశాలను పాటించాల్సిందే! శబరి’ తీర్పుపై జస్టిస్ నారిమన్ న్యూఢిల్లీ: శబరిమలలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడానికి సంబంధించి గురువారం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై.. తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ తీర్పును వ్యతిరేకిస్తూ తాను, జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇచ్చిన తీర్పులోని ‘అత్యంత ముఖ్యమైన’ ఆదేశాలను ప్రభుత్వం క్షుణ్ణంగా చదవడమే కాకుండా, కచ్చితంగా అమలు చేయాలని జస్టిస్ నారిమన్ స్పష్టం చేశారు. జస్టిస్ నారిమన్ శుక్రవారం మరో కేసు విచారణ సందర్భంగా మా ఆదేశాల ఉల్లంఘనను సహించబోం. తప్పనిసరిగా అమలు చేయాల్సిందే’ అని జస్టిస్ నారిమన్ తెలిపారు. -
ఎస్పీ బాలు ఖాతాలో ‘కేరళ’ అవార్డు
తిరువనంతపురం: ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఖాతాలో మరో అవార్డు వచ్చి చేరింది. ప్రతిష్టాత్మక ‘హరివరసనం’ అవార్డును ఈ ఏడాది బాలుకు అందజేయనున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. శబరిమలై హై-పవర్ కమిటీ చైర్మన్ కె.జయకుమార్, కేరళ మంత్రి వీఎస్ శివకుమార్ అవార్డు వివరాలను శుక్రవారం వెల్లడించారు. లౌకికత్వ వ్యాప్తికి కృషి, శాంతి, శబరిమల అయ్యప్పస్వామిపై పలు భాషల్లో గీతాలాపనను పరిగణనలోకి తీసుకుని ఆయనకు అవార్డు అందజేయనున్నట్లు తెలిపారు. జూన్‌లో బాలుకు రూ.లక్ష నగదు, ప్రశంసా పత్రం, జ్ఞాపికను బహుకరించనున్నారు. -
శబరిమలలో ఇక నిశ్చింత
తెలంగాణ భక్తుల కోసం భారీ వసతిగృహం ఐదెకరాల స్థలం కేటాయించేందుకు కేరళ సీఎం సంసిద్ధత సాక్షి, హైదరాబాద్: కఠోర దీక్షను కొనసాగించి, అయ్యప్ప దర్శనానికి వెళ్లే తెలంగాణ భక్తులకు శబరిమలలో ఇక మీదట వసతి, భోజనానికి ఇబ్బందులు దూరం కానున్నాయి. దక్షిణ భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నుంచే అయ్యప్ప భక్తులు ఎక్కువ సంఖ్యలో శబరిమలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో వారికోసం అయ్యప్ప క్షేత్రం వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా అన్ని వసతులతో కూడిన భారీ భవనాన్ని నిర్మించబోతోంది. ఇందుకోసం ఐదెకరాల స్థలం కేటాయించేందుకు కేరళ ప్రభుత్వం సమ్మతించింది. కేరళ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ఆ రాష్ట్ర సీఎం ఊమెన్‌చాందీని కలసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఐదు ఎకరాల స్థలం కేటాయిస్తే తాము భవనం నిర్మించి తెలంగాణ భక్తులకు వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కేసీఆర్ కేరళ సీఎంను కోరారు. దీనికి వెంటనే స్పందించిన ఊమెన్‌చాందీ భూమిని కేటాయించేందుకు సిద్ధమని ప్రకటించారు. గతంలో భక్తుల ఇబ్బందులను కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు కేరళ సీఎం ఊమెన్‌చాందీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ల దృష్టికి తీసుకెళ్లారు. ఊమెన్చాందీతో భేటీ సందర్భంగా కేసీఆర్ ఈ విషయాన్ని కూడా ఉటంకించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. స్థలం కేటాయింపునకు కేరళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో అక్కడ భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తన విన్నపాన్ని మన్నించినందుకు కేరళ ముఖ్యమంత్రికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.