నల్ల దుస్తులలో అయ్యప్ప భక్తులు కనిపిస్తున్నారు. పడిపూజలు జరుగుతున్నాయి. దీక్షలో ఉన్నవారు శబరిమల ప్రయాణానికి సిద్ధమవు తున్నారు. ఇదే సమయంలో సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్ తాను శబరిమలకు వెళ్తున్నట్లు ప్రకటించారు. కేరళ ప్రభుత్వం తనకు రక్షణ కల్పించినా, కల్పించకపోయినా సరే, తాను దర్శనానికి వెళ్లేది వెళ్లేదేననికచ్చితంగా చెప్పారామె.
మరోవైపు కేరళ దేవాదాయ మంత్రి సురేంద్రన్ మాత్రం ‘ఆలయంలోకి ప్రవేశించ డానికి ప్రయత్నించే మహిళలకు రక్షణ కల్పించడం అనేది ఉండదు’ అంతే కచ్చితంగా చెప్పారు. అయినా తృప్తికి ఏమిటింత పట్టు? ఆమె పట్టుదల వెనుక పరిస్థితులు ఎలాంటివి?
భారత రాజ్యాంగంలో మగవాళ్లు, మహిళలు సమానమే అని ఉంది. మరి ధార్మిక సంస్థల్లో ఈ రకమైన లింగ వివక్ష ఎందుకు అనేది తృప్తీ దేశాయ్ ప్రశ్న. దేశాయ్.. దేశానికి ధార్మిక సంస్థల్లో మహిళల ప్రవేశం కోసం పోరాడుతున్న కార్యకర్తగానే తెలుసు. కానీ ఆమె అంతకు ముందు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ఆమెది çపుణెలోని సామాన్య కుటుంబం. మొత్తం ముగ్గురు అక్కచెల్లెళ్లు. ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఆమె తండ్రి ఇంటిని వదిలి ఆశ్రమాలకు వెళ్లిపోయాడు. ముగ్గురు ఆడపిల్లలను పెంచి పోషించాల్సిన బాధ్యత తృప్తి తల్లి మీద పడింది.
తృప్తి పుణెలో ఉమెన్స్ యూనివర్సిటీలో హోమ్‌సైన్స్ గ్రాడ్యుయేషన్‌లో చేరారు. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఏడాది తర్వాత చదువు ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత తృప్తి ఒక స్వచ్ఛంద సంస్థలో చేరి మురికివాడల్లో సేవ చేశారు. పన్నెండేళ్ల కిందట మహారాష్ట్రలోని అజిత్ కో ఆపరేటివ్ బ్యాంకులో జరిగిన యాభై కోట్ల కుంభకోణానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు తృప్తి. ఆ బ్యాంకు అప్పటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ది. అజిత్ పవార్ దిష్టిబొమ్మను తగులబెట్టిన ఆందోళనలో తృప్తి నియమాలను ఉల్లంఘించారనే ఆరోపణతో ఆమెను అరెస్టు చేశారు. ఆమెకు అవినీతికి వ్యతిరేకంగా కూడా ఉద్యమించిన నేపథ్యం కూడా ఉంది.
‘భూమాత బ్రిగేడ్’ స్థాపన
ఒక సామాన్యమైన అమ్మాయి.. సామాజిక కార్యకర్తగా మారడానికి, వ్యవస్థలో కరడుగట్టి ఉన్న లోపాలను ప్రశ్నిస్తూ గళం విప్పడానికి, వివక్షను ఎలుగెత్తుతూ పిడికిలి బిగించడానికి వెనుక పెద్ద మధనమే జరిగి ఉండాలి. అగాధమంత అసంతృప్తి ఏదో ఆమెను ఆవరించి ఉండాలి. తండ్రి తన బాధ్యతల నుంచి పారిపోవడం, తల్లి కుటుంబ బరువు మోయాల్సి రావడం తృప్తి మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. బాధ్యతలను గాలికొదిలేసి సన్యాసం స్వీకరించిన మగవాడికి మాత్రం ఆలయాల్లోకి సగౌరవంగా స్వాగతం పలుకుతూ, ఆడవాళ్ల పట్ల వివక్ష చూపించడాన్ని ఆమె సహించలేకపోయారు. భూమాత బ్రిగేడ్ పేరుతో 2010లో స్వచ్ఛంద సంస్థను స్థాపించి ధార్మిక ప్రదేశాల్లో అమలవుతున్న లింగ వివక్ష మీద పోరాటానికి సిద్ధమయ్యారు.
శని శింగణాపూర్ విజయం
మహారాష్ట్రలోని శనిశింగణాపూర్‌లోని శనిదేవుడి ఆలయంలోకి మగవాళ్లకు మాత్రమే ప్రవేశం ఉండేది. తృప్తి లేవదీసిన ఉద్యమంతో సుప్రీంకోర్టు ఆ ఆంక్షను తొలగించింది. తర్వాత 2016 ఏప్రిల్‌లో ముంబయిలోని హాజీ అలీ దర్గాలోకి ప్రవేశించడానికి తృప్తి చేసిన ప్రయత్నం విఫలమైంది. అదే ఏడాది మే నెలలో ఆమె కట్టుదిట్టమైన భద్రత నడుమ మసీదు గర్భగుడిలోకి మహిళలకు అనుమతి లేని నియమాన్ని గౌరవిస్తూ శాంతియుతంగా ఆ మసీదులోని మిగతా భాగంలోకి ప్రవేశించారు. అలాగే నాసిక్ త్రయంబకేశ్వర్ ఆలయంలో మగవాళ్లలాగానే తడివస్త్రాలతో గర్భగుడిలోకి వెళ్లి శివలింగాన్ని దర్శించుకున్నారు. అయితే కొల్హాపూర్‌లో మాత్రం ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.
కొల్హాపూర్ లక్ష్మీదేవిని అర్చించుకోవడానికి మహిళలకు గర్భగుడిలోకి ప్రవేశం కల్పించాలనే వాదన ఎప్పటినుంచో ఉంది. సుప్రీంకోర్టు అనుమతించిన తర్వాత తృప్తీదేశాయ్ మరికొందరు కార్యకర్తలతోపాటు ‘విజయ్ ర్యాలీ’ నిర్వహించారు. అయితే భక్తులు ఆ ర్యాలీని అడ్డుకుని తృప్తీదేశాయ్‌ని గాయపరిచారు. మహాలక్ష్మి ఆలయంలోకి చీరతోనే రావాలనే నియమాన్ని ఉల్లంఘించి సల్వార్ కమీజ్‌తో రావడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మీద దాడి జరిగింది. ఈ క్రమంలో గత ఏడాది నవంబర్ నెలలో శబరిమల ఆలయంలో ప్రవేశించడానికి తృప్తి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆమెను కొచ్చి ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు.
‘మహిళల గొంతు నొక్కడమే’
ఈ ఏడాది ఆలయం తెరిచిన తర్వాత తిరిగి ప్రవేశానికి ప్రయత్నిస్తానని ఆమె ప్రకటించారు. శబరిమల ఆలయంలోకి రుతుక్రమ వయసులో ఉన్న మహిళల ప్రవేశం మీద సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. ఈ వివాదం మీద న్యాయమూరులు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో తీర్పు కోసం విస్తృత ధర్మాసనాన్ని అప్పగించారు గత ఏడాది మహిళలకు రక్షణ కల్పించిన కేరళ ప్రభుత్వం ఈ ఏడాది ఆ ప్రయత్నం చేయడం లేదు. ప్రభుత్వం రక్షణ బాధ్యత చేపట్టకపోవడం మహిళల గొంతుకను అణచివేయడమే అంటున్నారు తృప్తీదేశాయ్ ఆవేశంగా, ఆవేదనగా.
– మంజీర
►తృప్తీ దేశాయ్ నాస్తికురాలని కొందరు, హిందూ వ్యతిరేకి అని కొందరు అభివర్ణించడాన్ని ఆమె భర్త ప్రశాంత్ తప్పు పట్టారు. ఆమె పరమభక్తురాలని, కొల్హాపూర్‌లోని గగన్‌గిరి మహారాజ్ భక్తురాలని చెప్పారాయన. ఆమె తన కొడుకును కూడా ఆస్తికవాదిగానేపెంచుతోందని, ఆమె పోరాటం స్త్రీల పట్ల వివక్షకు వ్యతిరేకంగా మాత్రమేనని అంటారు ప్రశాంత్.
►అయ్యప్ప దర్శనం కోసం శబరిమల చేరుకున్న భక్తులతో శనివారం నాడు కిక్కిరిసిపోయిన ఆలయ ప్రాంగణం. అదేరోజు.. వయోపరిమితి నిబంధనలకు విరుద్ధంగా దర్శనం కోసం వచ్చిన కొంతమంది మహిళా భక్తులను ఆలయ నిర్వాహ కులు ‘పంబ’ ప్రాంతం నుంచే వెనక్కు పంపించేశారు. అలా పంపించడం వివక్షేనని తృప్తీ దేశాయ్ అంటున్నారు. ఎన్ని ఆంక్షలున్నా తను అయ్యప్పను దర్శించుకునే తీరుతానని ఆమె ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment