అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతోంది శబరిమల. కనీవినీ ఎరుగని రీతిలో శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లలో దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా భయం మటుమాయం కావడంతో మణికంఠుడ్ని దర్శనం చేసుకునేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. రోజూ లక్షమంది వరకు అయ్యప్ప సన్నిధికి వస్తున్నారు. దీక్షలు విరమిస్తున్నారు. దర్శనం, పార్కింగ్ సమస్యలు ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.
పోటెత్తిన స్వాములు
దాదాపు 12 గంటలపాటు క్యూలైన్లలోనే భక్తులు పడిగాపులుకావాల్సి వస్తోంది. రద్దీ ఎక్కువగా ఉండడంతో నిమిషానికి 80 మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహనాల్లో రావడంతో పార్కింగ్ ప్రాంతాల్లో కూడా రద్దీ ఎక్కువగా ఉంటోంది. సన్నిధానం, నందపంథల్ ప్రాంతాలైతే భక్తులతో కిటికటలాడుతున్నాయి. భక్తులు రద్దీ పెరగడంతో దర్శన సమయాన్ని కూడా దేవస్థానం బోర్డు 19 గంటల వరకు పొడిగించింది. రద్దీని తగ్గించడానికి వీలుగా వర్చువల్ క్యూ సిస్టమ్‌లో బుకింగ్స్‌పై పరిమితులు పెట్టారు. పంపా నది నుంచి శబరిమల మార్గమంతటా రద్దీ ఉన్నందువల్ల పులిమేడు దారిని ఎంచుకోవాలని భక్తులకు సూచిస్తున్నారు అధికారులు.
రెండేళ్ల తర్వాత వీపరీతంగా రద్దీ
రెండేళ్ల తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వెళ్లే భక్తులు అధిక సంఖ్యలో ఉంటున్నారు. కరోనా ఆంక్షలు ఉపసంహరించిన తర్వాత జరుగుతున్న తొలి మండల పూజ ఇదే కావడం వల్ల శబరిమలకు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు. ఆన్‌లైన్ తోపాటు స్పాట్ బుకింగ్ పద్ధతిలోనూ భక్తులు పెద్దసంఖ్యలో దర్శనానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. 41 రోజుల పాటు జరిగే మండల పూజ ఈనెల 27తో ముగుస్తుంది.
విరామం తర్వాత ఈనెల 30న మకరవిళక్కు కోసం ఆలయాన్ని మళ్లీ తెరుస్తారు. వచ్చే జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. జనవరి 20న పడిపూజ తర్వాత మళ్ళీ ఆలయాన్ని మూసేస్తారు. ఆలయంలో ఎంతో ప్రత్యేకమైన నేతి అభిషేకాలను కళ్లారా చూడడం భాగ్యంగా భావిస్తారు భక్తులు. అందుకే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్వయంగా పాల్గొని తరలించాలని భావించం వల్లే దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు ఎక్కువగా ఉంటారు.
హుండీపై కరోనా దెబ్బ రూపంలో దేవస్థానానికి వచ్చే ఆదాయమూ బాగా పెరిగింది. కేవలం 28 రోజుల్లో దేవస్థానానికి 148 కోట్ల ఆదాయం వచ్చింది. కోవిడ్ ప్రభావం ఆంక్షలు తొలగించినా... మొదట్లో భక్తులు రాక పెద్దగా లేకపోవడంతో గత ఏడాది అంతాకలుపుకుంటే దేవస్థానానికి ఆదాయం 151 కోట్లు వచ్చింది. 201718 సీజన్‌లో 278 కోట్లు, 201819లో 179 కోట్లు, 201920లో 269 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా వల్ల అయ్యప్పస్వామి ఆలయ ఆదాయం గణనీయంగా తగ్గింది. కరోనా ఉధృతంగా ఉన్న 202021లో కేవలం 21 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. కరోనా నిబంధనల్ని అధికారులు కఠినంగా అమలుచేశారు. దీనికితోడు వైరస్ నిబంధనల వల్ల మణికంఠుడ్ని దర్శించుకునేందుకు వచ్చినవారి సంఖ్య అనూహ్యంగా తగ్గింది.
అత్యంత కఠినం అయ్యప్ప దీక్ష
అయ్యప్ప దీక్ష చేయడం అంతా ఒక ఎత్తయితే .. శబరిమల యాత్ర మరో ఎత్తు. అత్యంత నియమ,నిష్టలతో బ్రహ్మచర్యం పాటిస్తారు మాలధారులు. సుఖాలకు దూరంగా గడపడమే ఈ దీక్ష ఉద్దేశం. మాలధారణ చేసిన భక్తులు అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్లడం దీక్షలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా చెబుతారు. శబరి యాత్రలో అత్యంత కీలకమైన ఘట్టం పంబానది స్నానం. ఈ నదిలో స్నానమాచరిస్తే ఇన్ని రోజులు పడిన కష్టం ఒక్కసారిగా మరిచిపోతామని, మనసు తేలికవుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడ స్నానమాచరించి స్వామివారి దర్శనానికి భక్తులు బయలుదేరుతారు.
ఎంతో పుణ్యం చేస్తేనే మెట్లు ఎక్కే అదృష్టం
శబరిమల యాత్ర ఒక్కో దశ ఒక్కొక్క రీతిలో జరుగుతుంది. మొట్టమొదటిసారి మాలధారణ చేసిన వారు కొన్ని దశాబ్దాలుగా మాలధారణ చేసిన స్వాములుగా శబరిగిరికి వస్తారు. తొలిసారి వచ్చిన కన్నెస్వాములు ... గుర్తుగా బాణమును సమర్పించుకుంటారు. మండలం రోజులు దీక్ష. కఠోరమైన నియమాలు. మాలధారణ అనేది జీవితంలో ఒక అపురూపమైన ఘట్టమంటారు. అందుకే ఒక్కసారి స్వామి మాల ధరిస్తే ఏటా ధరించాలనిపిస్తుందని చెబుతారు. అందుకే ఎంతోమంది స్వాములు కొన్ని దశాబ్దాలుగా మాల ధరిస్తూనే ఉన్నారు. 18 మెట్లు ఎక్కిన తర్వాత అయ్యప్ప దర్శనం పూర్తవుతుంది. అలా స్వాముల్లో ఆధ్యాత్మికతకు పరిపూర్ణత లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment