
శబరిమల ఆలయంలో తొక్కిసలాట
► ఇద్దరికి తీవ్రగాయాలు.. ఆస్పత్రిలో చికిత్స
► క్షతగాత్రుల్లో తూర్పుగోదావరి, అనంతపురం,
గుంటూరు జిల్లాల వాసులు
శబరిమల : అయ్యప్ప స్వామి కొలువైన ఉన్న కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయంలో ఆదివారం సాయంత్రం స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 12 మంది భక్తులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో అనంతపురం, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల వాసులు ఉన్నట్లు తెలిసింది. సన్నిధానానికి (ప్రధాన ఆలయం), మాలికాపురత్తమ్మ ఆలయానికి మధ్య.. కర్రకు తాడు కట్టి ఏర్పాటు చేసిన బ్యారికేడ్ భక్తుల రద్దీతో పడిపోవడంతో ఒకరిపై ఒకరు పడిపోయారు.
క్షతగాత్రులను తొలుత సన్నిధానం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని కొట్టాయం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి, మరో ముగ్గురిని పంబ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికి తల, పక్కటెముకల్లో తీవ్ర గాయాలయ్యాయని, అయితే వారు స్పృహలోనే ఉన్నారని పత్తనంతిట్ట జిల్లా కలెక్టర్ ఆర్. గిరిజ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన చొప్పెళ్ల బుచ్చిరాజు, అతని బావ పసలపూడి శ్రీనివాస్ గాయపడ్డారని వారి వెంట వెళ్లిన కంకటాల సాంబమూర్తి, అతని స్నేహితుడు గుప్తా తెలిపారు.
మండల పూజ ముగింపు ముందురోజైన ఆదివారం ఆలయం పెద్ద సంఖ్యలో భక్తులతో కిక్కిరిసిపోయింది. మండలపూజ సందర్భంగా సోమవారం అయ్యప్ప స్వామికి అలంకరించనున్న నగలను తీసుకొచ్చిన ‘తంగ అగ్ని’యాత్ర గుడికి చేరుకున్న కాసేపటికే తొక్కిసలాట జరిగింది. తంగ అగ్ని దీపారాధనను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని దేవస్వాం మంత్రి కడకంపల్లి సురేంద్రన్ చెప్పారు. దీపారాధనకు హాజరైన మంత్రి తొక్కిసలాట జరగడానికి కాసేపు ముందు వెళ్లిపోయారు. రద్దీ నేపథ్యంలో పంబ నుంచి సన్నిధానానికి వస్తున్న భక్తుల సంఖ్యను పోలీసులు తగ్గిస్తున్నారు. 2011లో మకరజ్యోతి రోజున శబరిమలలో జరిగిన భారీ తొక్కిసలాటలో 106 మంది భక్తులు చనిపోగా మరో వంద మంది గాయపడ్డారు. దర్శనం తర్వాత భక్తులు స్వస్థలాలకు వెళ్తుండగా దారిమధ్యలో ఓ జీపు బోల్తాపడడంతో తొక్కిసలాట జరిగింది.