
నిరసనకారుల ఆందోళనతో విమానాశ్రయంలోనే తృప్తి దేశాయ్‌ను నిలిపివేసిన పోలీసులు
తృప్తి దేశాయ్‌ను కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో అడ్డగించిన నిరసనకారులు
తిరువనంతపురం: శబరిమలకు బయలుదేరిన భూమాత బ్రిగేడ్ చీఫ్, సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌ను శుక్రవారం ఉదయం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు నిలిపివేశారు. విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్ గేట్ వెలుపల పెద్దసంఖ్యలో నిరసనకారులు గుమికూడి నినాదాలు చేస్తుండటంతో ఆరుగురు మహిళా యాత్రికులతో తెల్లవారుజామున 4.40 గంటలకు కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న తృప్తి దేశాయ్ బృందాన్ని పోలీసులు బయటకు అనుమతించలేదు. కాగా శబరిమల వచ్చేందుకు తన ప్రయాణ ఏర్పాట్లను వివరిస్తూ తమకు భద్రత కల్పించాలని కోరుతూ తృప్తి దేశాయ్ బుధవారం కేరళ సీఎం పినరయి విజయన్‌కు లేఖ రాశారు. తృప్తి రాకను పసిగట్టిన హిందూ సంస్ధల కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు ఆమె పర్యటను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
శబరిమలకు వెళ్లకుండా ఆమెను నిరోధించేందుకు విమనాశ్రయం వెలుపల పెద్ద ఎత్తు ఆందోళనకు దిగాయి. కాగా, శబరిమలకు బయలుదేరిన తమను హతమారుస్తామని, దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని, పోలీసులు తమకు ఎలాంఇ భద్రత కల్పించకపోయినా శబరిమలకు వెళ్లి తీరుతామని తృప్తి దేశాయ్ స్పష్టం చేశారు.
మరోవైపు తన శబరిమల యాత్రకు భద్రత కల్పించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆమె మెయిల్ చేశారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను హిందూ సంస్థలతో పాటు బీజేపీ, ఆరెస్సెస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
విమానాశ్రయం వద్ద భారీ భద్రత
తృప్తి దేశాయ్ శబరిమలను సందర్శిస్తారనే సమాచారంతో పెద్ద సంఖ్యలో నిరసనకారులు కొచ్చి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడంతో విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప దర్శనం అయ్యాకే తిరుగుముఖం పడతానని తృప్తి దేశాయ్ తేల్చిచెబుతుండటం, ఆమెను అడ్డుకుంటామంటూ నిరసనకారులు నినాదాలతో హోరెత్తిస్తుండటంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు బలగాలను భారీగా మోహరించారు.