న్యూఢిల్లీ: శబరిమల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం గురువారం తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ ఇచ్చిన తీర్పుపై సమీక్ష సందర్భంగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం మత వ్యవహారాలకు సంబంధించిన కొన్ని అంశాలను విస్తృత ధర్మాసనం పరిశీలిస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కక్షిదారుల తరఫు న్యాయవాదులు దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని విస్తృత బెంచ్ గురువారం కేసును విచారించింది.
రోజంతా సాగిన ఈ విచారణ తరువాత జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. ‘ఆదేశాలు సోమవారం జారీ చేస్తాం. విస్తృత ధర్మాసనం చర్చించాల్సిన అంశాలను కూడా అదే రోజు ఖరారు చేస్తాం’ అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కక్షిదారుల తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్. నారిమన్‌తో ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఢిల్లీ న్యాయాధికారుల కేసును ప్రస్తావించారు. ఆ కేసులో నారీమన్ ఇంగ్లాండ్ న్యాయశాస్త్ర గ్రంథం హాల్స్‌బరీలోని ఓ నిబంధనను ప్రస్తావించారని, దాని ప్రకారం సుప్రీంకోర్టుకు ఏ రకమైన ఆంక్షల్లేని న్యాయపరిధి లభిస్తుందని... శబరిమల కేసుకు అది వర్తిస్తుందా? అని ప్రశ్నించారు. ఒక తీర్పుపై సమీక్ష జరిపే సమయంలో న్యాయ సంబంధిత ప్రశ్నలను లేవనెత్తరాదన్నది సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల వాదనగా ఉన్న విషయం తెలిసిందే. (చదవండి: ఏప్రిల్‌లో మందిర నిర్మాణం!)
Comments
Please login to add a commentAdd a comment