సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం దిగిరావడం లేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను విధిగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నందున ఆ ఉత్తర్వుల అమలుకే ప్రాధాన్యం ఇస్తామని పినరయి విజయన్ స్వయంగా ప్రకటించారు. ఆయన ఈ విషయమై పలు ప్రాంతాల్లో సభలు.. సమావేశాలు నిర్వహించి ప్రజలకు నచ్చజెప్పేందుకు తీవ్రంగా కషి చేస్తున్నారు.
ఎల్‌డీఎఫ్ ఆధ్వర్యాన తిరువనంతపురం, కొల్లాం, పట్టణంతిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, పలక్కాడ్ నగరాల్లో నిర్వహించిన సభలో పినరయి విజయన్ ప్రసంగించారు. ముందుగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించిన బీజేపీ, ఆరెస్సెస్ సంఘాలు ఆ తర్వాత ఓట్ల రాజకీయాల కోసం ఆందోళన సాగిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేస్తామంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన హెచ్చరికపై ఆయన ఘాటుగా స్పందించారు. కేరళ విషయంలో ఆయన పన్నాగాలు సాగవని చెప్పారు. మత కలహాలను సృష్టించేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మూడువేల మంది భక్తులను అరెస్ట్ చేయడంపై అమిత్ షా స్పందిస్తూ కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేస్తామని హెచ్చరించిన విషయం తెల్సిందే. సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ కూడా ప్రభుత్వం తరఫున గట్టిగా నిలబడి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు.
రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆరెస్సెస్ శబరిమల కర్మ సమితి పేరిట దాదాపు 50 హిందూ సంఘాలను కూడగట్టి సుప్రీం ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోంది. ఆరెస్సెస్ వెన్నంటే బీజేపీ నడుస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇటు ప్రభుత్వం పక్షంగానీ, అటు బీజేపీ పక్షంగానీ వహించకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. నాయర్ సర్వీస్ సొసైటీ, అయ్యప్ప భక్తుల సంఘం నిర్వహిస్తున్న ఆందోళనల్లో పాల్గొంటోంది. ఇప్పటికే దళితులు, మైనారిటీల మద్దతున్న సీపీఎం ఆందోళనల్లో పాల్గొనని జనాన్ని సమీకరించేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ ఆలయల్లో పూజారులుగా నియమించేందుకు ఏడుగురు ఎస్సీలు సహా 54 మంది బ్రాహ్మణేతరుల జాబితాను ఎల్‌డీఎఫ్ ఖరారు చేసింది. గతేడాది కూడా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఆరుగురు దళితులు సహా 36 మంది బ్రాహ్మణేతరులను నియమించింది. ఈ నియామకాలు కూడా రానున్న ఎన్నికల్లో తమకు లబ్ధి చేకూరుస్తాయని ఎల్‌డీఎఫ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం అయ్యప్ప ఆలయం వద్ద ప్రతిష్టంభన కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment