తిరునంతపురం: పోక్సో చట్టాన్ని పాఠ్యాంశంగా తీసుకువచ్చేందుకు తాజాగా కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర హైకోర్టు ప్రశంసించింది. పాఠశాల స్థాయి విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించడంలో ఇప్పటికే 12 ఏళ్లు ఆలస్యమైందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ చట్టంపై అవగాహన లేకపోవడంతోనే స్కూలు విద్యార్థులు, టీనేజర్లపై లైంగిక దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. ఇటీవల ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ బెచు కరియన్ థామస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
చిన్నారులు, ముఖ్యంగా టీనేజర్లపై లైంగిక నేరాలు ఇటీవల పెరిగి పోయాయని ఆయన అన్నారు. పోక్సో చట్టంలోని తీవ్రమైన శిక్షల గురించి తెలియకనే చాలా మంది విద్యార్థులు పరస్పరం లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారన్నారు. పోక్సో చట్టంపై వారికి ఎలాంటి అవగాహన లేదన్నారు.
వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం.. లైంగిక నేరాలు, వాటి పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గాను పాఠశాల సిలబస్‌లో పోక్సో చట్టం చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ), కేరళ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కేరళ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ కలిసి బడికి వెళ్లే బాలల్లో లైంగిక నేరాలపై అవగాహన కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను హైకోర్టు ప్రశంసించింది.
Comments
Please login to add a commentAdd a comment