state high court
-
ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ ఉద్యోగం
జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రభుత్వ డాక్టర్ దీపక్ ఘోగ్రా(43)కు రాష్ట్ర హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన మళ్లీ ఉద్యోగంలో చేరడానినికి అంగీకరించింది. దీపక్ భారతీయ ట్రైబల్ పార్టీ టికెట్‌పై దుంగార్పూర్ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. పరాజయం పాలైతే ఉద్యోగంలో చేర్చుకోవాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు సానుకూలంగా స్పందించింది. ఎన్నికల్లో దీపక్ ఓడిపోతే మళ్లీ ఉద్యోగంలో చేర్చుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. -
స్కూలు సిలబస్‌లో ‘పోక్సో’ చట్టం
తిరునంతపురం: పోక్సో చట్టాన్ని పాఠ్యాంశంగా తీసుకువచ్చేందుకు తాజాగా కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర హైకోర్టు ప్రశంసించింది. పాఠశాల స్థాయి విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించడంలో ఇప్పటికే 12 ఏళ్లు ఆలస్యమైందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ చట్టంపై అవగాహన లేకపోవడంతోనే స్కూలు విద్యార్థులు, టీనేజర్లపై లైంగిక దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. ఇటీవల ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ బెచు కరియన్ థామస్ ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్నారులు, ముఖ్యంగా టీనేజర్లపై లైంగిక నేరాలు ఇటీవల పెరిగి పోయాయని ఆయన అన్నారు. పోక్సో చట్టంలోని తీవ్రమైన శిక్షల గురించి తెలియకనే చాలా మంది విద్యార్థులు పరస్పరం లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారన్నారు. పోక్సో చట్టంపై వారికి ఎలాంటి అవగాహన లేదన్నారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం.. లైంగిక నేరాలు, వాటి పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గాను పాఠశాల సిలబస్‌లో పోక్సో చట్టం చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ), కేరళ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కేరళ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ కలిసి బడికి వెళ్లే బాలల్లో లైంగిక నేరాలపై అవగాహన కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను హైకోర్టు ప్రశంసించింది. -
‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో మొక్కలు నాటిన సీజే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌చంద్ర శర్మ ‘గ్రీన్ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ చాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రత్యేకంగా అభినందించారు. పర్యావరణ పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. తాను కూడా రైతు కుటుంబం నుండి వచ్చిన విషయాన్ని సీజే గుర్తుచేశారు. ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళుతున్నందుకు సంతోష్‌ను ప్రశంసించారు. మంగళవారం గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా హైకోర్టు ప్రాంగణంలో జరిగిన కార్య క్రమంలో సీజే, బీఎస్ ప్రసాద్, ఏజీ జె.రామచంద్రరావులతో కలిసి సంతోష్‌కుమార్ మొక్కలు నాటారు. సీజే సతీశ్‌చంద్ర శర్మ, ఇతర న్యాయమూర్తుల కు ఎంపీ సంతోష్ వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించారు. కార్యక్రమంలో జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ శ్రీసుధ, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పొన్నం అశోక్‌గౌడ్, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్‌రావు, జీపీలు జోగినిపల్లి సాయికృష్ణ, సంతోష్ కుమార్, పీపీలు, సీనియర్ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్, ఫుడ్ కమిషన్ మెంబర్ గోవర్ధన్‌రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. -
హైకోర్టుకు 183 సూపర్‌న్యూమరరీ, 267 అదనపు పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు పరిధిలో 183 సూపర్ న్యూమరరీ, 267 పోస్టుల కల్పనకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి తెలిపింది. ఈ మేరకు కేటగిరీల వారీగా ఆయా పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సూపర్‌న్యూమరరీ పోస్టుల్లో భాగంగా జాయింట్ రిజిస్ట్రార్(1), డిప్యూటీ రిజిస్ట్రార్ (3), అసిస్టెంట్ రిజిస్ట్రార్(10), సెక్షన్ ఆఫీసర్ (50),జడ్జిలు, రిజిస్ట్రార్లకు పీఎస్‌లు(11), డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్లు(12), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు(24), ఎగ్జామినర్(3), డ్రైవర్(30), రికార్డు అసిస్టెంట్(39) పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ అ య్యాయి. ఇక అదనపు పోస్టుల విషయానికి వస్తే జిల్లా కోర్టులు, అదనపు జిల్లా సెషన్స్ కోర్టులు, కమిషనర్లు, ఎస్పీ కార్యాలయాలు, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులు, అసిస్టెంట్ సెషన్స్ కోర్టులు, ప్రధాన కార్యాలయంలో పనిచేసేందుకు 267 పోస్టులకు అనుమతినిచ్చింది. ఇందులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు(4), గ్రేడ్–1 అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (116), గ్రేడ్–2 అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు(39), అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (101), పరిపాలన అధికారులు (2), సూపరిండెంట్లు (2), సీనియర్ అసిస్టెంట్లు(3) పోస్టులు మంజూరయ్యాయి. వీటికి తోడు అసిస్టెంట్ రిజిస్ట్రార్ కేడర్‌లో హైకోర్టులో ఒక ఓఎస్డీ పోస్టును కూడా మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ వేరొక ఉత్తర్వు జారీ చేసింది. -
ఏప్రిల్ 15లోపు ఎన్నిక నిర్వహించండి: హైకోర్టు
హైదరాబాద్‌సిటీ: చిత్తూరు మేయర్ స్థానానికి ఏప్రిల్ 15లోపు ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. 2015 సంవత్సరం నవంబర్ నెలలో చిత్తూరు మేయర్ కఠారీ అనురాధ దంపతులు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో హత్యకు గురైన సంగతి తెల్సిందే. అప్పటి నుంచి మేయర్ ఎన్నిక నిర్వహించకుండా ఆ స్థానం ఖాళీగా ఉంచారు. కొత్త మేయర్ ని ఎన్నుకోకుండా ఖాళీగానే ఉంచారని, దానివల్ల చిత్తూరు ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని, వెంటనే కొత్త మేయర్ కు ఎన్నిక జరపాలంటూ హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. దీనిపై శుక్రవారం విచారించిన హైకోర్టు వచ్చే నెల 15లోపు ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. -
మూడు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు
న్యూఢిల్లీ: మేఘాలయ, కర్ణాటక, ఒడిశా రాష్ట్ర హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఓ ప్రకటన విడుదలచేసింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరిని మేఘాలయ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించారు. కర్ణాటక హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ అయిన జస్టిస్ సుబ్రో కమల్ ముఖర్జీని అదే కోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. కర్ణాటక హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్ వినీత్ సరన్‌ను ఒడిశా హైకోర్టు సీజే నియమించారు. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తి అయిన జస్టిస్ రామయ్యగారి సుభాష్ రెడ్డిని గుజరాత్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. కొలీజియం వ్యవస్థను కేంద్రప్రభుత్వం రద్దుచేశాక గత ఏప్రిల్ నుంచి జాతీయ న్యాయ నియామకాల కమిషన్ అమల్లోకి వచ్చాక ఒక న్యాయమూర్తి సీజేగా నియమించడం ఇదే తొలిసారి. -
మళ్ళీ కలకలం...!
భోగాపురం : గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధిస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై బాధిత గ్రామాల్లో ప్రజలు మంగళవారం పండుగ చేసుకున్నారు. ఇంకా అదే సంతోషంలో రైతులున్న తరుణంలో కోర్టు ఉత్తర్వులతో మాకేంటి అన్నట్టు డి పట్టా భూముల సర్వేకు సర్వేయర్లు బుధవారం బయలుదేరారు. ముందుగా దల్లిపేట గ్రామంలో సర్వేకు వెళ్ళగా వాళ్ళు సహకరించకపోవడంతో వారంతా గూడెపువలస గ్రామం చేరుకుని సర్వే నంబర్ 35లో ఉన్న ప్రభుత్వ భూమిని సర్వే చేసేందుకు సిద్ధమయ్యారు. 35/4 సర్వే నంబర్లో భూమి కలిగిన బోనెల అసిరమ్మ కుమార్తె బోనెల గౌరి సర్వే జరుగుతున్న సంగతి తెలుసుకుని స్థలంవద్దకు చేరుకుంది. తమకు చెప్పకుండా తమ భూముల్లో సర్వే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించింది. అంతేగాకుండా తమకూ ఆ సర్వేనంబర్‌లో భూమి ఉందని తెలిపింది. అయితే పెద్దవాళ్లుంటే తీసుకురావాలనీ, ఇందులో వారి భూమిలేదనీ ఎయిర్‌పోర్టు సర్వే కోసం ప్రభుత్వం నియమించిన సర్వేయరు సుబ్బారావు అనడంతో వెంటనే ఆమె పరుగున ఇంటికి వెళ్ళి తమ వద్దనున్న రికార్డులను తీసుకువచ్చి చూపించింది. రికార్డులు పరిశీలించిన ఆయన మారుమాటాడలేదు. అలాగే 35/9 సర్వే నంబరులో భూమి ఉన్న బోనెల రమణకూడా తన రికార్డులను పట్టుకుని అక్కడకు చేరుకున్నాడు. తమకు చెప్పకుండా తమ భూముల్లో సర్వే ఏవిధంగా చేస్తున్నారని మరొక సర్వేయరు అయిన శ్రీనివాసరావు, వీఆర్ఓ రామచంద్రరావులను నిలదీశాడు. విషయం తెలుసుకున్న సాక్షి అక్కడకు చేరుకుని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాక సర్వే ఎలా చేస్తారని వీఆర్ఓ రామచంద్రరావును ప్రశ్నించగా ఎయిర్‌పోర్టు ప్లానులో లేని సర్వే నం. 69కు చెందిన రైతు బుద్దాన అప్పన్న సర్వే కోరగా తామంతా వచ్చామని తెలిపారు. మరో వీఆర్ఓ సుబ్బారావు మాట్లాడుతూ దల్లిపేట మాజీ సర్పంచ్ దల్లి శ్రీనివాసు ఎయిర్‌పోర్టు ప్లానులో ఉన్న ప్రభుత్వ భూముల సర్వేకు డిప్యూటీ కలెక్టరు శ్రీలతను కోరగా ఆమె ఆదేశాల మేరకు తొలుత దల్లిపేట వెళ్ళామని, అక్కడ ఎవరూ లేకపోవడంతో తిరిగి గూడెపువలస వచ్చామని ఎక్కడా సర్వే చేయలేదని సమాధానమిచ్చారు. ఏదో మామూలుగా వచ్చాం, తప్పయిపోయింది అని తిరుగుముఖం పట్టారు. -
రాష్ట్ర హైకోర్టు ఏర్పాటుకు ఏలూరులో స్థలముంది
సాక్షి, ఏలూరు : నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను ఖరారు చేసిన నేపథ్యంలో.. దానికి అతి చేరువలో ఉన్న ఏలూరు నగరంలో రాష్ట్రస్థాయి కార్యాలయా లు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుం టోంది. ఇందుకు అవసరమైన వసతులు, వనరులు ఇక్కడున్నాయి. కారణాలు కూడా సహేతుకంగానే ఉన్నాయి. ప్రత్యేకించి కోట్లాది రూపాయలను వెచ్చించి నిర్మాణాలు చేయూల్సిన అవసరం లేకుండా భవనాలు కూడా ఇక్కడ సిద్ధంగానే ఉన్నాయి. నిర్మాణానికి అయ్యే ఖర్చులో సగం మొత్తం కేటాయిస్తే వీటిని మరింత విస్తరించేందుకు సువిశాల స్థలాలు సైతం అందుబాటులో ఉన్నాయి. ఈ దృష్ట్యా జిల్లా కోర్టును హైకోర్టుగా.. జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రినిఎయిమ్స్గా మార్చాలని న్యాయవాదులు, ప్రజా సం ఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు ఏర్పాటుకు అనుకూలం ఏలూరులోని జిల్లా కోర్టు ప్రాంగణం 14 ఎరాలకు పైగా స్థలంలో విస్తరించి ఉంది. బ్రిటిష్ కాలంనాటి సువిశాలమైన.. పటిష్టమైన కట్టడాలు కోర్టు ప్రాంగణంలో ఉన్నాయి. విభాగాల వారీగా పెంచుకుంటూ నిర్మాణాలు చేయడానికి ఈ స్థలం సరిపోతుంది. ఈ దృష్ట్యా హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేయాలనే వాదనలు సమర్థనీయం కాదని.. ఏలూరులో అనుకూలమైన నిర్మాణాలు, అందుకు కావలసిన స్థలాలు ఉన్న దృష్ట్యా హైకోర్టును ఇక్కడే ఏర్పాటు చేయూలని జిల్లాలోని వివిధ ప్రాంతాల బార్ అసోసియేషన్ల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా జడ్జిల నివాసానికి అనుకూలమైన వాతావరణంలో 13 ఎకరాల స్థలం ఉంది. నివాస ప్రాంతాలకు దగ్గరగానే కోర్టు భవనం కూడా ఉంది. ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు ప్రత్యేకించి స్థల సేకరణ, నిర్మాణాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందనేది ప్రజా సంఘాల వాదన. ఎయిమ్స్ ఏర్పాటుకు అనుకూలం జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిని వెయ్యి పడకలకు పెంచి, నిర్మాణాలను ఆధునికీకరించి ఎయిమ్స్ స్థాయి ఆస్పత్రిగా తీర్చిదిద్ద వచ్చని స్పష్టం చేస్తున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో వైద్య కళాశాల ఏర్పా టు చేసేందుకు సరిపడినన్ని నిర్మాణాలు, విస్తరణకు అవసరమైన స్థలాలు కూడా ఏలూరులో ఉన్నాయి. ఇక్కడ 23.60 ఎకరాల విస్తీర్ణంలో ఇప్పటికే నిర్మిం చిన భవనాలతోపాటు నూతనంగా వివిధ విభాగాల కోసం నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిని విని యోగించుకుంటే ‘ఎయిమ్స్’ ఏర్పాటుకు సరిపోతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఆస్పత్రి చుట్టూ కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించడం ద్వారా ఆస్పత్రి అభివృద్ధికి మరొకరి సహాయం అవసరం లేకుండా నిధులు కూడా సమకూరతాయని అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్ర డ్రగ్ స్టోర్స్‌కు ఆస్కారం దాదాపు 40 లక్షల జనాభా కలిగిన పశ్చిమగోదావరి జిల్లాకు తొమ్మిది నెలలకు సరిపోయే మందులను నిల్వచేసే సామర్ధ్యం కలిగిన కోల్డ్ స్టోరేజీతో కూడిన డ్రగ్ స్టోర్స్‌ను రాష్ట్ర స్థాయికి తగిన రీతిలో తీర్చిదిద్దడానికి కావాల్సిన నిర్మాణం కూడా ఏలూరులో సిద్ధంగా ఉంది. ఈ స్టోర్స్‌లో 200 నుంచి 300 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. 1998లో దాదాపు రూ.కోటిన్నర ఉన్న జిల్లా డ్రగ్స్ బడ్జెట్ ప్రస్తుతం రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్లకు మధ్యకు చేరింది. త్వరలో మందుల స్టాకు వివరాలను ఆన్లైన్ చేయబోతున్నారు. డ్రగ్ స్టోర్స్‌ను ఆధునికీకరిండానికి కావాల్సినంత స్థలం కూడా ఉంది. హైకోర్టు ఏర్పాటుకు అనుకూలం హైకోర్టు ఏర్పాటు కోసం వేరేచోట కొత్తగా నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రజాధనం వృథా అవుతుంది. ఉన్న నిర్మాణాలను అనుకూలంగా మలిచి మౌలిక వసతులకు, ఆధునికీకరణకు కొద్దిపాటి నిధులు ఖర్చు చేస్తే సరిపోతుంది. ఏలూరులోని కోర్టును ఆధునికీకరిస్తే రాష్ట్ర హైకోర్టుకు పూర్తిగా సరిపోతుంది. భౌగోళికంగా నవ్యాంధ్రప్రదేశ్‌కు మధ్యలో.. అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఏలూరు నగరం ఉంది. అందువల్ల హైకోర్టు ఇక్కడే ఏర్పాటు చేయూలి. - బీవీ కృష్ణారెడ్డి, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆస్పత్రి అభివృద్ధ్దికి సహకరించాలి ఏలూరులో ఆస్పత్రి ప్రాంగణం ఎంతో సువిశాలంగా ఉంది. ఇక్కడే నర్సింగ్ కళాశాల కూడా ఏర్పాటు చేయవచ్చు. అన్ని వసతులతో 2012లో ప్రారంభించిన డ్రగ్స్టోర్స్ను రాష్ట్ర స్థారుు డ్రగ్ స్టోర్స్‌గా తీర్చిదిద్దడానికి అనుకూలంగా ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకుని ఆస్పత్రి అభివృద్ధ్దికి ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలి. - నేరెళ్ల రాజేంద్ర ప్రసాద్, ఐక్య ప్రజావేదిక కన్వీనర్, ఏలూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిని ఎయిమ్స్‌గా మార్చవచ్చు అనుభవజ్ఞులైన సిబ్బంది, నైపుణ్యం కలిగిన వైద్యులను అన్ని విభాగాల్లో భర్తీ చేసి పూర్తిస్థాయిలో ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చడం ద్వారా జిల్లా ప్రభుత్వాస్పత్రిని ఎయిమ్స్‌గా మార్చవచ్చు. ఇక్కడ అందుబాటులో ఉన్న భవనాలు, ఖాళీ స్థలాలు ఎయిమ్స్ ఏర్పాటుకు సరిపోతాయి. జిల్లా ప్రజలకు ఇప్పటివరకూ సరైన ప్రభుత్వ వైద్యసేవలు అందడం లేదు. వైద్యం కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది. కనీసం ఎయిమ్స్ వస్తే ఇక్కడి ప్రజల ఇబ్బందులు తీరతాయి. -మంతెన సీతారాం, సీపీఎం జిల్లా కార్యదర్శి -
కొత్త న్యాయస్థానాలు 31
సాక్షి, రంగారెడ్డి జిల్లా : న్యాయసేవలను విస్తృతం చేసేందుకు రాష్ట్ర హైకోర్టు మరో అడుగు ముందుకేసింది. న్యాయస్థానానికి వచ్చే కేసుల పరిశీలనను వేగవంతం చేయాలనే సంకల్పంతో జిల్లాకు కొత్తగా 31 కోర్టులను మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నగరం చుట్టూ జిల్లా విస్తరించి ఉండడం, ప్రజల రాకపోకలు, ఇతర కార్యకలాపాలన్నీ జిల్లా నుంచే జరుగుతున్న నేపథ్యంలో సమస్యలు సైతం జిల్లాలో ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో న్యాయస్థానానికి వెళ్లే కేసులు సైతం అధికంగా ఉన్నాయి. ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు హైకోర్టు చర్యలు చేపట్టింది. జిల్లాకు హైకోర్టు మంజూరు చేసిన న్యాయస్థానాల్లో 25 జూనియర్ సివిల్ జడ్జీ కమ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్స్ కోర్టులు, మరో ఆరు జ్యుడీషియల్ సర్వీస్ సెంటర్లున్నాయి. ఇవి మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, వికారాబాద్, కూకట్పల్లి, మల్కాజిగిరి, మేడ్చల్, హయత్‌నగర్, పరిగి, చేవెళ్ల, తాండూరు ప్రాంతాల్లో వీటిని నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇవన్నీ ఈనెల 21 నుంచి అందుబాటులోకి రానున్నాయి. కొత్త న్యాయ స్థానాలిక్కడే.. జిల్లాకు కొత్తగా మంజూరైన 31 న్యాయస్థానాలను 11 ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. మల్కాజిగిరిలో రెండు, మేడ్చల్‌లో ఐదు, హయత్‌నగర్‌లో ఒకటి, మహేశ్వరంలో ఒకటి, ఇబ్రహీంపట్నంలో మూడు, కూకట్‌పల్లిలో ఆరు, రాజేంద్రనగర్‌లో మూడు, పరిగిలో మూడు, తాండూరులో మూడు, వికారాబాద్‌లో మూడు న్యాయస్థానాలు ఏర్పాటు కానున్నాయి. ఈనెల 21 నుంచి అందుబాటులోకి వచ్చే ఈ న్యాయస్థానాల తాత్కాలిక బాధ్యతలు సమీపంలోని న్యాయమూర్తులకు అప్పగించింది. -
ఎంత.. ఏమిటి .. ఎలా?
నగరం,(మామిడికుదురు) :గ్యాస్ పైపులైన్ విస్ఫోటం ఘటనపై రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు రాజోలు సీనియర్ సివిల్ జడ్జి పి.రాజేంద్రప్రసాద్ మంగళవారం విచారణ నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాధితులు, గ్రామస్తులు, గెయిల్, రెవెన్యూ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. పేలుడు వల్ల ఎంత మేర నష్టం జరిగింది, ఎంత మంది చనిపోయారు, ఎంత మంది గాయపడ్డారు, వారి ప్రస్తుత పరిస్థితి, పంట నష్టమెంత? గృహాలకు, పశువులకు జరిగిన నష్టం ఎంత? గెయిల్ అధికారులు అందించిన పరిహారంపై బాధితుల స్పందన ఎలా ఉంది? బాధితులకు పరిహారం అందించడంలో సమస్యలున్నాయా? రిలే నిరాహార దీక్షలు ఎందుకు చేస్తున్నారు? వారి డిమాండ్లు ఏంటి? తదితర అంశాలపై జడ్జి రాజేంద్రప్రసాద్ వివరాలు నమోదు చేసుకున్నారు. బుధవారం సాయంత్రానికి కల్లా నివేదిక ఇవ్వాల్సి ఉందని ఆయన వెల్లడించారు. న్యాయం జరగలేదని... కొబ్బరి చెట్లకు పరిహారం అందించే విషయంలో తమకు న్యాయం జరగడం లేదని వానరాశి శంకర్రావు, రాయుడు జనార్దన్, అక్రమ్ అలీ ఫిర్యాదు చేశారు. కొబ్బరి చెట్లు చనిపోవడం వల్ల పదేళ్ల పాటు తమకు నెలనెలా వచ్చే ఆదాయాన్ని కోల్పోవలసి వస్తోందన్నారు. క్షతగాత్రులకు ఇచ్చే మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. దీనిపై గెయిల్ అధికారులు మాట్లాడుతూ జిల్లా అధికారుల సూచన మేరకు పరిహారం చెల్లిస్తున్నామన్నారు. బాధితుల డిమాండ్లను పరిశీలిస్తామని చెప్పారు. పేలుడు వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగితే చైర్మన్, మండల లీగల్ సర్వీసు కమిటీ, రాజోలు పేరిట తమకు దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా న్యాయ సహాయం చేస్తామని జడ్జి రాజేంద్రప్రసాద్ వివరించారు. అనంతరం పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. స్థానిక సర్పంచ్ మొల్లేటి కొండాలమ్మ, గెయిల్ డీజీఎం అనూప్ గుప్తా, చీప్ మేనేజర్లు పీఎన్ రావు, పి.మోహన్కొండయ్య, రాజారావు, ఏజీపీ మైఖేల్, ఏపీపీ సుధాకర్, అడ్వకేట్ వి.లక్ష్మీపతి, ఎం.అక్కిరాజు పాల్గొన్నారు. -
హైకోర్టు జడ్జిలు 26న రాక
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : రాష్ట్ర హైకోర్టు జడ్జిలు జస్టిస్ అశుతోష్ మొహంత, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఈ నెల 26న మచిలీపట్నం రానున్నారు. ఆ రోజు ఉదయం 10.20 గంటలకు మచిలీపట్నంలోని అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాలను వారు ప్రారంభిస్తారు. అనంతరం అక్కడినుంచి బయల్దేరి ఉదయం 11.30 గంటలకు విజయవాడ చేరుకుంటారు. అక్కడ 6వ, 7వ అదనపు సీనియర్ సివిల్ జడ్జిల కోర్టు భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తారు. జస్టిస్ అశుతోష్ మొహంత సాయంత్రం ఐదు గంటలకు విమానంలో బయలుదేరి హైదరాబాదు వెళతారు. జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి రాత్రి 10.50 గంటలకు మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాదుకు బయల్దేరతారు. -
ఏప్రిల్ 30, మే 1న హైకోర్టుకు సెలవు...
హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టుకు ఏప్రిల్ 30, మే 1వ తేదీల్లో సెలవు దినాలుగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ప్రకటించారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణ ప్రాంతంలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో సెలవు ప్రకటించగా, మే 1వ తేదీని కూడా పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు. హైకోర్టుకు రెండు రోజులు సెలవు ఉన్నందున, ఈ రెండు రోజులకు బదులు శనివారాల్లో కోర్టు పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆగస్టు 30(శనివారం), అక్టోబర్ 18(శనివారం)న హైకోర్టుతోపాటు రిజిస్ట్రీ పనిచేస్తుందని రిజిస్ట్రార్ జనరల్ ఒక ప్రకటనలో వివరించారు. -
హైకోర్టు సీజేగా జస్టిస్ రోహిణి
ఢిల్లీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా చరిత్ర హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రోహిణికి పదోన్నతి లభించింది. ఆమె ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తద్వారా ఆమె ఢిల్లీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్రకెక్కారు. జస్టిస్ రోహిణి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. వచ్చేవారం ఆమె ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. జస్టిస్ రోహిణి ప్రస్తుతం హైకోర్టులో నంబర్ టూగా కొనసాగుతున్నారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆమె పేరును సుప్రీంకోర్టు కొలీజియం గత నెలలో కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. తరువాత జస్టిస్ రోహిణి నియామకానికి సంబంధించిన ఫైల్‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపింది. దీంతో రాష్ట్రపతి ఆమెను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ రోహిణి 1955, ఏప్రిల్ 14న విశాఖపట్నంలో జన్మించారు. ఆంధ్రా వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1980లో న్యాయవాదిగా నమోదై, సీనియర్ న్యాయవాది కోకా రాఘవరావు వద్ద జూనియర్‌గా న్యాయవాద వృత్తి ప్రారంభించారు. కోకా రాఘవరావు ఎడిటర్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్ లా జర్నల్స్‌కు జస్టిస్ రోహిణి 1985లో రిపోర్టర్‌గా వ్యవహరించారు. తరువాత అదే జర్నల్స్‌కు ఆమె ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రిట్స్, సివిల్, క్రిమినల్, సర్వీసు కేసుల్లో నిపుణత సాధించారు. 1995లో ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టి, 2001లో అదనపు న్యాయమూర్తిగా, 2002లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ధైర్యానికి మారుపేరుగా నిలిచే జస్టిస్ రోహిణి న్యాయమూర్తిగా పలు సంచలన తీర్పులు వెలువరించారు. -
కొనసాగుతున్న ఉత్కంఠ..
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తే.. ఆ ప్రభావం స్థానిక, సార్వత్రిక ఎన్నికలపై పడుతుందన్న పార్టీల పిటిషన్‌తో రాష్ట్ర హైకోర్టు ఫలితాలను ఈనెల 9కి వాయిదా వేసింది. అయితే.. అప్పుడు కూడా వెలువడకుండా సార్వత్రిక ఎన్నికల తర్వాతే ఇవ్వాలని పార్టీలు మళ్లీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ మేరకు ఆ ఫలితాలపై తీర్పు సోమవారం వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల్లో అయోమయం నెలకొంది. సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు మార్చి 30న ఎన్నికలు జరిగాయి. అయితే.. వాటి ఫలితాలను ఈనెల 2నే ప్రకటించాల్సి ఉన్నా.. ఫలితాలు వాయిదా వేయాలని పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో హైకోర్టు ఫలితాలను 9వ తేదీన వెల్లడించాలని తీర్పునిచ్చింది. అయితే.. ఈ నేపథ్యంలో ఫలితాలు విడుదల చేయొద్దని వారు మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో ము న్సిపాలిటీల్లో ఎక్కడచూసినా ఎన్నికల ఫలితాలపై సంది గ్ధం, ఆసక్తి నెలకొంది. వాయిదాలపై రకరకాలుగా చర్చ లు జరుగుతాన్నాయి. నెలరోజులపాటు హడావిడి కని పించిన మున్సిపాలిటీల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహిం చింది. ప్రస్తుతం ఏ అభ్యర్థిని చూసినా ఉత్కంఠతో కనిపిస్తున్నాడు. ఫలితాలు వెల్లడైతే గెలుపు ఎవరిదో.. ఓటమి ఎవరిదోనని తేలిపోతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం వచ్చిన ఎన్నికలతో మున్సిపాలిటీల్లో రసవత్తర రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఇక మున్సిపల్ చైర్పర్సన్ పీఠాలను కైవసం చేసుకోవాలని పార్టీలూ తహతహలాడుతున్నాయి. సార్వత్రికం తర్వాతేనా..? జిల్లాలోని మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. మందమర్రిలో మాత్రం ఈసారి కూడా ఎన్నికల నిర్వహించలేదు. అయితే.. అభ్యర్థుల భవిత ఈవీఎంలలో నిక్షిప్తమై భద్రంగా ఉంది. ఇదిలే ఉంటే.. సార్వత్రిక ఎన్నికల తర్వాతే ఈ ఫలితాలు వెల్లడయితాయని రాజకీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎవరి లెక్కలు వారివే.. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ గెలుపుపై అంచనాలు వేస్తున్నారు. తమకు వచ్చే ఓట్లెన్నీ.. గెలిచే అవకాశాలు ఉన్నాయా.. ఈ ఓటు మనదేనా అంటూ బేరీజు వేస్తున్నారు. ఓటరు జాబితాలతో కుస్తీపడుతున్నారు. ఒకానొక దశలో తమ గెలుపు ఖాయమనే ధీమాలో ఉన్నారు. ఆయా పార్టీలు చైర్మన్ పీఠం తమదేనన్న ఆశగా తమ నేతలతో సమాలోచనలు చేస్తూ సుదీర్ఘ చర్చలు సాగిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఎన్నికలు జరగడం, కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరగడం, కొంత పోలింగ్ శాతం కూడా మెరుగుపడటంతో ఆసక్తి పెరిగింది. -
హైకోర్టుకు బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టులో బుధవారం ఉదయం బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. హైకోర్టులో నాలుగు బాంబులున్నాయని, అవి ఏ క్షణమైనా పేలవచ్చునంటూ ఓ ఆగంతకుడు బుధవారం ఉదయం 10.30 గంటలకు పోలీసు కంట్రోల్‌రూమ్‌కు ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో పోలీసులతోపాటు బాంబు, డాగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగి హైకోర్టుకు చేరుకున్నాయి. హైకోర్టు పరిసర ప్రాంతాలన్నింటినీ క్షుణ్నంగా తనిఖీలు చేశారు. సుమారు రెండు గంటలపాటు తనిఖీలు నిర్వహించిన అనంతరం.. అది ఉత్తుత్తి ఫోన్‌కాల్‌గా పోలీసులు నిర్ధారించారు. అది వైజాగ్ నుంచి ఓ ల్యాండ్‌లైన్ ఫోన్ ద్వారా వచ్చినట్లు కనుగొన్నారు. -
మూడు వారాల్లో సమాధానమివ్వండి!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేసిన దర్యాప్తు పురోగతిని తెలియజేయాలని రాష్ట్ర హైకోర్టు ఆ శాఖను ఆదేశించింది. ఇందుకు మూడు వారాల సమయం ఇస్తూ న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్ ఉత్తర్వులు ఇచ్చారు. వివరాల్లోకెళితే...హెచ్‌సీఏలో జరుగుతున్న అవినీతిపై ఏసీబీతో విచారణ చేయించాలని రోషనార క్లబ్ దాదాపు మూడేళ్ల క్రితం పిటిషన్ దాఖలు చేసింది. అనంతర పరిణామాల్లో ఏసీబీ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపింది కూడా. దీనికి సంబంధించి అరెస్ట్ అవకుండా అందులో ఉన్న ఆరోపితులు కోర్టునుంచి స్టే కూడా తెచ్చుకున్నారు. అయితే కొంతకాలంగా ఈ దర్యాప్తు నెమ్మదించింది. ఈ నేపథ్యంలో కేసు ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ రోషనార క్లబ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. లేదంటే హెచ్‌సీఏలో అవినీతి మరింత పెరిగిపోతుందని వారు ఇందులో ఆరోపించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఏసీబీకి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. -
న్యాయవాద వృత్తి మహోన్నతమైనది
తిరుపతి లీగల్, న్యూస్‌లైన్: న్యాయ వాద వృత్తి మహోన్నతమైనదని రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రినాయుడు అన్నారు. తిరుపతి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఓ ప్రైవేట్ హోటల్లో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తిరుపతి న్యాయవాదుల సం ఘం అధ్యక్షుడు పి.రమణ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ అభినందన సభలో జస్టిస్ దామా శేషాద్రి నాయుడు మాట్లాడుతూ కృషి, పట్టుదలతో యువ న్యాయవాదులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. జీవితంలో ఓ మనిషి ఓ వృత్తిని ఎంచుకుని దానిపైనే శ్రద్ధ పెడితే మహోన్నత స్థానాన్ని పొందవ చ్చని అన్నారు. తిరుపతి బార్ అసోసియేషన్ తనకు మాతృ సంస్థ అని దీనికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. తన ఉన్నతికి సహకరించిన సీనియర్ న్యాయవాదులను మరువలేనన్నారు. జిల్లా జడ్జి ఎల్. రవిబాబు మాట్లాడుతూ వ్యవసాయకుటుంబంలో జన్మించి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ శేషాద్రినాయుడుకు జిల్లా న్యాయమూర్తుల తరపున అభినందనలు తెలిపారు. జస్టిస్ శేషాద్రినాయుడుకు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలను, ఆయన వృత్తిలో ఎలా పైకి వచ్చారనే విషయాలను స్క్రీన్ పై చిత్రాల రూపంలో చూపించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఎం. దొరైరాజ్, చెన్నకేశవరెడ్డి, ఐ.గురుస్వామి, ముక్కు సత్యవంతుడు, కె.అజయ్‌కుమార్, ఎంఎన్. మణి, వజ్రాల చంద్రశేఖర్, మట్టా పురుషోత్తంరెడ్డి, టి. గోపీచంద్, నెల్లూరు యోగానంద్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. -
కుక్కెలో మడెస్నాన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఎవరెంతగా వ్యతిరేకించినా దక్షిణ కన్నడ జిల్లా కుక్కె సుబ్రమణ్యలో శుక్రవారం మడెస్నానను నిర్వహించారు. ఎంగిలి విస్తర్లపై పొర్లు దండాలు పెట్టే మడెస్నానను దురాచారంగా అనేక మంది అభివర్ణించి, వ్యతిరేకించినప్పటికీ 202 మంది పురుషులు, మహిళలు దీనిని ఆచరించారు. నిడుమామిడి మఠానికి చెందిన శ్రీ వీరభద్ర చన్నమల్ల స్వామీజీ నేతృత్వంలో బెంగళూరులో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మఠాధిపతులు సత్యాగ్రహం చేపట్టినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. స్నానాలు చేశాక తడి బట్టలతో బ్రాహ్మణులు భోంచేసి విడిచి పెట్టిన అరటి ఆకులపై పొర్లు దండాలు పెట్టే మడెస్నానపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆదివారం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా పెద్ద సంఖ్యలో భక్తులు పొర్లు దండాలు పెట్టే అవకాశాలున్నాయి. అన్ని వర్గాలతో పాటు బ్రాహ్మణులు కూడా ఎంగిలి విస్తర్లపై పొర్లు దండాలు పెట్టడం ఇక్కడి ఆచారమని ఆలయ వర్గాలు తెలిపాయి. చర్మ వ్యాధులు నయమవుతాయని, కష్టాల నుంచి గట్టెక్కవచ్చనే మూఢ నమ్మకంతో నిర్వహిస్తున్న ఈ దురాచారాన్ని శాశ్వతంగా నిషేధించాలని రాష్ర్ట వెనుకబడిన తరగతుల చైతన్య వేదికతో పాటు పలువురు మఠాధిపతులు డిమాండ్ చేస్తున్నారు. కాగా భగవంతునికి ప్రసాదంగా సమర్పించిన ఆహార పదార్థాలపై పొర్లు దండాలు పెట్టడానికి అనుమతినిస్తూ రాష్ట్ర హైకోర్టు గత ఏడాది నవంబరులో జారీ చేసిన ఆదేశాలను, అదే ఏడాది డిసెంబరులో సుప్రీం కోర్టు నిలుపుదల చేసింది. -
‘ఆధార్’ పనికిమాలిన విధానం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధార్ ప్రాజెక్ట్ ఒక పనికిమాలిన విధానమంటూ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆధార్ పొందేందుకు వృద్ధులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయం కేంద్రానికి అర్థంకానట్లుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ‘ఆధార్’తీసుకోవాలన్న నిబంధన ఎంత మాత్రం సరికాదని అభిప్రాయపడింది. ‘ఆధార్’ నిబంధనలను సవాలు చేస్తూ హైదరాబాద్, సరూర్‌నగర్‌కు చెందిన టి.ఎస్.ఆర్.శర్మ దాఖలుచేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది చల్లా సీతారామయ్య వాదనలు వినిపించారు. కేంద్రం తన అధికార పరిధిని అతిక్రమించి మరీ బయోమెట్రిక్ విధానం ద్వారా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమే కాక, మానవ హక్కుల పరిరక్షణ చట్టం-1993 నిబంధనల ఉల్లంఘనేనని నివేదించారు. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 14ఎ ప్రకారం దేశ పౌరులందరి పేర్లను నమోదుచేసి, జాతీయ గుర్తింపు కార్డు ఇవ్వాలని, ఇందులో భాగంగానే జనన, మరణాల రిజిస్టర్‌ను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే కేంద్రం దేశ పౌరులందరికీ పలు రకాల గుర్తింపు కార్డులు ఇచ్చిందని, వాటన్నింటిని పౌరులు తమ హక్కులు పొందడానికి వాడుకుంటున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇవిలా ఉండగానే 2010లో కేంద్రం ‘నేషనల్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఇండియా బిల్లు’ను తీసుకొచ్చి ఆధార్ కార్డుల జారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందన్నారు. వాస్తవానికి ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదని, అయినప్పటికీ ఆధార్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని పౌరులపై ఒత్తిడి చేస్తోందని తెలిపారు. ఆధార్‌కూ గ్యాస్ సిలిండర్‌కూ ముడిపెడుతూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆధార్ గుర్తింపు కోసమే తప్ప మరో ప్రయోజనానికి కాదని చెబుతూనే, దాన్ని ఇతర ప్రయోజనాల కోసం వర్తింపచేయడం తగదన్నారు. భారీ ప్రజాధనంతో బయోమెట్రిక్ విధానంతో పౌరుల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని, ఇలాచేసే అధికారం కేంద్రానికి లేదనిు నివేదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఇప్పటికే పౌరులకు ఎన్నో గుర్తింపు కార్డులున్నాయి. వాటిని వివిధ సేవలకు వాడుకుంటున్నారు. మళ్లీ కొత్తగా మరో కార్డు ఎందుకు? వివిధ పథకాలకు ప్రభుత్వం ఎన్నో ఏళ్ల నుంచి సబ్సిడీలు ఇస్తోంది. ఎప్పుడూ ఇబ్బందులొచ్చిన దాఖలాల్లేవు. అయినా ప్రజలు ముందస్తుగా పూర్తి మొత్తం చెల్లించడమేంటి? ఆ తర్వాత ప్రభుత్వం సబ్సిడీని తిరిగి ఇవ్వడమేంటి? ఈ కార్డు కోసం 80 ఏళ్లవారూ గంటలపాటు బారులు తీరాల్సి వస్తోంది. వారి ఇబ్బందులు కేంద్రానికి అర్థంగాకుండా ఉన్నట్లుంది. వయసుతో పని లేకుండా అందరూ ఆధార్ పొందాలన్న నిబంధన ఏమాత్రం సరికాదు. 50-60 ఏళ్ల వారివద్దనున్న అనేక రకాల గుర్తింపు కార్డులను బట్టి వారి వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉంటాయి. మళ్లీ వాటిని సేకరించాలని నిర్ణయించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావట్లేదు. అసలు ఈ ప్రాజెక్టు ఓ పనికిమాలిన విధానం. దీనివల్ల ఏం ప్రయోజనం కలుగుతుందో కేంద్రానికే తెలియాలి’ అని వ్యాఖ్యానించింది. వ్యాజ్యంపై పూర్తిస్థాయిలో వాదనలు వింటామంటూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
జాతీయ బీసీ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ ఈశ్వరయ్య
ఢిల్లీలో బాధ్యతల స్వీకరణ సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: జాతీయ బీసీ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ వంగాల ఈశ్వరయ్య గురువారం ఢిల్లీలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఈశ్వరయ్య రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తిం చారు. నల్లగొండ జిల్లా, వలిగొండ మండలం, నెమిలి కాల్వలో 1951, మార్చి 10న జన్మించిన ఈశ్వరయ్యు అక్కడే ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయుశాస్త్రంలో డిగ్రీ పొందారు. 1978లో న్యాయవాదిగా నమోదయ్యారు. 1999లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2000 సంవత్సరంలో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యూరు. తరువాత రెండుసార్లు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. క్రియాశీల రాజకీయాల్లో ఈశ్వరయ్య కుటుంబం జస్టిస్ ఈశ్వరయ్య కుటుంబ సభ్యులు రాజకీయాల్లో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఆయున హైకోర్టు న్యాయమూర్తి కాకముందు ఆయన భార్య వంగాల శ్యామలాదేవి నల్లగొండ జిల్లా వలిగొండ నుంచి టీ డీపీ తరఫున జెడ్పీటీసీగా ఎన్నికై, దాదాపు ఐదేళ్లు ఆ పదవిలో కొనసాగారు. అంతకుముందు, తెలుగుదేశం పార్టీ మహిళావిభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు. జస్టిస్ ఈశ్వరయ్య కుటుంబ సభ్యులు పలువురు ఇప్పటికీ నల్లగొండ జిల్లా టీ డీపీలో పలు పదవుల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఈశ్వరయ్య అల్లుడు 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. జస్టిస్ ఈశ్వరయ్య తండ్రి వంగాల అంజయ్యగౌడ్. ఆయనకు నలుగురు కుమారులు. బాలనర్సయ్య గౌడ్, స్వామిగౌడ్, ఈశ్వరయ్యగౌడ్, వాసుగౌడ్. బాలనర్సయ్య గౌడ్ టీడీపీ వలిగొండ మండల శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. మరో సోదరుడు స్వామిగౌడ్ గ్రామంలోనే వ్యవసాయం, ఇతర పనులు చూసుకునేవారు. జస్టిస్ ఈశ్వరయ్యకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఒక కుమారుడు రామచంద్రగౌడ్ హైకోర్టులో న్యాయవాది. ఈశ్వరయ్యు చివరి సోదరుడు వాసుగౌడ్ నెమలికాల్వ నుంచి టీడీపీ తరఫున ఎంపీటీసీగా గెలిచారు. ఇటీవల పదవీకాలం ముగిసేదాకా అదే పదవిలో ఉన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య పెద్దనాన్న కుమారుడి పేరు కూడా వంగాల స్వామిగౌడ్. ఆయున టీడీపీ నల్లగొండ జిల్లా కన్వీనర్‌గా ఉన్నారు. ఆయున 2004 ఎన్నికల్లో మిర్యాలగూడనుంచి టీడీపీ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు.