తిరుపతి లీగల్, న్యూస్‌లైన్: న్యాయ వాద వృత్తి మహోన్నతమైనదని రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రినాయుడు అన్నారు. తిరుపతి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తిరుపతి న్యాయవాదుల సం ఘం అధ్యక్షుడు పి.రమణ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ అభినందన సభలో జస్టిస్ దామా శేషాద్రి నాయుడు మాట్లాడుతూ కృషి, పట్టుదలతో యువ న్యాయవాదులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. జీవితంలో ఓ మనిషి ఓ వృత్తిని ఎంచుకుని దానిపైనే శ్రద్ధ పెడితే మహోన్నత స్థానాన్ని పొందవ చ్చని అన్నారు.
తిరుపతి బార్ అసోసియేషన్ తనకు మాతృ సంస్థ అని దీనికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. తన ఉన్నతికి సహకరించిన సీనియర్ న్యాయవాదులను మరువలేనన్నారు. జిల్లా జడ్జి ఎల్. రవిబాబు మాట్లాడుతూ వ్యవసాయకుటుంబంలో జన్మించి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ శేషాద్రినాయుడుకు జిల్లా న్యాయమూర్తుల తరపున అభినందనలు తెలిపారు.
జస్టిస్ శేషాద్రినాయుడుకు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలను, ఆయన వృత్తిలో ఎలా పైకి వచ్చారనే విషయాలను స్క్రీన్ పై చిత్రాల రూపంలో చూపించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఎం. దొరైరాజ్, చెన్నకేశవరెడ్డి, ఐ.గురుస్వామి, ముక్కు సత్యవంతుడు, కె.అజయ్‌కుమార్, ఎంఎన్. మణి, వజ్రాల చంద్రశేఖర్, మట్టా పురుషోత్తంరెడ్డి, టి. గోపీచంద్, నెల్లూరు యోగానంద్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాద వృత్తి మహోన్నతమైనది
Published Thu, Dec 12 2013 4:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement