రాష్ట్రంలో పెద్ద ఆలయాల వద్ద ప్రైవేట్ హోటళ్ల నిర్మాణం
ఈ మేరకు ప్రతిపాదనల తయారీకి సీఎం చంద్రబాబు ఆదేశం
దాదాపు ప్రతి పెద్ద ఆలయం వద్ద ఇప్పటికే అందుబాటులో వసతి గదులు
మళ్లీ కొత్తగా ప్రైవేట్ హోటల్స్ నిర్మాణం ఎందుకని అధికారుల్లో చర్చ
రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల పరిసరాల్లో 4,355 ఎకరాల విలువైన స్థలాలు
ఇక్కడ వ్యాపార అవకాశాలు అధికంగా ఉండటం వల్లే ఈ నిర్ణయం!
పట్టణ ప్రాంతాల్లో విలువైన ఖాళీ భూముల వివరాలు కూడా కోరిన సీఎం
అన్ని ఆలయాల బ్యాంకు డిపాజిట్ల వివరాలూ సిద్ధం చేయాలని ఆదేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల సమీపంలో కోట్ల రూపాయల విలువైన దేవుడి భూములను కొంత మంది ప్రైవేట్ హోటల్ వ్యాపారులకు కట్టబెట్టే ప్రక్రియకు చంద్రబాబు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని 20 రోజుల క్రితం గత నెల 27వ తేదీన దేవదాయ శాఖ మంత్రి, అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఒక్కో చోట రెండేసి చొప్పున ప్రముఖ హోటల్ యజమానుల ఆధ్వర్యంలో హోటల్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం మినిట్స్ పాయింట్స్‌ను వారం రోజుల కిత్రమే దేవదాయ శాఖ కమిషనర్ శాఖ అధికారులకు తెలియజేస్తూ మెమో కూడా జారీ చేశారు. విజయవాడ దుర్గ గుడి వంటి ఒకటీ అరా తప్ప.. రాష్ట్రంలో పెద్ద ఆలయాలు అన్నింటి వద్ద దైవ దర్శనాలకు వచ్చే భక్తుల వసతి సౌకర్యాల కోసం ఆలయ వసతి గదులు అందుబాటులో ఉన్నాయి. చాలా చోట్ల అన్ని రకాల వసతులతో కూడిన ఏసీ గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాంటప్పుడు.. ఆలయాల వద్ద ప్రముఖ ప్రైవేట్ హోటల్స్ నిర్మాణం ప్రతిపాదనలను సీఎం ఎందుకు తీసుకొచ్చారన్నది తమకు అర్థం కాలేదని కొందరు దేవదాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
దేవదాయ శాఖ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు, వాటి చుట్టు పక్కల మొత్తం 2.11 కోట్ల చదరపు గజాల (4,355 ఎకరాలు) విస్తీర్ణంలో వేల కోట్ల విలువ చేసే భూములు ఖాళీగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆలయం చుట్టు పక్కల అంటే వ్యాపార అవకాశాలు మెరుగ్గా ఉంటాయని.. దీనికి తోడు ఆలయాలకు ఆత్యంత సమీపంలోనే పెద్ద విస్తీర్ణంలో ఖాళీ స్థలాలు ఉండడంతో ప్రముఖ హోటల్స్ యజమానులు ఆయా ప్రాంతాల్లో కొత్త హోటల్స్ నిర్మాణానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో హోటల్స్ నిర్మాణం పేరుతో విలువైన భూముల దోపిడీకి అస్కారం ఉంటుందని అంటున్నారు.
గతంలోనూ ఇంతే..
2014–19 మధ్య కూడా రాష్ట్రంలో పలుచోట్ల దేవుడి భూములను అమ్మేందుకు అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇదే తరహా డైవర్షన్ రాజకీయాలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అప్పట్లో విజయనగరంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి నిధుల కోసం అంటూ విశాఖపట్నం చుట్టు పక్కల ఉన్న విలువైన దేవదాయ శాఖ భూముల అమ్మకానికి 2014లో అప్పటి టీడీపీ–బీజేపీ ప్రభుత్వం మాన్సాస్ ట్రస్టుకు ఆదేశాలిచ్చింది. రూ.వంద కోట్ల మేర భూములు కూడా విక్రయించింది. ఇంతా చేసినా, అప్పట్లో విజయనగరంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి కనీసం పత్రిపాదనలు కూడ సిద్ధం చేయలేదు. మరోవైపు.. ఉమ్మడి గుంటూరు జిల్లా అమరావతి మండల కేంద్రంలోని సదావర్తి సత్రం పేరిట తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని భూములను తక్కువ ధరకే కొందరు టీడీపీ నాయకులకు కట్టబెట్టే యత్నాలు చేసిన విషయం తెలిసిందే. అయితే, అప్పట్లో ఈ అంశంపై వైఎస్సార్‌సీపీ నాయకులు న్యాయ పోరాటం చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ భూములు రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కూడ కారణమయ్యాయి.
దేవుడి బ్యాంకు డిపాజిట్లపై కన్ను
కేవలం పట్టణ ప్రాంతాల్లోనే వివిధ ఆలయాలు, వివిధ రకాల దేవదాయ, ధర్మదాయ ధార్మిక సంస్థ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 1.55 కోట్ల చదరపు గజాల (3,203 ఎకరాల) భూములున్నాయి. అత్యధిక చోట్ల గజం భూమి విలువ రూ.20 వేలకు తక్కువ కాకుండా, కొన్ని చోట్ల లక్ష రూపాయల దాకా కూడా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి భూముల వినియోగంపై తగిన ప్రతిపాదనలు కోరడంతో పాటు.. వివిధ ఆలయాల పేరిట బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు, వాటి వడ్డీ రేట్ల వివరాలు సైతం సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని ఆలయాల డిపాజిట్ల వివరాలు కోరడం వెనుక కారణమేంటన్నది ప్రస్తుతం ఆ శాఖలో చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి: శ్రీవారి లడ్డూపై వివాదం.. బాబు పక్కా స్కెచ్‌తోనే..
Comments
Please login to add a commentAdd a comment