private hotel
-
AP: దేవుడి భూములకు ఎసరు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల సమీపంలో కోట్ల రూపాయల విలువైన దేవుడి భూములను కొంత మంది ప్రైవేట్ హోటల్ వ్యాపారులకు కట్టబెట్టే ప్రక్రియకు చంద్రబాబు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని 20 రోజుల క్రితం గత నెల 27వ తేదీన దేవదాయ శాఖ మంత్రి, అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు.ఒక్కో చోట రెండేసి చొప్పున ప్రముఖ హోటల్ యజమానుల ఆధ్వర్యంలో హోటల్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం మినిట్స్ పాయింట్స్‌ను వారం రోజుల కిత్రమే దేవదాయ శాఖ కమిషనర్ శాఖ అధికారులకు తెలియజేస్తూ మెమో కూడా జారీ చేశారు. విజయవాడ దుర్గ గుడి వంటి ఒకటీ అరా తప్ప.. రాష్ట్రంలో పెద్ద ఆలయాలు అన్నింటి వద్ద దైవ దర్శనాలకు వచ్చే భక్తుల వసతి సౌకర్యాల కోసం ఆలయ వసతి గదులు అందుబాటులో ఉన్నాయి. చాలా చోట్ల అన్ని రకాల వసతులతో కూడిన ఏసీ గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాంటప్పుడు.. ఆలయాల వద్ద ప్రముఖ ప్రైవేట్ హోటల్స్ నిర్మాణం ప్రతిపాదనలను సీఎం ఎందుకు తీసుకొచ్చారన్నది తమకు అర్థం కాలేదని కొందరు దేవదాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.దేవదాయ శాఖ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు, వాటి చుట్టు పక్కల మొత్తం 2.11 కోట్ల చదరపు గజాల (4,355 ఎకరాలు) విస్తీర్ణంలో వేల కోట్ల విలువ చేసే భూములు ఖాళీగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆలయం చుట్టు పక్కల అంటే వ్యాపార అవకాశాలు మెరుగ్గా ఉంటాయని.. దీనికి తోడు ఆలయాలకు ఆత్యంత సమీపంలోనే పెద్ద విస్తీర్ణంలో ఖాళీ స్థలాలు ఉండడంతో ప్రముఖ హోటల్స్ యజమానులు ఆయా ప్రాంతాల్లో కొత్త హోటల్స్ నిర్మాణానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో హోటల్స్ నిర్మాణం పేరుతో విలువైన భూముల దోపిడీకి అస్కారం ఉంటుందని అంటున్నారు.గతంలోనూ ఇంతే..2014–19 మధ్య కూడా రాష్ట్రంలో పలుచోట్ల దేవుడి భూములను అమ్మేందుకు అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇదే తరహా డైవర్షన్ రాజకీయాలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అప్పట్లో విజయనగరంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి నిధుల కోసం అంటూ విశాఖపట్నం చుట్టు పక్కల ఉన్న విలువైన దేవదాయ శాఖ భూముల అమ్మకానికి 2014లో అప్పటి టీడీపీ–బీజేపీ ప్రభుత్వం మాన్సాస్ ట్రస్టుకు ఆదేశాలిచ్చింది. రూ.వంద కోట్ల మేర భూములు కూడా విక్రయించింది. ఇంతా చేసినా, అప్పట్లో విజయనగరంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి కనీసం పత్రిపాదనలు కూడ సిద్ధం చేయలేదు. మరోవైపు.. ఉమ్మడి గుంటూరు జిల్లా అమరావతి మండల కేంద్రంలోని సదావర్తి సత్రం పేరిట తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని భూములను తక్కువ ధరకే కొందరు టీడీపీ నాయకులకు కట్టబెట్టే యత్నాలు చేసిన విషయం తెలిసిందే. అయితే, అప్పట్లో ఈ అంశంపై వైఎస్సార్సీపీ నాయకులు న్యాయ పోరాటం చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ భూములు రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కూడ కారణమయ్యాయి.దేవుడి బ్యాంకు డిపాజిట్లపై కన్నుకేవలం పట్టణ ప్రాంతాల్లోనే వివిధ ఆలయాలు, వివిధ రకాల దేవదాయ, ధర్మదాయ ధార్మిక సంస్థ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 1.55 కోట్ల చదరపు గజాల (3,203 ఎకరాల) భూములున్నాయి. అత్యధిక చోట్ల గజం భూమి విలువ రూ.20 వేలకు తక్కువ కాకుండా, కొన్ని చోట్ల లక్ష రూపాయల దాకా కూడా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి భూముల వినియోగంపై తగిన ప్రతిపాదనలు కోరడంతో పాటు.. వివిధ ఆలయాల పేరిట బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు, వాటి వడ్డీ రేట్ల వివరాలు సైతం సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని ఆలయాల డిపాజిట్ల వివరాలు కోరడం వెనుక కారణమేంటన్నది ప్రస్తుతం ఆ శాఖలో చర్చనీయాంశమైంది. ఇది కూడా చదవండి: శ్రీవారి లడ్డూపై వివాదం.. బాబు పక్కా స్కెచ్‌తోనే.. -
ఢిల్లీలో ప్రైవేట్హోటల్లో బాబు బస
-
న్యాయవాద వృత్తి మహోన్నతమైనది
తిరుపతి లీగల్, న్యూస్‌లైన్: న్యాయ వాద వృత్తి మహోన్నతమైనదని రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రినాయుడు అన్నారు. తిరుపతి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఓ ప్రైవేట్ హోటల్లో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తిరుపతి న్యాయవాదుల సం ఘం అధ్యక్షుడు పి.రమణ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ అభినందన సభలో జస్టిస్ దామా శేషాద్రి నాయుడు మాట్లాడుతూ కృషి, పట్టుదలతో యువ న్యాయవాదులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. జీవితంలో ఓ మనిషి ఓ వృత్తిని ఎంచుకుని దానిపైనే శ్రద్ధ పెడితే మహోన్నత స్థానాన్ని పొందవ చ్చని అన్నారు. తిరుపతి బార్ అసోసియేషన్ తనకు మాతృ సంస్థ అని దీనికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. తన ఉన్నతికి సహకరించిన సీనియర్ న్యాయవాదులను మరువలేనన్నారు. జిల్లా జడ్జి ఎల్. రవిబాబు మాట్లాడుతూ వ్యవసాయకుటుంబంలో జన్మించి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ శేషాద్రినాయుడుకు జిల్లా న్యాయమూర్తుల తరపున అభినందనలు తెలిపారు. జస్టిస్ శేషాద్రినాయుడుకు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలను, ఆయన వృత్తిలో ఎలా పైకి వచ్చారనే విషయాలను స్క్రీన్ పై చిత్రాల రూపంలో చూపించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఎం. దొరైరాజ్, చెన్నకేశవరెడ్డి, ఐ.గురుస్వామి, ముక్కు సత్యవంతుడు, కె.అజయ్‌కుమార్, ఎంఎన్. మణి, వజ్రాల చంద్రశేఖర్, మట్టా పురుషోత్తంరెడ్డి, టి. గోపీచంద్, నెల్లూరు యోగానంద్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. -
సమష్టి నిర్ణయంతోనే రాష్ట్రాధ్యక్షుడి ఎంపిక
సాక్షి, బెంగళూరు : పార్టీలో అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర జేడీఎస్ నూతన అధ్యక్షుడి ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ తెలిపారు. లోక్‌సభ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడి స్థానానికి కుమారస్వామి రాజీనామ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు భవిష్యత్ కార్యాచరణ విషయమై బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం సమావేశమయ్యారు. సమావేశం తర్వాత దేవెగౌడ మాట్లాడుతూ.. పార్టీ రాష్ట్రాధ్యక్ష స్థానం ఎవరికి ఇవ్వాలనే విషయమై సీనియర్ నాయకులు వారివారి అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నారు. గురువారం జరిగే జేడీఎస్ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అభిప్రాయాలనూ సేకరిస్తామని అన్నారు. అటుపై మరోసారి చర్చించి నూతన అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత మంగళవారం నూతన అధ్యక్షుడి పేరును ప్రకటిస్తామన్నారు. కాగా, ఓటమికి కుంగిపోయి, విజయానికి పొంగిపోయే మనస్థత్వం తనది కాదని, వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని దేవెగౌడ పేర్కొన్నారు. మల్లికార్జున రాజీనామా.. బీదర్ జిల్లా బసవకళ్యాణ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లికార్జున సిద్ధరామప్ప ఖుబా తన పదవికి, పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. తనకు ప్రతి పక్ష విప్ స్థానం ఇవ్వనందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు అతను ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడకు పంపినట్లు చెప్పారు. దీనిపై గౌడ మాట్లాడుతూ.. మల్లికార్జున రాజీనామా చేసిన మాట వాస్తమేనన్నారు. ఈ విషయమై తనతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, సొంత పార్టీలోని తన రాజకీయ శత్రువైన బండప్ప కాశంపురికి పార్టీ పెద్దలు రాష్ర్ట అధ్యక్షుడి స్థానాన్ని కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలియడంతో మల్లికార్జున రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించినట్లు సమాచారం. అందులో భాగంగానే తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు కాకుండా దేవెగౌడకు పంపినట్లు తెలుస్తోంది.