సాక్షి, బెంగళూరు : పార్టీలో అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర జేడీఎస్ నూతన అధ్యక్షుడి ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ తెలిపారు. లోక్‌సభ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడి స్థానానికి కుమారస్వామి రాజీనామ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు భవిష్యత్ కార్యాచరణ విషయమై బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్‌లో బుధవారం సమావేశమయ్యారు. సమావేశం తర్వాత దేవెగౌడ మాట్లాడుతూ..
పార్టీ రాష్ట్రాధ్యక్ష స్థానం ఎవరికి ఇవ్వాలనే విషయమై సీనియర్ నాయకులు వారివారి అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నారు. గురువారం జరిగే జేడీఎస్‌ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అభిప్రాయాలనూ సేకరిస్తామని అన్నారు. అటుపై మరోసారి చర్చించి నూతన అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత మంగళవారం నూతన అధ్యక్షుడి పేరును ప్రకటిస్తామన్నారు. కాగా, ఓటమికి కుంగిపోయి, విజయానికి పొంగిపోయే మనస్థత్వం తనది కాదని, వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని దేవెగౌడ పేర్కొన్నారు.
మల్లికార్జున రాజీనామా..
బీదర్ జిల్లా బసవకళ్యాణ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లికార్జున సిద్ధరామప్ప ఖుబా తన పదవికి, పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. తనకు ప్రతి పక్ష విప్ స్థానం ఇవ్వనందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు అతను ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడకు పంపినట్లు చెప్పారు. దీనిపై గౌడ మాట్లాడుతూ.. మల్లికార్జున రాజీనామా చేసిన మాట వాస్తమేనన్నారు. ఈ విషయమై తనతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, సొంత పార్టీలోని తన రాజకీయ శత్రువైన బండప్ప కాశంపురికి పార్టీ పెద్దలు రాష్ర్ట అధ్యక్షుడి స్థానాన్ని కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలియడంతో మల్లికార్జున రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించినట్లు సమాచారం. అందులో భాగంగానే తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు కాకుండా దేవెగౌడకు పంపినట్లు తెలుస్తోంది.
సమష్టి నిర్ణయంతోనే రాష్ట్రాధ్యక్షుడి ఎంపిక
Published Thu, Aug 29 2013 3:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
Advertisement