devegauda
-
లోక్‌సభ ఎన్నికలకు జేడీఎస్ రెడీ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్రంలోని యూపీఏ సర్కారు వరుస కుంభకోణాలు, రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని జేడీఎస్ నిర్ణయించింది. బెంగళూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన పార్టీ జాతీయ కార్య వర్గ సమావేశాలు శుక్రవారం ముగిశాయి. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను సమాన దూరంలో పెట్టాలని నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటితో పొత్తు పెట్టుకోరాదని తీర్మానించారు. బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ నియోజక వర్గాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్న దుష్ర్పచారం వల్లే ఓటమిని చవి చూడాల్సి వచ్చిందని సమావేశం వాపోయింది. కనుక వచ్చే ఎన్నికల్లో ఇరు జాతీయ పార్టీలను సమాన దూరంలో ఉంచడంతో పాటు వామపక్షాలతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. మొత్తం 28 లోక్‌సభ నియోజక వర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి వచ్చే నెల నుంచే నాయకులందరూ రాష్ర్ట పర్యటన చేపట్టాలని తీర్మానించింది. అభ్యర్థుల ఎంపిక అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు హెచ్డీ. దేవెగౌడకు అప్పగించింది. గత శాసన సభ ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓడిన నియోజక వర్గాలను గుర్తించి, అక్కడ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలను చేపట్టాలని తీర్మానించింది. సమావేశంలో కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి సహా వివిధ రాష్ట్రాల పదాధికారులతో పాటు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఏ. కృష్ణప్ప, ప్రతిపక్ష నాయకుడు హెచ్డీ. కుమారస్వామి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్య వర్గ సభ్యులు పాల్గొన్నారు. -
‘మేడం’ రావడం ఎవరికి ప్రయోజనం
సాక్షి, బెంగళూరు : శాసనసభ ఎన్నికలు, లోక్‌సభ, శాసనమండలి ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మండ్యకు రావడం ఎవరికి ప్రయోజనం చేకూరిందని మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ ప్రశ్నించారు. అక్కడి చెరకు, వరి రైతులకు సంతోషం చేకూర్చే కొన్ని నిర్ణయాలు వెల్లడిస్తుందన్న తనతో పాటు ప్రజల ఆశగా ఎదురు చూశారన్నారు. అయితే ఆ పంటలకు ఎటువంటి మద్దతు ధర పెంపుపై హామీలు ఇవ్వక పోవడం వల్ల స్థానిక రైతుల ఆశలు అడియాశలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరులో దేవెగౌడ మీడియాతో గురువారం మాట్లాడారు. ‘ఎన్నికల్లో పార్టీని గెలిపించినందుకు మండ్య ప్రజలకు లడ్డూలు పంచడం బాగానే ఉన్నా ఆ లడ్డూ తీపి తాత్కాలికం. అక్కడి ప్రజలకు శాశ్వత తీపి (సంతోషం) చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. వుుఖ్యంగా చెరుకు, వరికి మద్దతు ధర పెంపుపై తగిన హామీలు ఇచ్చి ఉంటే బాగుండేది. అయినా కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక సంతోషం కలిగించి ఆ మేరకు రాజకీయ ప్రయోజనం పొందడం అలవాటే కదా?’ అని దేవెగౌడ విమర్శనాస్త్రాలు సంధించారు. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత తృతీయ ఫ్రంట్ అధికారంలోకి రావడం అంతే నిజమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోని కాంగ్రెస్, బీజేపీ నేతృత్వంలోని రాజకీయ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదని దేవెగౌడ జోస్యం చెప్పారు. కళంకిత రాజకీయనాయకులకు మేలు చేకూర్చేలా యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన ‘ఆర్డినెన్స్’ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడాన్ని ఆయన సమర్థించారు. ఇది తమ పోరాట ఫలితమేనని బీజేపీతో పాటు కాంగ్రెస్ నాయకులు భుజాలు చరచుకోవడం మాత్రం సరికాదన్నారు. దేశంలోని కొన్ని కార్పోరేట్ కంపెనీలు, మీడియా సంస్థలు మాత్రం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర ‘మోడి’ జపాన్ని చేస్తున్నాయని, ఆయనకు ప్రధాని అయ్యే అర్హత లేదని దేవెగౌడ అభిప్రాయపడ్డారు. -
సమష్టి నిర్ణయంతోనే రాష్ట్రాధ్యక్షుడి ఎంపిక
సాక్షి, బెంగళూరు : పార్టీలో అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర జేడీఎస్ నూతన అధ్యక్షుడి ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ తెలిపారు. లోక్‌సభ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడి స్థానానికి కుమారస్వామి రాజీనామ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు భవిష్యత్ కార్యాచరణ విషయమై బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం సమావేశమయ్యారు. సమావేశం తర్వాత దేవెగౌడ మాట్లాడుతూ.. పార్టీ రాష్ట్రాధ్యక్ష స్థానం ఎవరికి ఇవ్వాలనే విషయమై సీనియర్ నాయకులు వారివారి అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నారు. గురువారం జరిగే జేడీఎస్ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అభిప్రాయాలనూ సేకరిస్తామని అన్నారు. అటుపై మరోసారి చర్చించి నూతన అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత మంగళవారం నూతన అధ్యక్షుడి పేరును ప్రకటిస్తామన్నారు. కాగా, ఓటమికి కుంగిపోయి, విజయానికి పొంగిపోయే మనస్థత్వం తనది కాదని, వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని దేవెగౌడ పేర్కొన్నారు. మల్లికార్జున రాజీనామా.. బీదర్ జిల్లా బసవకళ్యాణ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లికార్జున సిద్ధరామప్ప ఖుబా తన పదవికి, పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. తనకు ప్రతి పక్ష విప్ స్థానం ఇవ్వనందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు అతను ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడకు పంపినట్లు చెప్పారు. దీనిపై గౌడ మాట్లాడుతూ.. మల్లికార్జున రాజీనామా చేసిన మాట వాస్తమేనన్నారు. ఈ విషయమై తనతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, సొంత పార్టీలోని తన రాజకీయ శత్రువైన బండప్ప కాశంపురికి పార్టీ పెద్దలు రాష్ర్ట అధ్యక్షుడి స్థానాన్ని కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలియడంతో మల్లికార్జున రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించినట్లు సమాచారం. అందులో భాగంగానే తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు కాకుండా దేవెగౌడకు పంపినట్లు తెలుస్తోంది.