సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్రంలోని యూపీఏ సర్కారు వరుస కుంభకోణాలు, రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని జేడీఎస్ నిర్ణయించింది. బెంగళూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన పార్టీ జాతీయ కార్య వర్గ సమావేశాలు శుక్రవారం ముగిశాయి. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను సమాన దూరంలో పెట్టాలని నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటితో పొత్తు పెట్టుకోరాదని తీర్మానించారు.
బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ నియోజక వర్గాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్న దుష్ర్పచారం వల్లే ఓటమిని చవి చూడాల్సి వచ్చిందని సమావేశం వాపోయింది. కనుక వచ్చే ఎన్నికల్లో ఇరు జాతీయ పార్టీలను సమాన దూరంలో ఉంచడంతో పాటు వామపక్షాలతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. మొత్తం 28 లోక్‌సభ నియోజక వర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి వచ్చే నెల నుంచే నాయకులందరూ రాష్ర్ట పర్యటన చేపట్టాలని తీర్మానించింది.
అభ్యర్థుల ఎంపిక అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు హెచ్‌డీ. దేవెగౌడకు అప్పగించింది. గత శాసన సభ ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓడిన నియోజక వర్గాలను గుర్తించి, అక్కడ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలను చేపట్టాలని తీర్మానించింది. సమావేశంలో కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి సహా వివిధ రాష్ట్రాల పదాధికారులతో పాటు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఏ. కృష్ణప్ప, ప్రతిపక్ష నాయకుడు హెచ్‌డీ. కుమారస్వామి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్య వర్గ సభ్యులు పాల్గొన్నారు.
లోక్‌సభ ఎన్నికలకు జేడీఎస్ రెడీ
Published Sat, Oct 26 2013 3:24 AM | Last Updated on Sat, Sep 15 2018 3:51 PM
Advertisement