సాక్షి, బెంగళూరు : శాసనసభ ఎన్నికలు, లోక్‌సభ, శాసనమండలి ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మండ్యకు రావడం ఎవరికి ప్రయోజనం చేకూరిందని మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ ప్రశ్నించారు. అక్కడి చెరకు, వరి రైతులకు సంతోషం చేకూర్చే కొన్ని నిర్ణయాలు వెల్లడిస్తుందన్న తనతో పాటు ప్రజల ఆశగా ఎదురు చూశారన్నారు. అయితే ఆ పంటలకు ఎటువంటి మద్దతు ధర పెంపుపై హామీలు ఇవ్వక పోవడం వల్ల స్థానిక రైతుల ఆశలు అడియాశలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బెంగళూరులో దేవెగౌడ మీడియాతో గురువారం మాట్లాడారు. ‘ఎన్నికల్లో పార్టీని గెలిపించినందుకు మండ్య ప్రజలకు లడ్డూలు పంచడం బాగానే ఉన్నా ఆ లడ్డూ తీపి తాత్కాలికం. అక్కడి ప్రజలకు శాశ్వత తీపి (సంతోషం) చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. వుుఖ్యంగా చెరుకు, వరికి మద్దతు ధర పెంపుపై తగిన హామీలు ఇచ్చి ఉంటే బాగుండేది. అయినా కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక సంతోషం కలిగించి ఆ మేరకు రాజకీయ ప్రయోజనం పొందడం అలవాటే కదా?’ అని దేవెగౌడ విమర్శనాస్త్రాలు సంధించారు.
సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత తృతీయ ఫ్రంట్ అధికారంలోకి రావడం అంతే నిజమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోని కాంగ్రెస్, బీజేపీ నేతృత్వంలోని రాజకీయ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదని దేవెగౌడ జోస్యం చెప్పారు. కళంకిత రాజకీయనాయకులకు మేలు చేకూర్చేలా యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన ‘ఆర్డినెన్స్’ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడాన్ని ఆయన సమర్థించారు.
ఇది తమ పోరాట ఫలితమేనని బీజేపీతో పాటు కాంగ్రెస్ నాయకులు భుజాలు చరచుకోవడం మాత్రం సరికాదన్నారు. దేశంలోని కొన్ని కార్పోరేట్ కంపెనీలు, మీడియా సంస్థలు మాత్రం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర ‘మోడి’ జపాన్ని చేస్తున్నాయని, ఆయనకు ప్రధాని అయ్యే అర్హత లేదని దేవెగౌడ అభిప్రాయపడ్డారు.
‘మేడం’ రావడం ఎవరికి ప్రయోజనం
Published Fri, Oct 4 2013 3:10 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement