
న్యూఢిల్లీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఇటీవలే సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టిన హేమంత్ తన భార్య కల్పనతో పాటు 10, జనపథ్ నివాసంలో సోనియాను కలుసుకున్నారు. ఇది కేవలం మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశమని అనంతరం మీడియాకు చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత సోనియా గాంధీతో సమావేశమవలేదని, జైలు నుంచి విడుదలైనందున ఆమెతో మాట్లాడేందుకు వచ్చినట్లు వివరించారు. మరికొద్ది నెలల్లో జరగాల్సిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారా అని అడగ్గా..రాజకీయాలు ప్రస్తావనకు రాలేదని స్పష్టం చేశారు. భూకుంభకోణం మనీలాండరింగ్ కేసులో జనవరి 31వ తేదీన అరెస్టయిన హేమంత్ అంతకు కొద్ది గంటల ముందే సీఎం పదవికి రాజీనామా చేశారు. జైలులో 5 నెలలపాటు ఉన్న ఆయన బెయిల్ రావడంతో జూలై 4న విడుదలయ్యారు. అనంతరం మరోసారి సీఎం పదవి చేపట్టడం తెల్సిందే.