సోనియా గాంధీ
ఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా మళ్లీ ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి నుంచి సోనియా లోక్సభకు ఎన్నికయిన విషయం తెలిసిందే. లోక్సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ఘోరపరాజయం చవిచూసిన అనంతరం ఈరోజు తొలిసారి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అతితక్కువగా 44 లోక్సభ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. లోక్సభలో ప్రతిపక్షం హోదా కూడా ఈ పార్టీకి దక్కలేదు. ప్రతిపక్షం హోదాపై లోక్సభ స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది.
వాస్తవానికి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో లోక్సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నాయకులను ఎన్నుకోవలసి ఉంది. అయితే ప్రతిపక్ష నాయకులను ఎంపిక చేసే అధికారం సోనియా గాంధీకే అప్పగించారు. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కమల్‌నాథ్‌ను లోక్‌సభ కాంగ్రెస్ నేతగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభకు ఏకే ఆంటోనీ, గులాం నబీఆజాద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సమావేశంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్తో పాటు కాంగ్రెస్ ఎంపీలందరూ హాజరయ్యారు.
అనంతరం సోనియా గాంధీ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా తన వంతు కర్తవ్యం నిర్వహిస్తానని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సోనియా శుభాకాంక్షలు తెలిపారు.