ప్రతీకాత్మక చిత్రం
రోజుకు 24 కంటే ఎక్కువ గంటలుంటే బాగుండేదని మీకెప్పుడైనా అనిపించిందా? మీ ఆశ ఇప్పుడు కాకపోయినా ఇంకో రెండు వేల ఏళ్లకైనా నిజం కానుంది! అదేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే అంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి నుంచి జాబిల్లి నెమ్మదిగా దూరం జరగడం దీనికి కారణమవుతోందని.. భవిష్యత్తులో రోజుకు 25 గంటలు ఉంటాయన్నది వీరి అంచనా.
కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ విస్‌కాన్సిస్–మాడిసన్ పరిశోధకులు దాదాపు తొమ్మిది కోట్ల ఏళ్ల క్రితం నాటి రాళ్లను పరిశీలించినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. పురాతన కాలంలో... కచ్చితంగా చెప్పాలంటే 140 కోట్ల ఏళ్ల క్రితం రోజుకు సగటున 18 గంటలు, గంటకు 41 నిముషాలు మాత్రమే ఉండేవని తెలిసింది..
భూమండలం కక్ష్య నుంచి చందమామ నెమ్మదిగా పక్కకు జరుగుతున్న కొద్దీ రోజులో గంటలు పెరుగుతున్నాయని తేల్చారు. ఈ విధంగా చంద్రుడు దూరం జరుగుతున్న కొద్ది భూభ్రమణం కూడా నెమ్మదిస్తుందని విస్‌కాన్సిన్–మాడిసన్ విశ్వవిద్యాలయ జియోసైన్స్ ప్రొఫెసర్ స్టీఫెన్ మేయర్స్ వెల్లడించారు.
భూమి నుంచి చందమామ ఏడాదికి 3.82 సెంటీ మీటర్ల చొప్పున దూరం జరుగుతున్నట్టు అంచనా. జాబిల్లితోపాటు అనేక ఇతర గ్రహాలు, నక్షత్రాల గురుత్వాకర్షణ శక్తి ప్రభావం భూమిపై ఉంటుందని.. ఇది కాస్తా భూభ్రమణ వేగాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. సౌరవ్యవస్థలో వచ్చే మార్పుచేర్పులకు అనుగుణంగా రోజులో పగటి వేళల్లో మార్పులు సంభవిస్తున్నాయి.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment