అంతర్జాతీయ యవనికపై మన జాతీయ పతాకం సమున్నతంగా రెపరెపలాడిన దృశ్యం. భరతమాత ముద్దుబిడ్డల హృదయాలు ఎందుకు ఉప్పొంగవు? ఆబాల గోపాలం ఆనంద తరంగిణిలో ఎందుకు ఓలలాడదు? ఉరుము ఉరిమితేనే, మెరుపు మెరిస్తేనే, ఆకసాన హరివిల్లు విరిస్తేనే బాల్యం మురిసి పోతుందట! అవన్నీ తనకోసమేనని గంతులేస్తుందట! ఊహలు ఊరడం మొదలైన తొలిరోజు నుంచీ బాల్యానికి కథలు చెప్పే పుస్తకం చందమామ.
కలలకు రెక్కలు తొడిగే నేస్తం చంద మామ. అలాంటి చందమామ మన చేతికందిన దృశ్యం పిల్లల్ని పరవశింపజేయకుండా ఉంటుందా? ఆ పారవశ్యం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనిపించింది. పిల్లలకూ, పెద్దలకూ ఎన్నెన్నో సైన్స్ పాఠాలను నేర్పింది. ఓ పిడికెడు మందికి కామర్స్ పాఠాలు, బిజినెస్ పాఠాలు కూడా నేర్పి ఉండవచ్చు. అయినా ఆ శుభదినాన్ని (ఆగస్టు 23) ‘జాతీయ స్పేస్ డే’గానే ప్రధాని ప్రకటించారు.
చంద్రగోళాన్ని క్షేమంగా తాకిన నాలుగు దేశాల్లో ఇప్పుడు భారత్ ఒకటి. అంటే అంతరిక్ష విజ్ఞానంలో తొలి నాలుగు స్థానాల్లో మనకు చోటు దక్కింది. అందులో క్లిష్టమైన దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని ఎంచుకొని దిగిన తొలి దేశంగా మన దేశం రికార్డులకెక్కింది. ఘన రూపంలో అపార జల నిక్షేపాలు, ఖనిజ సంపద ఈ ప్రాంతంలో ఉన్నాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భూగోళం పుట్టిన తొలిరోజుల్లో అంగారకుడి పరిమాణంలో ఉండే పదార్థం ఒకటి దాన్ని ఢీకొట్టిందట! ఫలి తంగా కొన్ని భూశకలాలు భూమి నుంచి వేరుపడి ఆ తర్వాత ఒకచోటకు చేరి చందమామగా ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బహుశా అందుకే భూమాతకు తోబుట్టువుగా భావించి మనం మేన మామగా పిలుచుకుంటున్నామేమో! ఇక్కడ జరిగే పరిశోధనల ఫలితంగా తొలిరోజుల నాటి భూగర్భ రహస్యాలపై అధ్యయనం చేయవచ్చు. ప్రాథమికంగా భూభౌతిక పదార్థమే గనుక, నీళ్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు కనుక మానవ ఆవాస యోగ్యమైన పరిస్థితులు సృష్టించడం కష్టం కాదనే భావన ఏర్పడింది.
దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగడం సవాళ్లతో కూడుకున్నది కనుకనే గతంలో అమెరికా, రష్యా, చైనా దేశాలు ఈక్వెటార్ ప్రాంతంలోనే దిగాయి. అంతరిక్ష రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న రష్యా మన చంద్రయాన్–3 కంటే రెండు రోజుల ముందు ఇక్కడ దిగడానికి విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ కూడా ఇటువంటి ప్రయత్నంలో విఫలమైంది. నాలుగేళ్ల కింద మన చంద్రయాన్–2 ప్రయత్నం చివరి క్షణాల్లో విఫలం కావడం ఈ విజయానికి గుణపాఠంగా ఉపయోగప
డింది.
ఇక దక్షిణ ధ్రువంపై కాలూనడానికి ప్రపంచంలోని మిగిలిన అంతరిక్ష సంస్థలు కూడా పోటీపడతాయి. 2025లో ఆర్టెమిస్ అనే వ్యోమనౌకను అమెరికా ప్రయోగించబోతున్నది. ఇద్దరు మనుషుల్ని కూడా ఈ ప్రయోగం ద్వారా అమెరికా దించబోతున్నది. వారు ఒకటి రెండు వారాలపాటు అక్కడ గడుపుతారు. తాత్కాలిక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేయ బోతున్నారు. పోర్చుగీసు నావికుడైన వాస్కోడాగామా ఐరోపా నుంచి భారత్‌కు సముద్ర మార్గాన్ని కనుగొన్నాడని మనకు తెలుసు.
ఫలితంగా పోర్చుగీసు వారు అప్పటికి సుసంపన్న దేశంగా ఉన్న భారత్ నుంచి సుగంధ ద్రవ్యాలను కారుచౌకగా తరలించుకొని వెళ్లి వ్యాపారాల్లో బాగా లాభపడ్డారు. కామ ధేనువు లాంటి ఇండియాకు మార్గం తెలిసింది కనుక ఐరోపాలో అంతకంటే బలవంతుడైన బ్రిటిష్‌వాడు ప్రవేశించాడు. పోర్చు గీసు వారిని తరిమేసి కామధేనువు మూలుగల్ని పీల్చిపారేశాడు. తాజా కథ కూడా దాదాపు ఇలాంటిదే కావచ్చేమో!
అంతరిక్ష విజ్ఞానం శాస్త్ర జిజ్ఞాస దశను దాటి వాణిజ్య దశలోకి ప్రవేశించింది. అంతరిక్ష ప్రయోగాలు చేయగలిగే దేశాలకు ఇప్పుడు చేతినిండా ‘ఆర్డర్లు’. కమ్యూనికేషన్లు తదితర అవసరాల కోసం అన్ని దేశాలూ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించుకోవాలి. కొన్ని ప్రైవేట్ సంస్థలకు కూడా అటువంటి అవసరాలున్నాయి. ఇవి ఒన్‌టైమ్ ఆర్డర్లు మాత్రమే కాదు,నిరంతరం ఉండేవి. అంతరిక్ష ప్రయోగాల నైపుణ్యం ఉన్న దేశాలు కొన్ని మాత్రమే ఉన్నాయి.
అందులో చౌకగా పనిచేసి పెట్టే దేశం భారత్. ఫలితంగా భారత అంతరిక్ష మార్కెట్ రూ.70 వేల కోట్లకు చేరుకున్నది. ఇంకో పదిహేనేళ్లలో ఈ మార్కెట్ మూడున్నర లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఇప్పుడు చంద్రయాన్–3 విజయంతో భారతదేశ సామర్థ్యం పట్ల నమ్మకం పెరిగింది. అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను ప్రయోగించగలిగే దేశం భారత్ మాత్రమే!
భారత ఆధునిక అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ ఇస్రోలో మొదటి నుంచి పొదుపును ఒక అలవాటుగా తీర్చిదిద్దారని చెబుతారు. అందుబాటులో ఉన్న వనరులను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడంతోపాటు, పూర్తి స్వదేశీ పరికరాలనే ఇస్రో ఉపయోగిస్తున్నది. ప్రపంచంలోని మిగిలిన స్పేస్ సెంటర్లలో పనిచేసే వారితో పోలిస్తే మన ఇస్రో సిబ్బంది జీతాలు చాలా తక్కువ. మన దేశంలో ఐటీ ఉద్యోగులతో పోల్చినా కూడా బాగా తక్కువే.
ప్రయోగం విజయవంతమైన సమయంలో టీవీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వారిని దేశ ప్రజలందరూ గమనించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబీకుల్లాగానే వారి ఆహార్యం కనిపించింది. జీతాల్లో, జీవితాల్లోనే వారు మధ్య తరగతి. విజ్ఞానంలో, అంకితభావంలో, దేశభక్తిలో వారు అత్యున్నత తరగతికి చెందినవారని పదేపదే నిరూపితమవుతూ వస్తున్నది. రాంచీలో ఉన్న హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ (హెచ్‌ఈసీ) వాళ్లు చంద్రయాన్ కోసం రాకెట్ లాంచ్ ప్యాడ్‌ను తయారుచేసి ఇచ్చారు. ఇది కూడా ప్రభుత్వరంగ సంస్థే.
బహుశా ప్రైవేటీకరణ లిస్టులో ఉందేమో! ఇక్కడ ఇంజనీర్లకూ, ఉద్యోగులకూ 17 నెలలుగా జీతాలు లేవు. అయినా సరే దేశంకోసం చేసే పనిని దైవకార్యంగా భావించి ఉద్యోగులు జీతాలపై పట్టుబట్టకుండా ఇచ్చిన కాంట్రాక్టును గడువు లోపల పూర్తిచేసి పెట్టారు. సాధారణ ఉద్యోగులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తల త్యాగం పెట్టుబడిగా ఇప్పుడు భారత్ లక్షలకోట్ల మార్కెట్‌కు వల వేసింది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు ఇప్పుడు భారత అంతరిక్ష మార్కెట్ విధానం. ‘ఆదిపురుష్’ సినిమా కంటే తక్కువ ఖర్చుతో చంద్రయాన్–3 అనేది నినాదం!
లక్షల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే కొత్త మార్కెట్ ఇది. న్యూ ఎకానమీ. కొత్త ఆర్థిక రంగానికి ద్వారాలు తెరిచినప్పుడు పరమ పవిత్రమైన పెట్టుబడిదారీ వ్యవస్థ సంప్రదాయాల ప్రకారం ముందుగా ప్రైవేట్ రంగం కుడికాలు మోపి లోపలికి ప్రవేశించాలి. అందుకు అనుగుణంగా మన అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. సాంకేతిక నైపుణ్య అభివృద్ధికీ, పరిశోధనలకూ ఇస్రోను పరిమితం చేస్తారు కాబోలు! ఉపగ్రహాలు ప్రయోగించడం, ముందుముందు అంతరిక్ష, చంద్రగ్రహ టూరిజం అభివృద్ధి చెందితే వ్యోమ నౌకలను ప్రైవేట్ ట్రావెల్స్ పేరుతో నడపడం వంటివన్నీ ప్రైవేట్ చేతికి వెళ్తాయి.
ఆవు శిరస్సు భాగం ప్రభుత్వ నిర్వహణలో ఉంటుంది. దానికి గడ్డి వేయాల్సిన బాధ్యత ప్రభు త్వానిది. పొదుగు భాగం ప్రైవేట్‌కు వెళ్తుంది. పాలు పిండుకునే కర్తవ్యం వారిది. ముందుముందు ఈ రంగంలో భారీ పెట్టుబడుల అవసరం ఉంటుంది కనుక ప్రైవేట్‌రంగం ప్రవేశించక తప్పదని ప్రభుత్వం వాదన. ఇందుకు వారు ‘నాసా’ను మార్గ దర్శిగా ఎంచుకున్నారు.
భూగర్భంలోని ఖనిజాలు, చమురు–వాయువులు, భూమ్మీద కొండలు గుట్టలు, అడవులు, ఆకాశయానాలతో సహా అన్నిటా ఇప్పటికే ప్రైవేటు రంగం ప్రవేశించింది. స్పేస్ టెక్నాలజీ సృష్టించిన న్యూ ఎకానమీని కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించాలా? మౌలిక రంగాల్లో , సంక్షేమ రంగాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నది కదా! దీనికి డబ్బెక్కడి నుంచి రావాలి? మనం కట్టే పన్నులేనా? సాధారణ ప్రజలు పన్నులు కట్టాలి... బడాబాబులు బ్యాంకులు లూటీ చేయాలా? ఇదెక్కడి న్యాయం? ఇటువంటి సందేహాలు సగటు కుటుంబరావులకు సహజంగా కలుగుతుంటాయి.
వారికి ఆర్థిక సూత్రాలు, వాటి లోతుపాతులు అర్థంకావు. అర్థం కాదు కాబట్టే దాన్ని ఆర్థిక శాస్త్రం అన్నారు. ప్రభుత్వాలకూ, పెట్టుబడులకూ సరిగ్గా అర్థమవుతాయి. లాభాలు ఏ రంగంలో వచ్చినా సరే దేశ జీడీపీ పెరుగుతుంది. అది పెరుగుతున్నకొద్దీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తలసరి ఆదాయాలు పెరుగుతాయి, తలసరి విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఇటువంటి లెక్క లేవో చెబుతారు.
కార్మికులు, ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, శ్రామికులు, కష్టాలు, కన్నీళ్లు, దోపిడీ, పీడన, బ్యాంకుల లూటీ, ఎర్రజెండాలు, ధర్నా చౌకులు... వగైరా పదజాలాన్ని కాస్సేపు పక్కనబెడదాం. చంద్రయాన్–3 ప్రయోగ విజయం న్యూ ఎకానమీ వృద్ధికి తోడ్పడు తుందనేది నిర్వివాదాంశం. ఈ విజయం ఆర్థిక రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. జీ–20 అధ్యక్ష హోదాలో ఉన్న సమయంలోనే వచ్చిన అవకాశం. దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తుంది. ఆర్థికరంగం, శాస్త్ర విజ్ఞాన రంగం, రక్షణ పాటవం... ఈ మూడు రంగాల్లో ఏ దేశం ఆధిపత్యం వహిస్తుందో అదే అగ్రరాజ్యం.
ఈ మూడు రంగాల్లో కూడా ఇంచుమించు టాప్–5 లోకి భారత్ ప్రవేశించిన సూచనలు కనిపిస్తున్నాయి. మరో మూడు నాలుగేళ్లలో టాప్ త్రీలోకి చేరుతామని ప్రధాని చెబుతున్నారు. అందుకు చంద్రయాన్ విజయం లాంటివి ఉపకరి స్తాయి. అందుకే కాబోలు ఈ ప్రయోగం మీద ప్రధాని ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ‘బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొంటున్నప్పటికీ నా మనసంతా ఇక్కడే ఉంద’ని ఇస్రో శ్రేణులతో సంతోషాన్ని పంచుకున్నారు. ఇండియాకు వచ్చిన తర్వాత స్వయంగా ఇస్రో కేంద్రానికి వెళ్లి సిబ్బందిని అభినందించారు. ల్యాండర్ దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’గా నామకరణం చేశారు.
ప్రయోగాల ముందు పూజలు, దేవుళ్ల పేరుతో నామ కరణాలు వగైరాల పట్ల అభ్యంతరం చెబుతున్నవారు కూడా తక్కువేమీ కాదు. మూఢ నమ్మకాలు సైన్స్ పురోగతికి ప్రతిబంధకాలే. కానీ మూఢ నమ్మకాలు వేరు, విశ్వాసాలు వేరు. ఈ సృష్టికి కారణమేమిటి? అనే ప్రశ్నకు సైన్స్ ఇప్పటికీ సంతృప్తికరమైన సమాధానాన్ని ఇవ్వలేదు. సైన్స్ ఆ సమాధానం చెప్పనంతవరకూ ఎవరి విశ్వాసం వారికుంటుంది. ఆ విశ్వాసాల మేరకు ప్రార్థనలూ, పూజలూ ఉంటాయి. కాకపోతే రాజ్యాంగబద్ధంగా మనది సెక్యులర్ దేశం కనుక ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎటువంటి పూజా విధానాలను అనుసరించాలి అనే అంశంపై ఆమోదయోగ్యమైన మార్గదర్శకాలు అవసరం.
అంతరిక్షంతోపాటు సమస్త విజ్ఞానమంతా వేదాల్లోనే ఉన్నదని హిందూ చరిత్రకారులు ఢంకా భజాయిస్తారు. ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయట’ అంటూ వారిని కొందరు వేళాకోళం చేస్తుంటారు. వేళాకోళం చేయవలసిన అవసరమయితే కనిపించడం లేదు. రుగ్వేద కాలం నాటికే మనకు అంతరిక్ష పరిజ్ఞానం ఉన్నది. ఈ విశ్వం అనంతమైనదని, ఎక్కడ మొదలైందో, ఎక్కడ అంత మవుతుందో తెలియదని ఖగోళ శాస్త్రం చెబుతున్నది. ఆది మధ్యాంత రహితమని వేదం కూడా చెప్పింది. విశ్వం ఆవిర్భవించడానికి కారణంగా బిగ్‌బ్యాంగ్ థియరీని శాస్త్రవేత్తలు ప్రతి పాదించారు.
ఇది ఇరవయ్యో శతాబ్దం ప్రథమార్ధం నాటి సంగతి. అంతకంటే సుమారు నాలుగు వేల ఏళ్లకు పూర్వం రుగ్వేదంలోని నాసదీయ సూక్తం కూడా దాదాపు ఇదే ప్రతి పాదన చేసింది. ‘హిరణ్యగర్భం’లో సంభవించిన బ్రహ్మాండ విస్ఫోటనం వల్ల నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఈ సూక్తం చెబుతున్నది. రుగ్వేద కాలం నాటికి అంతరిక్ష పరిజ్ఞానం ఉన్నదనే మాట కేవలం హిందూ చరిత్రకారులు మాత్రమే చెప్పడం లేదు. హేతువాది, బౌద్ధ మతావలంబి, కమ్యూనిస్టు ఆలోచనాపరుడైన మహాపండితుడు రాహుల్ సాంకృత్యాయన్ కూడా తన ‘రుగ్వేద ఆర్యులు’ పుస్తకంలో ఈ సంగతి నిర్ధారించారు.
విశ్వం మీద ప్రసిద్ధ రచనలు చేసిన కార్ల్ సేగన్ అభిప్రాయం ప్రకారం ఆధ్యాత్మికతకూ, సైన్స్‌కూ వైరుద్ధ్యం లేదు. పైగా ఆధ్యాత్మిక ఆలోచనలకు సైన్స్ గొప్ప ప్రేరణ కూడా! మనకు దృగ్గోచరమైన జగత్తులో సూర్యుడు ప్రసరించే కోటానుకోట్ల కిరణాల్లో ఒక కిరణం వెదజల్లే అనంతకోటి ధూళి రేణువుల్లో ఒకదాన్ని చూడండి. అదే మన ఇల్లు. అక్కడే మన చరిత్ర. మన సంస్కృతి.
అక్కడే రాజులూ–రాజ్యాలు, నాగరికత నిర్మాతలు – విధ్వంసకులు, ప్రేమలు – పగలు, తల్లీదండ్రీ, ఆనందాలు – ఉద్వేగాలు, కష్టాలు–కన్నీళ్లు, మతాలు–ప్రార్థ నలు, నీతులు చెప్పే పంతుళ్లు – అవినీతి గోతులు తీసే నాయకులు, సూపర్ స్టార్లు – సుప్రీమ్ లీడర్లు, సాధువులు – పాపులు... అన్నీ.. అందరూ అక్కడే ఆ ధూళి రేణువుపైనే అంటాడు. సూర్యకాంతిలోని ఓ ధూళి రేణువంత భూగోళంలో ఉన్న మనం ఈ అనంత విశ్వాసాన్ని ఎప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి!
మహా అయితే ఇంకో వందేళ్లకో, రెండొందల ఏళ్లకో మనం ఈ భూమిని ఖాళీ చేయవలసిందే! ఆ తర్వాత ఇంకెంతమాత్రం భూగోళం ఆవాసయోగ్యం కాదని స్టీఫెన్ హాకింగ్ చేసిన హెచ్చరిక పదేపదే చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. అంతగా ధ్వంసం చేశారు భూదేవిని! ‘సముద్రవసనే దేవీ, పర్వతస్తన మండలే, విష్ణుపత్నీ నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే’ అని పూజించిన భూమిని కొందరు స్వార్థం కోసం పీల్చి పిప్పిచేశారు. దురాశతో, కక్కుర్తితో, కండూతితో నిస్సారంగా మార్చారు.
అందువల్ల మరో గ్రహాన్వేషణ తప్పదట! మరో గ్రహంలో తలదాచుకోకపోతే మానవజాతి అంతరించిపోక తప్పదట. అదిగో అందుకోసం కూడా ఈ చంద్రయానం తప్పనిసరి. ఇది మొదటి అడుగు.
చందమామపై నివాసంతోపాటు దాన్ని అంతరిక్ష గేట్‌వేగా ఉపయోగించుకొని అంగారక గ్రహానికి (మార్స్) వలస పోవాలని ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి. ఈ ‘స్పేసి’ నేని ట్రావెల్స్ ప్రభుత్వరంగంలో కాక ప్రైవేట్‌రంగంలో ఉండబోతున్నది కనుక ప్రయాణం చేయగలిగినవాడు కోటీశ్వరుడై ఉండాలి. యుగాంతంపై తీసిన ‘2012’ సినిమా గుర్తుకొస్తున్నది. సౌరతాపం వల్ల భూకేంద్రకం వేడెక్కి సము ద్రాలు ఉప్పొంగుతాయని హెచ్చరికలు వస్తాయి.
కొన్ని దేశాలు కలిసి బలిష్ఠమైన పడవల్లాంటి ఆశ్రయాలను హిమాలయాలపై నెలకొల్పుతాయి. వీటిలో 40 లక్షల మందే పడతారు. వారంతా ఖరీదైన టిక్కెట్లు కొనుక్కొని ప్రాణాలు కాపాడుకుంటారు. మిగిలిన 700 కోట్ల జనాభా మునిగిపోతుంది. ‘టైటానిక్’ సినిమా కూడా అంతే కదా! పడవ మునగబోతున్నది, లైఫ్ బోట్లలో 700 మందే పడతారు. పెద్దటిక్కెట్లు కొన్నవారిని క్షేమంగా లైఫ్ బోట్లలో తరలిస్తారు. పేద టిక్కెట్ల బ్యాచ్ 1,500 మంది జలసమాధి అవుతారు.
భూ విధ్వంసానికి ఎవరైతే కారకులయ్యాలో వారే స్పేస్ ట్రావెల్స్ టిక్కెట్లు కొనుక్కొని బతికి బయటపడవచ్చు... కొనలేని వారి పరిస్థితి? ‘మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు’ అంటూ శ్రీశ్రీ శ్రామిక లోకానికి పిలుపు నిచ్చారు. ఇంకో వందేళ్లకు సంపన్నులందరూ తోసుకుంటూ దూసుకుంటూ మరో ప్రపంచానికి వెళ్తారు కాబోలు! చంద మామా నువ్వు అందరివాడివా? కొందరివాడివా?
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
అందిన ‘మామ’ అందరివాడా?
Published Sun, Aug 27 2023 12:45 AM | Last Updated on Sun, Aug 27 2023 11:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment