సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేసిన దర్యాప్తు పురోగతిని తెలియజేయాలని రాష్ట్ర హైకోర్టు ఆ శాఖను ఆదేశించింది. ఇందుకు మూడు వారాల సమయం ఇస్తూ న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్ ఉత్తర్వులు ఇచ్చారు. వివరాల్లోకెళితే...హెచ్‌సీఏలో జరుగుతున్న అవినీతిపై ఏసీబీతో విచారణ చేయించాలని రోషనార క్లబ్ దాదాపు మూడేళ్ల క్రితం పిటిషన్ దాఖలు చేసింది. అనంతర పరిణామాల్లో ఏసీబీ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపింది కూడా.
దీనికి సంబంధించి అరెస్ట్ అవకుండా అందులో ఉన్న ఆరోపితులు కోర్టునుంచి స్టే కూడా తెచ్చుకున్నారు. అయితే కొంతకాలంగా ఈ దర్యాప్తు నెమ్మదించింది. ఈ నేపథ్యంలో కేసు ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ రోషనార క్లబ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. లేదంటే హెచ్‌సీఏలో అవినీతి మరింత పెరిగిపోతుందని వారు ఇందులో ఆరోపించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఏసీబీకి ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
మూడు వారాల్లో సమాధానమివ్వండి!
Published Fri, Jan 3 2014 12:00 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement