సాక్షి, రంగారెడ్డి జిల్లా : న్యాయసేవలను విస్తృతం చేసేందుకు రాష్ట్ర హైకోర్టు మరో అడుగు ముందుకేసింది. న్యాయస్థానానికి వచ్చే కేసుల పరిశీలనను వేగవంతం చేయాలనే సంకల్పంతో జిల్లాకు కొత్తగా 31 కోర్టులను మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నగరం చుట్టూ జిల్లా విస్తరించి ఉండడం, ప్రజల రాకపోకలు, ఇతర కార్యకలాపాలన్నీ జిల్లా నుంచే జరుగుతున్న నేపథ్యంలో సమస్యలు సైతం జిల్లాలో ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో న్యాయస్థానానికి వెళ్లే కేసులు సైతం అధికంగా ఉన్నాయి. ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు హైకోర్టు చర్యలు చేపట్టింది.
జిల్లాకు హైకోర్టు మంజూరు చేసిన న్యాయస్థానాల్లో 25 జూనియర్ సివిల్ జడ్జీ కమ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్స్ కోర్టులు, మరో ఆరు జ్యుడీషియల్ సర్వీస్ సెంటర్లున్నాయి. ఇవి మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, వికారాబాద్, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, మేడ్చల్, హయత్‌నగర్, పరిగి, చేవెళ్ల, తాండూరు ప్రాంతాల్లో వీటిని నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇవన్నీ ఈనెల 21 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
కొత్త న్యాయ స్థానాలిక్కడే..
జిల్లాకు కొత్తగా మంజూరైన 31 న్యాయస్థానాలను 11 ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. మల్కాజిగిరిలో రెండు, మేడ్చల్‌లో ఐదు, హయత్‌నగర్‌లో ఒకటి, మహేశ్వరంలో ఒకటి, ఇబ్రహీంపట్నంలో మూడు, కూకట్‌పల్లిలో ఆరు, రాజేంద్రనగర్‌లో మూడు, పరిగిలో మూడు, తాండూరులో మూడు, వికారాబాద్‌లో మూడు న్యాయస్థానాలు ఏర్పాటు కానున్నాయి. ఈనెల 21 నుంచి అందుబాటులోకి వచ్చే ఈ న్యాయస్థానాల తాత్కాలిక బాధ్యతలు సమీపంలోని న్యాయమూర్తులకు అప్పగించింది.
కొత్త న్యాయస్థానాలు 31
Published Sat, Aug 16 2014 11:48 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement