హైకోర్టు సీజేగా జస్టిస్ రోహిణి
ఢిల్లీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా చరిత్ర
హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రోహిణికి పదోన్నతి లభించింది. ఆమె ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తద్వారా ఆమె ఢిల్లీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్రకెక్కారు. జస్టిస్ రోహిణి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. వచ్చేవారం ఆమె ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. జస్టిస్ రోహిణి ప్రస్తుతం హైకోర్టులో నంబర్ టూగా కొనసాగుతున్నారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆమె పేరును సుప్రీంకోర్టు కొలీజియం గత నెలలో కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. తరువాత జస్టిస్ రోహిణి నియామకానికి సంబంధించిన ఫైల్‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపింది. దీంతో రాష్ట్రపతి ఆమెను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జస్టిస్ రోహిణి 1955, ఏప్రిల్ 14న విశాఖపట్నంలో జన్మించారు. ఆంధ్రా వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1980లో న్యాయవాదిగా నమోదై, సీనియర్ న్యాయవాది కోకా రాఘవరావు వద్ద జూనియర్‌గా న్యాయవాద వృత్తి ప్రారంభించారు. కోకా రాఘవరావు ఎడిటర్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్ లా జర్నల్స్‌కు జస్టిస్ రోహిణి 1985లో రిపోర్టర్‌గా వ్యవహరించారు. తరువాత అదే జర్నల్స్‌కు ఆమె ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రిట్స్, సివిల్, క్రిమినల్, సర్వీసు కేసుల్లో నిపుణత సాధించారు. 1995లో ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టి, 2001లో అదనపు న్యాయమూర్తిగా, 2002లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ధైర్యానికి మారుపేరుగా నిలిచే జస్టిస్ రోహిణి న్యాయమూర్తిగా పలు సంచలన తీర్పులు వెలువరించారు.