అభిప్రాయం
ఓబీసీ కులాల వర్గీ కరణ ఆవశ్యకతను గుర్తించి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2017 అక్టో బర్ 2న ముగ్గురు సభ్యులతో జస్టిస్ రోహిణి అధ్యక్షతన ఒక జాతీయ కమిషన్‌ను (justice rohini commission) ఏర్పాటు చేసింది. దానికి దేశంలో ఓబీసీ కోటాలో విద్యా–ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు అనుభవిస్తున్న సుమారు 2,640 కులాలను వర్గీకరించి రిజర్వేషన్లు అమలు చేయడంలోని సాధ్యా సాధ్యాలను పరిశీలించి నివేదిక సమర్పించడానికి 12 వారాల గడువు ఇచ్చింది. నాటి నుండి కేంద్ర ప్రభుత్వం కమిషన్ పదవీ కాలాన్ని ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి పెంచింది. ఎట్టకేలకు కమిషన్ తన నివేదికను జూలై 2023లో సమర్పించింది. కానీ దాని అమలుకు ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశం అయ్యింది. మరోవైపు దేశవ్యాప్తంగా సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన ఓబీసీ కులాల వారు(OBCs) వర్గీకరణను వ్యతిరేకిస్తున్న వైనం కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో రాజకీయంగా నష్టం కలుగుతుందనే ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం (BJP Government) ఓబీసీలను వర్గీకరించక పోవచ్చని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు. 2023 ఆగస్టులో సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం.. ‘స్టేట్ అఫ్ పంజాబ్ వర్సెస్ దావీందర్ సింగ్’ కేసు తీర్పులో ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లను వర్గీకరణ ద్వారా అమలు చేసుకోవచ్చని తేల్చి చెప్పింది. ఇప్పటికే దేశంలోని 11 రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగాల్లో వర్గీకరణ ద్వారా అమలు చేస్తున్నారు. బీసీ/ఓబీసీ కులాల మధ్య సామాజిక, విద్య, ఆర్థికపరమైన వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయి.
అందుకే కేంద్రం 27 శాతం రిజర్వేషన్లను ఓబీసీలకు అమలు చేస్తున్నప్పటికీ, నేటికీ కేంద్రంలో 1,600 కులాలకు పైగా ఎలాంటి రిజర్వేషన్ల ఫలాలూ పొందలేదని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అధిక జనసంఖ్య కలిగి సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలంగా ఉన్న కులాల వారే అధిక ప్రయోజనం పొందుతున్నారు. కేంద్ర ఓబీసీ జాబితాలోని బీసీ కులాలు నేటి వరకు కేంద్ర ప్రభుత్వంలో రిజర్వేషన్ల ఫలాలను ఏ మేరకు అనుభవించాయనే లెక్కలను, వారి జనసంఖ్యను పరిగణలోకి తీసుకొని శాస్త్రీయంగా జస్టిస్ రోహిణి కమిషన్ ఓబీసీలను 4 గ్రూపులుగా వర్గీకరించి గ్రూప్–ఏలో 1,654 కులాలకు 2 శాతం, గ్రూప్–బీలో 534 కులా లకు 6 శాతం, గ్రూప్–సీలో 328 కులాలకు 9 శాతం, గ్రూప్–డీలో 104 కులాలకు 10 శాతం రిజర్వేషన్లను కేటాయిస్తున్నట్లు ప్రచారం జరిగింది. నిజమేమిటో తెలియదు.
చదవండి: రూపంలో తేడా ఉన్నందుకేనా దొంగలు?
మండల్ కమిషన్‌లోని సభ్యులు ఎల్‌ఆర్ నాయక్ ఆనాడే (1978–80) ఓబీసీ కులాల మధ్య అసమానతలను గమనించి ఆ కులాలను రెండు గ్రూపులుగా వర్గీకరించి 27 శాతం కోటాను అమలు పరచాలని డిసెంట్ నివేదికను కేంద్రానికి సమర్పించారు. అందులో అణిచివేయబడిన బీసీ కులాలకు 15%, మధ్యస్థ బీసీ కులాలకు 12% రిజర్వే షన్లు కేటాయించారు. కానీ, నాటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, 1993 నుండి ఉద్యోగాల్లో, 2008 నుండి విద్యాసంస్థల్లో వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే ఓబీసీల్లోని అత్యంత వెనుకబడిన కులా లకు న్యాయం జరిగి ఉండేది. మండల్ కమిషన్‌కు సంబంధించిన తీర్పులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం... బీసీల వర్గీకరణకు ఆమోదం తెలిపింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కులాల మధ్య సమ న్యాయం కోసం వెంటనే జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను అమలు పరచాలి.
- కోడెపాక కుమార స్వామి
బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment