ఎడ్మండ్ బర్క్ అనే ఐరిష్ తత్వవేత్త ‘నిజమైన మతమే సమాజానికీ, మానవీయ ప్రభుత్వానికీ పునాది’ అని పేర్కొన్నాడు. ఉదాహరణకు చైనాలో కమ్యూనిజం విజయం సాధించడానికి బుద్ధిజం కారణమని చెప్పవచ్చు. హిందూ దేశంగా ప్రసిద్ధిగాంచిన భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు గడిచిపోయినప్పటికీ కుల అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా సామాజిక సంబంధాల్లో మార్పు లేకుండా ఉండటానికి హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థే కారణం. ఎందుకంటే కులాలు జన్మించినవే హిందూ మతానికి చెందిన శాస్త్రాల నుండి కనుక. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పౌరులకు రాజ్యాంగబద్ధంగా సమస్త హక్కులను కల్పించి కుల నిర్మూలన, సమ సమాజ స్థాపనే రాజ్యాంగం లక్ష్యంగా నిర్ధారించారు.
ఆర్థిక, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో సంస్కరణలు చేయడం వల్ల మాత్రమే సమాజంలో మార్పు తేలేం. మతంతో సంబంధం లేని సామాజిక సంస్కరణలు తేవడం వలన సమాజంలో కొంత మార్పును మాత్రమే తేగలం. అదే మతంతో ముడిపడి ఉన్న సంస్కరణలైతే అత్యధిక మార్పులు తేవచ్చు. అయితే ఇందుకోసం మత సంస్కరణ జరగాలి. మత సంస్కరణలు చెయ్యలేని సందర్భంలో మతంతో ముడిపడి ఉన్న సమస్యలను రాజ్యాంగ సవరణల ద్వారా అధిగమించవచ్చు. ఫలితంగా సామాజిక దొంతర మారే అవకాశం లభిస్తుంది.
రాజ్యాంగ సవరణలు ద్వారా అమెరికా, దక్షిణ ఆఫ్రికా దేశాల్లో మన కుల వ్యవస్థను పోలిన జాతి వివక్షను నిషేధించడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసు కోవాలి. దక్షిణాఫ్రికాలో 1948లో అక్కడి నేషనల్ పార్టీ వారు తెలుపు–నలుపు ప్రజల మధ్య జాతి వివక్షను చట్టబద్ధమైనదిగా మార్చారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వం అమలు చేసిన విధానానికి మద్దతు పలు కుతూ కొంతమంది క్రైస్తవులు బైబిల్‌ను దుర్వినియో గించారు. దేవుడు అందరినీ సమానంగా సృష్టించాడు అని బైబిలు చెప్పినప్పటికీ కొందరు శ్వేత జాతి మత పెద్దలు వారి ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇలా చేశారు. అయితే అక్కడి ప్రభుత్వం మత సంస్కరణలు చేయలేని పరిస్థితుల్లో 1994లో రాజ్యాంగ సవరణల ద్వారా సమాజంలో వర్ణవివక్ష లేని సమాజాన్ని స్థాపించింది. అమెరికాలో కూడా 1865లో 13వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతి ఆధారిత బానిసత్వాన్ని తొల గించి అందరూ సమానులే అని నిర్ధారించి తద నంతరం అనేక సవరణల ద్వారా సమ సమాజాన్ని స్థాపించారు. (క్లిక్: సామాన్య శూద్రుడికి సెయింట్‌హుడ్)
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లవుతున్నా, పరువు హత్యల పేరున కులాంతర వివాహం చేసుకున్న దంపతులను హత్య చేస్తున్నారు. ఇలాంటి హత్యలు దేశంలో మానవ జాతికే కళంకం తెస్తున్నాయి. ఇలాంటి తరుణంలో... మన దేశంలో హిందూ మతంలో సంస్కరణలు, హిందూ మత గ్రంథాల సవరణలు సాధ్యమయ్యేపని కాదు. కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యంగ పీఠిక, అధికరణల మేరకూ; సుప్రీంకోర్టు 2011లో కె.కె. భాస్కరన్ వర్సెస్ స్టేట్ అఫ్ తమిళనాడు, నందిని సుందర్ వర్సెస్ స్టేట్ అఫ్ ఛత్తీస్‌గఢ్ కేసుల్లో ఇచ్చిన తీర్పుల ప్రకారం... దేశంలో పౌరుల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలి. తద్వారా రాజ్యాంగంలో ‘ఆర్టికల్ 17ఏ’ను చేర్చి కుల వ్యవస్థను నిషేధించాలి. అది సాధ్యం కానిపక్షంలో ‘కులాంతర వివాహాల పరిరక్షణ’ చట్టాన్ని ఏర్పాటు చేసి పక డ్బందీగా అమలు చెయ్యాలి. ప్రాథమిక విద్యాభ్యాసం నుండి విద్యార్థులకు దేశాన్ని పీడిస్తున్న కుల సమస్యను నిర్మూలించడానికి తగు విధానాలను నేర్పించాలి. లేనట్లయితే రాజ్యాంగ లక్ష్యమైన కులరహిత సమాజాన్ని స్థాపించడం అసాధ్యం. (క్లిక్: మతాలు కాదు... మనిషే ప్రధానం)
- కోడెపాక కుమార స్వామి
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment