డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేడ్కర్ భారతీయ (BR Ambedkar) చరిత్రలో మహోన్నత వ్యక్తి. భారత రాజ్యాంగ నిర్మాతగా, దళిత హక్కుల పరిరక్షకుడిగా విస్తృతంగా ప్రశంసలు పొందిన అంబేడ్కర్ అందించిన సేవలు కుల, ప్రాంతీయ పరిమితులను దాటి ఉన్నాయి. ఆయన కేవలం సామాజిక సంస్కర్తగానే కాకుండా దేశ సమగ్రాభివృద్ధి కోసం పారిశ్రామీకరణ, పట్టణీకరణ, ఆధునికీకరణ, నాగరికత (Civilisation) గురించి దశాబ్దాల ముందే చర్చించిన దూరదృష్టి కలిగిన తత్వవేత్త. ఆయన కేవలం దళితులకు మాత్రమే చెందినవారు కాదు. ఆయన విశ్వ మానవతా సిద్ధాంతాలు, సేవలు ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిపోవాలి. పారిశ్రామికీకరణ ప్రజల సాంఘిక–ఆర్థిక స్థితులను మెరుగుపరచడానికి మార్గమని ఆయన విశ్వసించారు. గ్రామాధారిత ఆర్థిక వ్యవస్థ (Economy) ఒక్కటే భారతదేశ అవసరాలను తీర్చలేదని ఆయన స్పష్టంగా గ్రహించారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెంచి, పేదరికాన్ని తగ్గించి, ఆర్థిక పురోగతిని సాధించవచ్చనేది ఆయన నమ్మకం.
అలాగే, పట్టణీకరణ ద్వారా సామాజిక సమానత్వానికి మార్గం సుగమం అవుతుందని ఆయన పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాలు విద్య, సాంకేతికత, సామాజిక మార్పు కేంద్రాలుగా; కులవాదం నుండి విముక్తి కలిగించే చోట్లుగా ఉండాలి అని ఆయన బలంగా విశ్వసించారు. ఆధునికీకరణ గురించి ఆయన అభిప్రాయాలు శాస్త్రీయ ద్రుఃక్కోణం, సామాజిక సమానత్వం, బుద్ధివాదం ఆధారంగా ఉన్నాయి. ముఖ్యంగా మరుగునపడిన వర్గాల అభివృద్ధిలో విద్య ప్రాముఖ్యాన్ని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇది భారతీయుల మనోభావాలను ఆధునికీకరించే క్రమంలో పెద్ద ముందడుగు. ఆయన ప్రధానంగా భారత రాజ్యాంగ రూపకర్తగా ప్రఖ్యాతి పొందారు. కానీ ఇది కేవలం చట్టపరమైన విజయం మాత్రమే కాక ఒక తాత్విక విజయంగా నిలిచింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఆవశ్యక విలువలను రాజ్యాంగంలో ప్రతిష్ఠించారు.
అలాగే కార్మిక సంక్షేమం, మహిళా హక్కులు, అంటరానితనం నివారణ వంటి రంగాల్లో ఆయన రూపకల్పన చేసిన విధానాలు ఈ రోజు కూడా అద్భుతంగా పని చేస్తున్నాయి. ‘హిందూ కోడ్ బిల్లు’ ద్వారా మహిళలకు వారసత్వ ఆస్తిహక్కును కల్పించడం ద్వారా లింగ సమానత్వానికి ఆయన బలమైన పునాది వేశారు. ఆయన రాసిన ‘ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ: ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్’ అనే గ్రంథం ఆర్థిక స్థిరత్వం, కేంద్ర బ్యాంకింగ్ సంస్కరణల ప్రాముఖ్యాన్ని చూపిస్తుంది. అలాగే ఆయన సైన్సు ఆధారంగా ఆధునిక సమాజాన్ని నిర్మించడమే కాకుండా, సర్వలోక మానవ హక్కులకూ అంకితమయ్యారు. ఆయన తత్త్వం ఐక్యరాజ్యసమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను (ఎస్‌జీఈఎస్) ముందుగానే ఊహించింది. లింగ సమానత్వం, అసమానతల తగ్గింపు, నాణ్యమైన విద్య వంటి లక్ష్యాలకు ఆయన జీవితమే మార్గదర్శి.
చదవండి: బీద పిల్లల నోట్లో మట్టి కొట్టే యత్నం
అంబేడ్కర్ పేరును స్మరించడం అనేది కేవలం ఆరాధన కాదు, ఆయన విలువలను మన జీవితాల్లో అమలు చేయడం. ఆయన పేరు మనం న్యాయ సమానత్వం, ఆర్థిక పురోగతి వంటి గౌరవప్రద విలువల వైపు అడుగులు వేస్తున్నామని గుర్తు చేస్తుంది.
– ప్రొఫెసర్ ఎం. జేమ్స్ స్టీఫెన్, చైర్ ప్రొఫెసర్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చైర్, ఆంధ్రా యూనివర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment