Social reformer
-
గాంధేయ నిర్మాణ కార్యక్రమ సారథి ‘లవణం’
భారత స్వాతంత్య్ర సమ రంలోనే కాక, ఆ తర్వాత దేశ నిర్మాణ కార్యక్రమంలోనూ పొల్గొని సుదీర్ఘ కాలం దేశ సేవ చేసిన అరుదైన మనీషి లవణం. గాంధీజీ నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహ సమ యంలో (1930 అక్టోబర్ 10) జన్మించినందున ఆయనకు తండ్రి గోపరాజు రామచంద్రరావు (గోరా) ‘లవణం’ అని పేరు పెట్టారు. నాస్తికవాదిగా, గాంధేయవాదిగా; కుల, మత, వర్గ రహిత నవ సమాజ నిర్మాణానికి కంకణం కట్టుకొని ఆధ్యాత్మిక, ఆచార, సంప్రదాయాలను ఎదిరించి జీవితాంతం పని చేశారు లవణం.జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా గోరా పనిచేస్తున్న సమయంలో పదేళ్ల వయసు ఉన్న లవణం సేవాగావ్లో ఉండేవారు. ఆశ్రమానికి వచ్చిన అతిథులకు అల్పాహారం, భోజనం ఏర్పాట్లు చేస్తూ ఉండేవారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో అపారమైన వాగ్ధాటి కలిగిన వ్యక్తి లవణం. చిన్నతనం నుండి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ అంచెలంచెలుగా విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ దేశ విదేశాలలో మానవతా, గాంధేయ వాదాలను ప్రచారం చేస్తూ తన జీవనాన్ని కొనసాగించారు. 1955లో ఆచార్య వినోబా భావే ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల పర్యటనలో చేసిన హిందీ ప్రసంగాలను సరళమైన తెలుగులోకి అనువదించారు. అలాగే సర్వోదయ సాహిత్యాన్ని హిందీ నుండి తెలుగులోకి అనువదించారు. భూదాన పత్రికకు సంపాదకులుగా ఉన్నారు.గుర్రం జాషువా కుమార్తె హేమలతతో వీరికి ఆదర్శ వివాహం జరిగింది. వీరిద్దరూ చంబల్ లోయ బందిపోట్లకు హృదయ పరివర్తన కల్పించే ఉద్యమంలో వినోబా, జయప్రకాశ్ నారాయణ్ల ప్రభావంతో మధ్య ప్రదేశ్లో పనిచేశారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో ‘జోగిని’ వ్యవస్థను రూపుమాపడానికి ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా కృషి చేశారు. స్టూవర్టుపురంలో పున రావాస కేంద్రాన్ని నెలకొల్పి అక్కడ ఖైదీలతో సహజీవనం కొనసాగిస్తూ వారిని దోపిడీలు, దొంగ తనాల నుంచి మరల్చారు. ప్రభుత్వంతో మాట్లాడి వారిపై కేసులను ఎత్తివేయించి వాళ్ల కాళ్లపై వారు నిలబడేలా సహాయ సహకారాలు అందించారు. ఆ విషయంలో హేమలత –లవణం దంపతుల సేవలు చిరస్మరణీయం. గాంధేయవాదం, సర్వోదయ, మానవతావాదాలను నమ్మిన వ్యక్తిగా లవణం దేశంలోని అన్ని రాష్ట్రాలలో పర్యటించారు. అనేకమందిలో మార్పు తేవడానికి విశేష కృషిచేశారు. దండకారణ్యం, జార్ఖండ్ అడవు లను సైతం ఆరోగ్యం లెక్క చేయక తిరిగారు.చదవండి: అన్నాడంటే మాటపై ఉన్నాడనే!హేమలత మరణానంతరం (2008) లవణం చాలా విచారంతో నిస్సహాయ స్థితికి వెళ్లినా, నేను చేపట్టిన కార్యక్రమాలకు తప్పక హాజరవుతూ ప్రోత్సహించేవారు. గాంధేయ నిర్మాణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి విజయం సాధించినందుకు, గాంధీజీ ఆశయాలను ప్రజలకు.. ముఖ్యంగా యువత, విద్యార్థులకు అందిస్తున్నందుకు లవణానికి ప్రతిష్ఠాత్మకమైన ‘జాతీయ జమునాలాల్ బజాజ్’ అవార్డు లభించింది. అలాగే 2006లో నాగపూర్ విశ్వవిద్యాలయం వారి మహాత్మా గాంధీ అవార్డు ఆయన అందు కున్నారు. సంఘసంస్కర్త, ఆదర్శవాది, నాస్తికవాది, గాంధేయవాది అయిన లవణం చివరికి 2015 ఆగస్టు 14న తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత పరిస్థి తుల్లో ఆయన ఆశయాల కొనసాగింపు ఆవశ్యకత ఎంతైనా ఉంది.- జి.వి. సుబ్బారావు తెలంగాణ గాంధీ స్మారక నిధి అధ్యక్షులు -
ఏపీకి సోషల్ రిఫార్మర్ సీఎం జగన్
-
స్వరాజ్యం నా జన్మహక్కని గర్జించిన తిలక్
స్వరాజ్యం నా జన్మహక్కని గర్జించిన తొలి స్వాతంత్య్ర పోరాటవీరుడు బాలగంగాధర్ తిలక్. ప్రజల చేత లోకమాన్యుడుగా పిలిపించుకొన్న తిలక్ అసలు పేరు కేశవ్ గంగాధర్ తిలక్. 160 ఏళ్ల క్రితం 1856 జూలై 23 న మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉపాధ్యాయుడైన గంగాధర్ తిలక్ దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుంచే దేశ పరిస్థితులను నిశితంగా గమనిస్తూ తాను కూడా స్వరాజ్య పోరాటంలో ఓ సమిధగా మారాలని నిశ్చయించుకున్నారు. 1890 ప్రాంతంలో స్వరాజ్య పోరాట వేదిక అయిన కాంగ్రెస్లో చేరారు. తిలక్ ప్రవేశం నాటికి జాతీయోద్యమంలో గోపాలకృష్ట గోఖలే సారథ్యంలో మితవాదులు పోరాటం చేస్తున్నారు. అయితే అహింస, మితవాదం వల్ల స్వరాజ్యం లభించదని, బిట్రిష్వారితో పోరాటం వల్లనే స్వాతంత్య్రం సాధించగలమని విశ్వసించిన తిలక్ అతివాదిగా తన పోరాటాన్ని ప్రారంభించారు. మహాత్మాగాంధీ కంటే ముందే దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలక భూమిక పోషించారు. పాత్రికేయునిగా జీవితం ప్రారంభించి నాటి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తన కలం పదునుతో ఎన్నో వ్యాసాలతో అక్షర గర్జన చేసి నాటి సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. మాతృభాష మరాఠీలో, ఇంగ్లిష్ భాషలలో పత్రికలను ప్రారంభించి స్వరాజ్య పోరాటాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. 1897లో బొంబాయి పరిసర ప్రాంతలలో ప్లేగు వ్యాధి విజృంబించింది. ఈ వ్యాధి నియంత్రణ పేరుతో బ్రిటిష్ వారు ప్రజల ఇళ్ళపై దాడులు చేస్తూ సోదాలు జరపడంతో ఆ చర్యను తిలక్ వ్యతిరేకించారు. దీనితో బ్రిటిష్ వారు ఆయనపై విప్లవ వాదిగా ముద్ర వేసి జైల్లో పెట్టారు. జైలు నుంచి విడుదల అయ్యాక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి పోరాడారు. దీంతో ఆయనను రంగూన్ జైలుకు తరలించి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. 1914లో జైలు నుంచి విడుదలై తిరిగి తన పోరాటం కొనసాగిం చారు. ఆయన రచించిన గీతా రహస్యం పుస్తకం విశేష ప్రాచుర్యం పొందింది. తన జీవితాంతం దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన తిలక్ బొంబాయిలో 1920 ఆగస్టు 1న తన 64వ యేట కన్నుమూశారు. తిలక్ జీవితం ఆదర్శప్రాయం. (నేడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 88వ వర్ధంతి సందర్భంగా) - యస్.బాబు రావు, జాతీయ కార్యవర్గ సభ్యులు, దళిత జర్నలిస్టులు, రచయితల సంక్షేమ సంఘం, కావలి ‘ 9573011844 -
జాతిహిత
నేడు జ్యోతీబా పూలే వర్ధంతి సామాజిక రుగ్మతల నిర్మూలనకు కృషి చేసిన పందొమ్మిదో శతాబ్దపు సంఘ సంస్కర్త, తత్వవేత్త జ్యోతీబా పూలే. 1873లో ఆయన స్థాపించిన ‘సత్యశోధక్ సమాజ్’ అంటరానితనం అనే భావనను సమాజం నుంచి పారద్రోలడానికి ఎంతగానో పాటు పడింది. దాస్యపీడనలో, దాష్టీకంలో ఏ యుగానికి ఏ యుగమూ తక్కువ కాదు అంటారు జ్యోతీబా పూలే. త్రేతాయుగంలో పరశురాముడు, కలియుగం లో మనువు, అగ్రరాజ్యంలో శ్వేతవర్ణం, అగ్రవర్ణ రాజ్యంలో వేదవాఙ్మయం ఇందుకు నిదర్శనమని పూలే చెబుతారు. ఒకరిపై ఒకరిని ఆధారపడేలా చేసి ఏ ఒక్క వర్గమో నిర్మించిన అసమానతల మహాసౌధాన్ని కూల్చేయకుండా... దాని పునాదుల కింద శతాబ్దాలుగా ఆక్రందనలు చేస్తున్న అణగారిన స్వరాల ఆత్మలను పైకి లేవనెత్తలేమన్నాడు. దేవుడి ఒడి నుంచో, నుదుటి నుంచో, పాదం నుంచో రాలిపడిన చాతుర్వర్ణ చాతుర్య గ్రంథాలలోని గుడ్డి నమ్మకాల బరువును వదిలించుకోకుండా అంధకారంపై తొలి గునపం దెబ్బ వెయ్యలేమని ప్రబోధించారు. మనువు గురించి పూలే అభిప్రాయాలు ఆలోచన రేకెత్తిస్తాయి. ‘‘మనువు ఏం చేశాడు? మంచిని చేస్తున్నట్లే చేసి మంచిది కాని దాన్ని చేశాడు. దారి వేస్తున్నట్లే వేసి, దారులన్నీ మూసేశాడు. సృష్టి గురించి చెప్పాడు. సృష్టిలోని నికృష్టులెవరో చెప్పాడు! ఇంద్రియ నిగ్రహం అన్నాడు. అగ్రవర్ణ కక్కుర్తి అకృత్యాలకు అడ్డదారులు చూపాడు. స్త్రీల బాధ్యతలన్నాడు. స్వేచ్ఛ లేకుండా చేశాడు. రాజధర్మాలు అన్నాడు. ప్రజలను పడి వుండమన్నాడు. కులధర్మాలు నూరి పోశాడు. కడ జాతులు అన్నాడు. న్యాయం లేని నీతుల్ని, రీతుల్ని రచించాడు’’ అని పూలే కన్నెర్ర చేశారు. జాతిపిత గాంధీజీ అయితే, జాతి‘హిత’ జ్యోతీబా పూలే. మహాత్ముడి చేతే మహాత్ముడనిపించుకున్నారు పూలే! ‘నా ముగ్గురు గురువులలో ఒకరు పూలే’ అన్నారు అంబేద్కర్. (తక్కిన ఇద్దరు బుద్ధుడు, కబీరు). కులబలాఢ్యులను ఢీకొని, ‘కడ’బలహీనులకు అండగా, చేతి కండగా ఉండి మహాత్ములకే పితామహాత్ముడయ్యారు పూలే. మతాన్ని తప్ప మనిషిని ఎదగనివ్వని మూఢనమ్మకాలను, కల్లబొల్లి కథలను చెట్టుకు కట్టేసి కొట్టిన యోధుడు ఆయన.మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ‘మాలి’ అనే నిమ్న కులంలో 1827 ఏప్రిల్ 11న జన్మించిన పూలే 1890 నవంబర్ 28న కన్నుమూశారు.