జాతిహిత
నేడు జ్యోతీబా పూలే వర్ధంతి
సామాజిక రుగ్మతల నిర్మూలనకు కృషి చేసిన పందొమ్మిదో శతాబ్దపు సంఘ సంస్కర్త, తత్వవేత్త జ్యోతీబా పూలే. 1873లో ఆయన స్థాపించిన ‘సత్యశోధక్ సమాజ్’ అంటరానితనం అనే భావనను సమాజం నుంచి పారద్రోలడానికి ఎంతగానో పాటు పడింది.
దాస్యపీడనలో, దాష్టీకంలో ఏ యుగానికి ఏ యుగమూ తక్కువ కాదు అంటారు జ్యోతీబా పూలే. త్రేతాయుగంలో పరశురాముడు, కలియుగం లో మనువు, అగ్రరాజ్యంలో శ్వేతవర్ణం, అగ్రవర్ణ రాజ్యంలో వేదవాఙ్మయం ఇందుకు నిదర్శనమని పూలే చెబుతారు. ఒకరిపై ఒకరిని ఆధారపడేలా చేసి ఏ ఒక్క వర్గమో నిర్మించిన అసమానతల మహాసౌధాన్ని కూల్చేయకుండా... దాని పునాదుల కింద శతాబ్దాలుగా ఆక్రందనలు చేస్తున్న అణగారిన స్వరాల ఆత్మలను పైకి లేవనెత్తలేమన్నాడు. దేవుడి ఒడి నుంచో, నుదుటి నుంచో, పాదం నుంచో రాలిపడిన చాతుర్వర్ణ చాతుర్య గ్రంథాలలోని గుడ్డి నమ్మకాల బరువును వదిలించుకోకుండా అంధకారంపై తొలి గునపం దెబ్బ వెయ్యలేమని ప్రబోధించారు.
మనువు గురించి పూలే అభిప్రాయాలు ఆలోచన రేకెత్తిస్తాయి. ‘‘మనువు ఏం చేశాడు? మంచిని చేస్తున్నట్లే చేసి మంచిది కాని దాన్ని చేశాడు. దారి వేస్తున్నట్లే వేసి, దారులన్నీ మూసేశాడు. సృష్టి గురించి చెప్పాడు. సృష్టిలోని నికృష్టులెవరో చెప్పాడు! ఇంద్రియ నిగ్రహం అన్నాడు. అగ్రవర్ణ కక్కుర్తి అకృత్యాలకు అడ్డదారులు చూపాడు. స్త్రీల బాధ్యతలన్నాడు. స్వేచ్ఛ లేకుండా చేశాడు. రాజధర్మాలు అన్నాడు. ప్రజలను పడి వుండమన్నాడు. కులధర్మాలు నూరి పోశాడు. కడ జాతులు అన్నాడు. న్యాయం లేని నీతుల్ని, రీతుల్ని రచించాడు’’ అని పూలే కన్నెర్ర చేశారు.
జాతిపిత గాంధీజీ అయితే, జాతి‘హిత’ జ్యోతీబా పూలే. మహాత్ముడి చేతే మహాత్ముడనిపించుకున్నారు పూలే! ‘నా ముగ్గురు గురువులలో ఒకరు పూలే’ అన్నారు అంబేద్కర్. (తక్కిన ఇద్దరు బుద్ధుడు, కబీరు). కులబలాఢ్యులను ఢీకొని, ‘కడ’బలహీనులకు అండగా, చేతి కండగా ఉండి మహాత్ములకే పితామహాత్ముడయ్యారు పూలే. మతాన్ని తప్ప మనిషిని ఎదగనివ్వని మూఢనమ్మకాలను, కల్లబొల్లి కథలను చెట్టుకు కట్టేసి కొట్టిన యోధుడు ఆయన.మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ‘మాలి’ అనే నిమ్న కులంలో 1827 ఏప్రిల్ 11న జన్మించిన పూలే 1890 నవంబర్ 28న కన్నుమూశారు.