
భారత స్వాతంత్య్ర సమ రంలోనే కాక, ఆ తర్వాత దేశ నిర్మాణ కార్యక్రమంలోనూ పొల్గొని సుదీర్ఘ కాలం దేశ సేవ చేసిన అరుదైన మనీషి లవణం. గాంధీజీ నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహ సమ యంలో (1930 అక్టోబర్ 10) జన్మించినందున ఆయనకు తండ్రి గోపరాజు రామచంద్రరావు (గోరా) ‘లవణం’ అని పేరు పెట్టారు. నాస్తికవాదిగా, గాంధేయవాదిగా; కుల, మత, వర్గ రహిత నవ సమాజ నిర్మాణానికి కంకణం కట్టుకొని ఆధ్యాత్మిక, ఆచార, సంప్రదాయాలను ఎదిరించి జీవితాంతం పని చేశారు లవణం.
జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా గోరా పనిచేస్తున్న సమయంలో పదేళ్ల వయసు ఉన్న లవణం సేవాగావ్‌లో ఉండేవారు. ఆశ్రమానికి వచ్చిన అతిథులకు అల్పాహారం, భోజనం ఏర్పాట్లు చేస్తూ ఉండేవారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో అపారమైన వాగ్ధాటి కలిగిన వ్యక్తి లవణం. చిన్నతనం నుండి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ అంచెలంచెలుగా విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ దేశ విదేశాలలో మానవతా, గాంధేయ వాదాలను ప్రచారం చేస్తూ తన జీవనాన్ని కొనసాగించారు. 1955లో ఆచార్య వినోబా భావే ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల పర్యటనలో చేసిన హిందీ ప్రసంగాలను సరళమైన తెలుగులోకి అనువదించారు. అలాగే సర్వోదయ సాహిత్యాన్ని హిందీ నుండి తెలుగులోకి అనువదించారు. భూదాన పత్రికకు సంపాదకులుగా ఉన్నారు.
గుర్రం జాషువా కుమార్తె హేమలతతో వీరికి ఆదర్శ వివాహం జరిగింది. వీరిద్దరూ చంబల్ లోయ బందిపోట్లకు హృదయ పరివర్తన కల్పించే ఉద్యమంలో వినోబా, జయప్రకాశ్ నారాయణ్‌ల ప్రభావంతో మధ్య ప్రదేశ్‌లో పనిచేశారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో ‘జోగిని’ వ్యవస్థను రూపుమాపడానికి ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా కృషి చేశారు. స్టూవర్టుపురంలో పున రావాస కేంద్రాన్ని నెలకొల్పి అక్కడ ఖైదీలతో సహజీవనం కొనసాగిస్తూ వారిని దోపిడీలు, దొంగ తనాల నుంచి మరల్చారు. ప్రభుత్వంతో మాట్లాడి వారిపై కేసులను ఎత్తివేయించి వాళ్ల కాళ్లపై వారు నిలబడేలా సహాయ సహకారాలు అందించారు. ఆ విషయంలో హేమలత –లవణం దంపతుల సేవలు చిరస్మరణీయం. గాంధేయవాదం, సర్వోదయ, మానవతావాదాలను నమ్మిన వ్యక్తిగా లవణం దేశంలోని అన్ని రాష్ట్రాలలో పర్యటించారు. అనేకమందిలో మార్పు తేవడానికి విశేష కృషిచేశారు. దండకారణ్యం, జార్ఖండ్ అడవు లను సైతం ఆరోగ్యం లెక్క చేయక తిరిగారు.
చదవండి: అన్నాడంటే మాటపై ఉన్నాడనే!
హేమలత మరణానంతరం (2008) లవణం చాలా విచారంతో నిస్సహాయ స్థితికి వెళ్లినా, నేను చేపట్టిన కార్యక్రమాలకు తప్పక హాజరవుతూ ప్రోత్సహించేవారు. గాంధేయ నిర్మాణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి విజయం సాధించినందుకు, గాంధీజీ ఆశయాలను ప్రజలకు.. ముఖ్యంగా యువత, విద్యార్థులకు అందిస్తున్నందుకు లవణానికి ప్రతిష్ఠాత్మకమైన ‘జాతీయ జమునాలాల్ బజాజ్’ అవార్డు లభించింది. అలాగే 2006లో నాగపూర్ విశ్వవిద్యాలయం వారి మహాత్మా గాంధీ అవార్డు ఆయన అందు కున్నారు. సంఘసంస్కర్త, ఆదర్శవాది, నాస్తికవాది, గాంధేయవాది అయిన లవణం చివరికి 2015 ఆగస్టు 14న తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత పరిస్థి తుల్లో ఆయన ఆశయాల కొనసాగింపు ఆవశ్యకత ఎంతైనా ఉంది.
- జి.వి. సుబ్బారావు
తెలంగాణ గాంధీ స్మారక నిధి అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment