Ela Bhatt: పద్మభూషణ్‌ ఇలా భట్‌ కన్నుమూత | Padma Bhushan SEWA Ela Bhatt Passed Away | Sakshi
Sakshi News home page

సేవా వ్యవస్థాపకురాలు.. పద్మభూషణ్‌ ఇలా భట్‌ కన్నుమూత

Published Wed, Nov 2 2022 8:34 PM | Last Updated on Wed, Nov 2 2022 8:41 PM

Padma Bhushan SEWA Ela Bhatt Passed Away - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ మహిళా హక్కుల ఉద్యమకారిణి, గాంధేయవాది ఇలా భట్‌( 89) ఇక లేరు. గత కొంతకాలంగా  ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.  బుధవారం గుజరాత్‌ అహ్మదాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు.

1933లో జన్మించిన ఇలా భట్‌.. సూరత్‌లోని సర్వజనిక్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి, ఎంటీబీ ఆర్ట్స్‌ కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు. 1955లో టెక్స్‌టైల్ లేబర్ అసోసియేషన్ (TLA) అని పిలువబడే టెక్స్‌టైల్ కార్మికుల పూర్వ యూనియన్‌లో న్యాయ విభాగంలో చేరారు.  సెల్ఫ్‌ ఎంప్లాయిడ్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌ (SEWA) వ్యవస్థాపకురాలిగా ఇలా భట్‌ పేరొందారు.

అంతేకాదు.. మహిళల ఆర్థిక సంక్షేమం కోసం మొట్టమొదటి మహిళా బ్యాంకును సైతం ఆమె ఏర్పాటు చేశారు. 1977లో కమ్యూనిటీ లీడర్‌ షిప్‌ కేటగిరీ కింద.. ఆమె రామన్‌ మెగసెసే అవార్డు అందుకున్నారు. అంతేకాదు.. 1979లో ఏర్పాటైన మహిళల ప్రపంచ బ్యాంకుకు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ఆపై దానికి ఆమె చైర్‌పర్సన్‌గానూ వ్యవహరించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 1985లో పద్మశ్రీ, ఆ మరుసటి ఏడాదికే పద్మ భూషణ్‌ ప్రకటించింది భారత ప్రభుత్వం. 2011లో గాంధీ శాంతి బహుమతి సైతం ఆమె అందుకున్నారు. ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలకు సలహాదారుగా పని చేశారు.

గాంధీజీ ప్రేరణతో, భట్ సేవా (SEWA)ను స్థాపించారు. రాజ్యసభ సభ్యురాలిగానూ ఆమె 1989 వరకు పనిచేశారు. 2007లో ఆమె మానవ హక్కులు, శాంతిని పెంపొందించడానికి నెల్సన్ మండేలా స్థాపించిన ఎల్డర్స్ అనే గ్రూప్‌లో చేరారు. కాగా, ఇలా భట్‌ మృతిపట్ల కాంగ్రెస్‌ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement