వర్క్‌స్పేస్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ‘టేబుల్ స్పేస్’ వ్యవస్థాపకుడు, చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అమిత్ బెనర్జీ కన్నుమూశారు. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గుండెపోటుతో ఆయన చనిపోయాడంటూ కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నప్పటికీ అమిత్ బెనర్జీ మరణానికి తక్షణ కారణం ఇంకా తెలియలేదు.
“మా వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈవో అయిన అమిత్ బెనర్జీ మరణించినట్లు ప్రకటించడం చాలా విచారకరం. భారతదేశంలో ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ సొల్యూషన్ పరిశ్రమను మార్చిన దార్శనికుడైన నాయకుడు అమిత్. ఆయన నాయకత్వంలో టేబుల్ స్పేస్ ఈస్థాయికి చేరింది” అని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.
కంపెనీ, దాని వ్యక్తులు మరియు పరిశ్రమపై అతని ప్రభావం శాశ్వతంగా ఉంటుంది మరియు అతని కుటుంబం, స్నేహితులు మరియు భాగస్వాములచే అతను తీవ్రంగా మిస్ అవుతాడు. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము.
అమిత్ బెనర్జీ గురించి..
దాదాపు 44 ఏళ్ల వయస్సు ఉన్న అమిత్ బెనర్జీ, 2017 సెప్టెంబర్‌లో టేబుల్ స్పేస్‌ను స్థాపించారు. వర్క్ స్పేస్ కోసం చూస్తున్న పెద్ద, మధ్య-మార్కెట్ అద్దెదారులకు ఇది మేనేజ్డ్ వర్క్‌స్పేస్ ప్రొవైడర్‌గా అందుబాటులోకి వచ్చింది.
పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీలో 2002లో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన అమిత్ బెనర్జీ 2004 జనవరిలో ఐటీ మేజర్ యాక్సెంచర్‌లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ సంస్థలో 13 సంవత్సరాలు పనిచేసిన ఆయన రియల్ ఎస్టేట్ వ్యూహం, ప్రణాళిక, సముపార్జనలు, డీల్ స్ట్రక్చరింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్‌కు బాధ్యత వహించారు.
వృత్తిపరమైన అనుభవం అతన్ని రియల్ ఎస్టేట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది టేబుల్ స్పేస్‌ను ప్రారంభించడంలో సహాయపడింది. అమిత్ బెనర్జీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. బెనర్జీ సెజ్ డీల్ స్ట్రక్చరింగ్‌లో నైపుణ్యం కలిగి ఉన్నారు. ఆయన సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌లో ఆవిష్కరణలతో పేటెంట్ హోల్డర్ కూడా.
టేబుల్ స్పేస్ గురించి..
గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ హిల్‌హౌస్ క్యాపిటల్ మద్దతుతో ఉన్న టేబుల్ స్పేస్, 2025లో ఐపీఓకి వెళ్లాలని చూస్తున్న అనేక స్టార్టప్‌లలో ఒకటి. రూ. 3,500 కోట్ల కంటే ఎక్కువ నిధుల సమీకరణపై దృష్టి సారించింది. సుమారు 2.5 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.
టేబుల్ స్పేస్ వెబ్‌సైట్ ప్రకారం.. సంస్థ నిర్వహించే వర్క్‌స్పేస్‌లలో మార్కెట్ లీడర్‌గా ఉంది. ప్రధానంగా గూగుల్ (Google), యాపిల్ (Apple), డెల్ (Dell) వంటి ఫార్చూన్ (Fortune) 500 కంపెనీలతో కలిసి పని చేస్తుంది. పెద్ద స్థలాలను లీజుకు ఇవ్వడం, వాటిని ఆధునీకరించడమే కాకుండా వాణిజ్య రియల్ ఎస్టేట్‌ను సొంతం చేసుకోవడానికి జాయింట్ వెంచర్‌ల కోసం కంపెనీ భారతీయ రియల్టర్లతో కూడా జతకట్టింది.
వరుస విషాదాలు
స్టార్టప్ కమ్యూనిటీలో ఇటీవల ప్రముఖుల మరణాలు విషాదాన్ని నింపుతున్నాయి. రెండు వారాల క్రితం, ప్రఖ్యాత యోగర్ట్ బ్రాండ్ ఎపిగామియా సహ వ్యవస్థాపకుడు రోహన్ మిర్చందానీ డిసెంబర్ 21న 41 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. వెంచర్ క్యాపిటల్ సంస్థ గుడ్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు రోహన్ మల్హోత్రా అక్టోబర్ 1న మరణించారు. పెప్పర్‌ఫ్రై సహ వ్యవస్థాపకుడు అంబరీష్ మూర్తి ఆగస్టులో లేహ్‌లో బైకింగ్ ట్రిప్‌లో గుండెపోటుతో మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment