Providers
-
Gimbal: వీడియో కంటెంట్ ఇప్పుడు మరింత కొత్తగా
హైదరాబాద్: వీడియో కెమెరాలు, స్మార్ట్ఫోన్లను మరింత సమర్థంగా ఉపయోగించుకునేందుకు వీలుగా చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ జియూన్ సరికొత్త జింబల్లను ఇండియాలో రిలీజ్ చేసింది. జింబల్స్ స్మూత్ క్యూ3, విబిల్ 2ను ఇటీవల ఆవిష్కరించింది. జియూన్ అందిస్తోన్న జింబల్లో త్రీ-యాక్సిస్, రొటేటబుల్ ఫిల్ లైట్, 17 స్మార్ట్ టెంప్లేట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు 4300k వార్మ్ టోన్డ్ ఇంటిగ్రేటెడ్ ఫిల్ లైట్, మూడు లెవల్స్‌లో బ్రైట్ అడ్జస్ట్మెంట్, ఫ్రంట్, రియర్ లైటింగ్ కోసం 180° టచ్ బటన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటి సాయంతో తక్కువ వెలుతురులోనూ నాణ్యమైన వీడియోలను మరిన్ని యాంగిల్స్‌లో తీసే వీలు కలుగుతుంది. స్మూత్-క్యూ3 యూజర్లు స్మార్ట్ టెంప్లేట్స్, అడ్వాన్స్డ్ ఎడిటర్ వంటి కొత్త ఫీచర్లతో గతంలో కంటే అధిక విధాలుగా ఇప్పుడు తమ స్టోరీలు క్యాప్చర్ చేయవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. స్మార్ట్ఫోన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్మూత్ క్యూ3 అన్ని ప్రధాన ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లను సపోర్టు చేస్తుంది. కంటెంట్ క్రియేటర్లు, ఇతరులకు మెరుగైన క్వాలిటీ అందిస్తుంది. కొత్త ప్రొడక్టు ఆవిష్కరణ సందర్భంగా జియూన్ ఇండియా ప్రతినిధి మయాంక్ చచ్రా మాట్లాడుతూ... భారతీయ మార్కెట్ నుంచి మాకు మంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రస్తుతం మా బ్రాండ్ నుంచి 11 ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్యను 15 పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. చదవండి : Xiaomi Smart Glasses: మాట్లాడేందుకు కళ్ల జోళ్లొస్తున్నాయ్ -
వినోదానికి తెర
పాత గుంటూరు: సామాన్యుడికి వినోదం పంచే సినిమాకు తెర పడింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు థియేటర్ యజమానులు, పంపిణీదారులు, నిర్మాతలు ఉద్యమబాట పట్టి బంద్‌కు పిలుపునివ్వడంతో సినిమా హాళ్లు మూతబడ్డాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడిన వేలాదిమంది ఉపాధి దెబ్బతింది. డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు వసూలు చేసే ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ దక్షిణ భారత చిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు థియేటర్ యాజమాన్యాలు బంద్‌ను పాటిస్తున్నాయి. ఈనెల 2వ తేదీ నుంచి జిల్లాలోని 200 థియేటర్లు మూతబడ్డాయి. ఈనెల 9 వరకు బంద్ కొనసాగనుందని తెలిసింది. బంద్ ఎందుకు చేయాల్సి వచ్చింది? గతంలో సినిమాలను మనందరికీ తెలిసిన రీల్ ఫార్మెట్లో ప్రొజెక్టర్ల ద్వారా ప్రదర్శించేవారు. 12 ఏళ్ల కిందట డిజిటల్ సినిమా రంగప్రవేశం చేసింది. ల్యాబ్ నుంచి ప్రింట్ తెచ్చుకునే అవసరం లేకుండా హార్డ్ డిస్క్‌ను తెచ్చుకుని డిజిటల్ ప్రొజెక్టర్‌లో పెట్టి సినిమా వేసుకునే పరిజ్ఞానం వచ్చింది. ఈ టెక్నాలజీని తీసుకొచ్చిన వారిని డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు(డీఎస్పీ)లుగా వ్యవహరిస్తున్నారు. వీరు దేశమంతటా తమ టెక్నాలజీని దశల వారీగా అమర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు దేశంలో ఎక్కడా రీల్ ఫార్మెట్ లేదు. డిజిటల్ టెక్నాలజీ వచ్చిందని థియేటర్ యజమానులు ప్రొజెక్టర్లను తీసి పక్కన పడేశారు. ఇదే డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లకు వరంగా మారింది. ఏకస్వామ్య విధానం అమలుచేయడానికి అవకాశం లభించింది. థియేటర్లలో అమర్చిన డిజిటల్ ప్రొజెక్టర్ల అద్దెను క్రమంగా కంపెనీలు పెంచుకుంటూ వెళ్లిపోయాయి. ఈ ఫీజు థియేటర్ యాజమాన్యాలకు భారంగా మారింది. దేశంలో డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు అయిన యూఎఫ్ఓ, క్యూబ్ కంపెనీలు మొండిగా వ్యవహరిస్తున్నాయి. అంతా వారి చేతుల్లోనే ఉండటంతో థియేటర్ల యాజమాన్యాలు కూడా మౌనంగా ఉండిపోయారు. డీఎస్పీలు అద్దెలు, చార్జీలను ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. ఒక్కో చోట ఒకలా వున్నాయి. ఇంగ్లిష్ సినిమాలకు ఎక్కడా వర్చువల్ ప్రింటింగ్ ఫీజు లేదు.. మనకు కూడా లేదు. ఉత్తరాదిలో హిందీ సినిమాలపై మన దగ్గర వసూలు చేస్తున్న ఫీజులో 50 శాతం మాత్రమే వసూలు చేస్తున్నారు. అదే సినిమా మన వద్ద వేస్తే వంద శాతం వీపీఎఫ్ చెల్లించాలి. ఉత్తరాదిలో అన్నీ హిందీ సినిమాలే కాబట్టి ఫీజు తక్కువగా వుంది. మన తెలుగు చిత్రాలకు పూర్తి ఫీజు చెల్లించాలి. ఈ ద్వంద్వ వైఖరిని దక్షిణాది నిర్మాతలు, పంపిణీదారులు వ్యతిరేకించారు. జేఎసీగా ఏర్పడి డిజిటల్ ప్రొజెక్టర్ అద్దె, వీపీఎఫ్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకటనల ఆదాయంపై బాదుడే ఈ డీఎస్పీలు నిర్మాతలు, పంపిణీదారుల నుంచి వసూలు చేసే వీపీఎఫ్ కాకుండా థియేటర్ యజమానుల నుంచి రెండురకాలుగా లబ్ధి పొందుతున్నాయి. అందులో ఒకటి డిజిటల్ ప్రొజెక్టర్ అద్దె కాగా, మరొకటి ప్రకటనల ఆదాయం. సినిమా థియేటర్లలో ప్రదర్శనకు ముందు, ఇంటర్వెల్ తర్వాత వేసే ప్రకటనల ఆదాయం మొత్తం డీఎస్పీలే తీసుకుంటున్నాయి.అందులో నామమాత్రంగా 10 నుంచి 15 శాతం మాత్రమే యాజమాన్యాలకు ఇస్తున్నారు. ప్రకటన సైజు తెలుపకుండానే నచ్చినంత సేపు వేసుకుంటూ యాజమాన్యాలకు నష్టాలు కలిగించడంతో పాటు ప్రేక్షకులను ఇబ్బందిపెడుతున్నారు. డిజిటల్ ప్రొజెక్టర్ల అద్దె ఇలా... నగరంలోని 4కె థియేటర్లు డిజిటల్ ప్రొజెక్టర్లకు వారానికి రూ.13,600 చెల్లిస్తున్నాయి. సాధారణ థియేటర్లు వారానికి రూ.10,300 చెల్లిస్తున్నాయి.వీటితో పాటు వీపీఎఫ్ నెలకు రూ.15 నుంచి రూ. 20 వేలకు వరకు చెల్లిస్తున్నాయి. -
పంచాయతీ @ ఆన్లైన్
విశాఖ రూరల్ : జిల్లాలో 925 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం కార్యకలాపాలన్నీ పేపర్లు, రికార్డులు ఆధారంగా జరుగుతున్నాయి. గ్రామాల్లో ఎక్కడెక్కడ ఎంత వ్యయం జరిగింది, చేపట్టిన కార్యక్రమాలను వెంటనే తెలుసుకొనే అవకాశం లేకుండా ఉంది. అలాగే ప్రజలకు అవసరమైన సేవలకు కూడా తాత్సారం జరుగుతోంది. ఇటువంటి ఇబ్బందులను అధిగమించడంతో పాటు ఆన్లైన్ ద్వారా ఎక్కడ నుంచైనా పంచాయతీ కార్యకలాపాలను సులువుగా తెలుసుకొనేందుకు వీలుగా కంప్యూటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన వనరులకు నిధులు మంజూరు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి కాని పక్షంలో మున్ముందు 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసేది లేదని ఆంక్షలు విధించింది. అయితే బీఎస్ఎన్ఎల్ నుంచి ఇంటర్నెట్ మోడంలు రాకపోవడంతో ఈ ప్రక్రియకు జాప్యం జరుగుతోంది. 150 కంప్యూటర్లు సిద్ధం : తొలి దశలో జిల్లాకు 150 కంప్యూటర్లను మంజూరు చేశారు. జిల్లాలో ఉన్న 925 పంచాయతీలను 565 కస్టర్లుగా విభజించారు. దీని ప్రకారం ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో కంప్యూటర్ను కేటాయించనున్నారు. అలాగే ప్రస్తుతానికి 60 మంది కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. వీరి నియామక బాధ్యతలను కేంద్రం ప్రైవేటు ఏజెన్సీ సంస్థ కార్వీకి అప్పగించింది. కంప్యూటరీకరణకు అవసరమైన ఇంటర్నెట్ మోడం కోసం ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే అన్ని సంఖ్యలో మోడంలు లేవని చెప్పడంతో ఈ ప్రక్రియకు జాప్యం జరుగుతోంది. మోడంలు వచ్చిన వెంటనే కంప్యూటరీకరణ పనులు ప్రారంభించనున్నారు. పంచాయతీల ఆదాయ, వ్యయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే నిధులు, వాటి వినియోగం, చేపట్టిన కార్యకలాపాలు, పన్నుల రాబడులతో పాటు ప్రజల జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఇలా పంచాయతీ పరిధిలో చేపడుతున్న అన్ని కార్యక్రమాలను కంప్యూటర్లో నిక్షిప్తం చేయనున్నారు. ఈ కంప్యూటరీకరణ ద్వారా పంచాయతీలకు విడుదలవుతున్న నిధులు, ఖర్చులు ఆధారంగా భవిష్యత్తులో కేటాయింపులు చేయడానికి అవకాశముంటుందని కేంద్రం భావిస్తోంది. మీ-సేవతో అనుసంధానం కంప్యూటరీకరణ పూర్తయిన వెంటనే మీ-సేవతో అనుసంధానం చేయనున్నారు. దీంతో ప్రజలు పంచాయతీల ద్వారా పొందాల్సిన అన్ని సేవలను కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మీ-సేవ కేంద్రాల ద్వారానే పొందే అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయని పక్షంలో భవిష్యత్తులో 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయని కేంద్రం ఆంక్షలు విధించింది. దీంతో మోడంలు వచ్చిన వెంటనే కంప్యూటరీకరణను ప్రారంభించాలని అధికారులు భావి స్తున్నారు.