సాక్షి, బాపట్ల: హేతువాది మాసపత్రిక సంపాదకుడు రావిపూడి వెంకటాద్రి(101) ఇక లేరు. శనివారం మధ్యాహ్నం 3గంటలకు చీరాలలో కన్నుమూశారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం నాగండ్లలో పుట్టిన రావిపూడి వెంకటాద్రి.. మూఢ నమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ప్రజలను చైతన్యపరిచేందుకు చివరిదాకా ప్రయత్నించారు.
మానవులకు మార్గదర్శిగా హేతువాదం చేయూతనిస్తోందనీ, మూఢనమ్మకాలతో సతమతమవుతోన్నవారికి వెలుగు చూపుతోన్నదని వెంకటాద్రి బలంగా నమ్మారు. ప్రశ్నించే వారంతా హేతువులను కోరుతున్నట్లే లెక్కేనని, దీనికి ఒక మతం ఉండదని చెబుతారు. కనిపించని దేవుడికంటే కనిపించే సాటి మనిషిని ప్రేమించమని చెప్పే రావిపూడి.. దాదాపు 80 పుస్తకాలు రాశారు.
నాస్తికత్వం, ర్యాడికల్ హ్యుమనిజం, హేతువాదం, మతతత్వం, మానవవాదంల మీద ప్రధానంగా రాసిన పుస్తకాలలో కొన్ని విమర్శలకు గురయ్యాయి. మరికొన్ని ప్రజలకు దగ్గరయ్యాయి. ఎం.ఎన్. రాయ్ భావాలకు ఆకర్షితులైన రావిపూడి కొన్నాళ్లు ర్యాడికల్ డెమోక్రటిక్ పార్టీలో చేరారు. కొన్నాళ్లు రాజకీయాల్లోనూ ఉన్నారు. దాదాపు 4 దశాబ్దాల పాటు నాగండ్ల గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు.
సంబంధిత వార్త: వంద వసంతాల హేతువాది.. రావిపూడి
Comments
Please login to add a commentAdd a comment