హేతువాదమే మౌఢ్యానికి విరుగుడు | ABK Prasad Guest Column On Popular Rationalist Ravipudi Venkatadri | Sakshi
Sakshi News home page

హేతువాదమే మౌఢ్యానికి విరుగుడు

Published Tue, Jan 24 2023 12:59 AM | Last Updated on Tue, Jan 24 2023 5:41 AM

ABK Prasad Guest Column On Popular Rationalist Ravipudi Venkatadri - Sakshi

భారత హేతువాద సంఘాధ్యక్షుడు రావిపూడి వెంకటాద్రి తన 101వ సంవత్సరంలో పరమపదించారు. హేతువాదాన్నీ, మానవతావాదాన్నీ వ్యాపింప జేయడానికి దశాబ్దాలుగా వేలకొలదీ పేజీల ద్వారా అనంతమైన కృషి సల్పిన హేతువాది ఆయన. బౌద్ధాన్నీ, దాని హేతువాద దృక్పథాన్నీ నాశనం చేయడం కోసం రాజకీయ ఆధిపత్యం చలాయించిన శక్తుల దుర్మార్గాన్ని చారిత్రకాధారాలతో నిరూపించారు.

అసహనం, ద్వేషాల వల్ల మత విశ్వాసాలు మారవని ఆయనకు స్పష్టంగా తెలుసు. మతమౌఢ్యం మారాలంటే మానసిక పరివర్తన రావాలనీ, అది చాలా నిదానమైన క్రమమనీ అంటారు. మను షుల్లో ఉన్న వివేచనా జ్ఞానాన్ని పని చేయించడం ద్వారానే మౌఢ్యాన్ని రూపుమాపవచ్చునన్నది హేతువాదుల నిశ్చితాభిప్రాయమని చెబుతారు.

‘‘వైజ్ఞానిక పునాదుల పైన, శాస్త్రీయ పరి జ్ఞానం పైన మాత్రమే మానవుల సుఖసంతో షాలు ఆధారపడి ఉంటాయి.’’
– స్వతంత్ర భారత తొలి ఉప రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణ

కొన్ని శతాబ్దాల క్రితం వేమన, బద్దెన ఏ నీతులు శతక వాఙ్మయం ద్వారా బోధించారో వాటికి కాలం గడిచిన కొలదీ విలువ పెరుగు తూనే ఉంది. మూఢ విశ్వాసాల నుంచి ప్రజా బాహుళ్యానికి కొంత విమోచన వచ్చినా– పాలక శక్తుల ప్రాపకంతో సమాజంలో పెరు గుతూ వచ్చిన కుల, మత శక్తుల నుంచి విమోచన ఇంకా ప్రజలకు దూరంగానే ఉంది.  ఎనిమిది దశాబ్దాలుగా తెలుగు ప్రజల్ని హేతువాదం ద్వారా నిరంతరం చైతన్యంతో రగిలించిన భారత హేతువాద సంఘాధ్య క్షుడు, ‘హేతువాది’ పత్రిక ప్రధాన సంపాదకులు, దార్శనికుడు రావి పూడి వెంకటాద్రి తన 101వ సంవత్సరంలో పరమపదించారు.

నిష్క ల్మష హృదయంతో జీవితం సహేతుక పద్ధతిలో గడిపితే వ్యక్తి మనస్సు ముదిమిని జయిస్తుందని తన జీవితం ద్వారా నిరూపించారు వెంకటాద్రి. సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమాలు, భారతీయ తత్వ దర్శనాలు, సత్యాన్వేషణ, ఆస్తికత్వం, నాస్తికత్వం, హేతుత్వం, మత తత్వం – ఆయన అన్వేషణా రంగాలు. హేతువాదాన్నీ, మానవతా వాదాన్నీ వ్యాపింపజేయడానికి వేలకొలదీ పేజీల ద్వారా వందలాది సంపుటాల ద్వారా అనంతమైన కృషి సల్పిన విస్పష్ట తొలి తెలుగు హేతువాది ఆయన.

మహాకవి గురజాడ అప్పారావు 110 సంవత్సరాల నాడే – దేశవ్యాపితంగా ఖ్యాతి గడించిన బౌద్ధ ధర్మాన్ని కుల, మత స్వార్థపర వర్గాలు భారత సరిహద్దుల నుంచి ఎలా తరిమికొట్టాయో చెప్పారు. దేశంలోని బౌద్ధ ధర్మ, హేతువాద పీఠాల్ని బలవంతంగా కూల్చి, వాటి స్థానే హేతువాద విరుద్ధ క్షేత్రాలకు పాలకులు ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ‘క్రీ.శ. రెండు, మూడు శతాబ్దాల నాటికే’ కుల, మత వ్యవస్థకు పునాదులు గట్టిపరచుకొనే శక్తులకూ, బౌద్ధానికీ మధ్య జరిగిన సంఘర్షణకు ఆంధ్రలోని శ్రీ పర్వతమే కేంద్రం; బౌద్ధేతర శక్తులు బౌద్ధ భిక్షువులను వారి ఆరామాల నుండి బలవంతంగా బహి ష్కరించి, నాగార్జున కొండ వద్ద ఉన్న బౌద్ధారామాలను, విహారాలను ఎలా స్వాధీనం చేసుకున్నారో రావిపూడి వెంకటాద్రి నిరూపణలతో రుజువు చేశారు.

క్రీస్తుపూర్వం శుంగుల కాలం నుంచి క్రీ.శ. ఏడవ శతాబ్దం దాకా బౌద్ధాన్నీ, దాని హేతువాద దృక్పథాన్నీ నాశనం చేయడం కోసం రాజకీయ ఆధిపత్యం చలాయించిన శక్తుల దుర్మా ర్గాన్ని చారిత్రకాధారాలతో రావిపూడి నిరూపించారు. చైనా యాత్రికు లైన– క్రీ.శ. 4వ శతాబ్దంలో మన దేశాన్ని సందర్శించిన ఫాహియాన్‌ గానీ, 7వ శతాబ్దం నాటి హ్యుయాన్‌ త్సాంగ్‌ గానీ బౌద్ధుల మీద జరిగిన అనేక దాడుల వివరాలను ఎలా పేర్కొన్నారో వివరించారు.

హేతువు మీద ఆధారపడి వర్ధిల్లిన లోకాయత, చార్వాక, బౌద్ధాది దర్శనాల్లోని హేతుబద్ధ భారతీయ తత్వాన్ని పతనం చేసిన తరు వాతనే భావవాదం, ఛాందసవాదానికి కొమ్ములు మొలవడం ప్రారంభించాయని రావిపూడి ఉదాహరించారు. సుప్రసిద్ధ చరిత్రకారుడు లక్ష్మీనరసు తన ‘బౌద్ధం అంటే ఏమిటి?’ గ్రంథంలో బౌద్ధ ధర్మసారం వివరించారు. ఆ సారాంశాన్ని ఆయన బుద్ధుని మాటల్లోనే చెప్పారు: ‘‘నేను బోధించే ధర్మం అందరి పట్ల సమాన ఆదరణ కల్గిన ధర్మం. దీన్ని మన, తన భేదం లేకుండా అందరికీ బోధించండి.

ఇది మంచివారిని, చెడ్డవారిని, సంపన్నులను, పేదలను ఒకే విధంగా విముక్తి చేస్తుంది. దీని నుంచి ఎవరికీ ఎలాంటి మినహాయింపూ లేదు. కరుణామయులైనవారు తమను మాత్రమేగాక, ఇతరులనూ విముక్తి చేయాలని కోరుకుంటారు. ఎందరినో విముక్తి చేసినా, చెయ్యవల సింది మరెంతో ఉంటుంది. ఇది నిరంతరం కొనసాగవలసిన ప్రక్రియ. ఈ ధర్మం ప్రపంచమంతా వ్యాపించి దుఃఖసాగరంలో మునిగిన  అందరినీ రక్షించాలి.’’

ప్రాచీన కాలంలోనే విజ్ఞాన కాంతుల్ని వెదజల్లుతూ, సంఘంలోని అజ్ఞానాంధకారాలను బట్టబయలు చేయడానికి బయల్దేరిన భావ విప్ల వోద్యమం వెయ్యేళ్లకుపైగా వర్ధిల్లి జన్మించిన భారతదేశంలోనే అడుగంటిపోవడం ఎంతటి విషాదకర పరిణామమో అంటారు రావిపూడి  వెంకటాద్రి. ఇక కాలక్రమంలో బౌద్ధంలో చొరబడిన విగ్రహారాధన, పునర్జన్మ, కర్మ సిద్ధాంతాల వంటి మత వాసనలు కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ బౌద్ధాన్ని స్వీకరించడంతో తొలగిపోయి హేతువాద, మానవతావాదాలపై ఆధారపడిన సిసలైన బౌద్ధం వర్ధిల్లాలని రావిపూడి ఆశించారు. అందుకే ఒక సందర్భంలో ఇలా స్పష్టీకరించారు: ‘‘ఒక మతం వేరొక మతాన్ని ద్వేషిస్తుంది. కానీ హేతువాదం మతాలన్నింటినీ సమంగా నిరాకరిస్తుంది. అసహనాన్నీ, ద్వేషాన్నీ ప్రదర్శించదు.

అసహనం, ద్వేషాల వల్ల మత విశ్వాసాలు మారవని హేతువాదులకు తెలుసు. మతమౌఢ్యం మారాలంటే మానసిక పరివర్తన రావాలనీ, అది చాలా నిదానమైన క్రమమనీ హేతువాదులకు తెలుసు. ఆంక్షల వల్ల, నిర్బంధాల వల్ల, నిరంకుశ నిషేధాల వల్ల మత తత్వం అణగిపోదనీ హేతువాదులకు తెలుసు. కనుకనే మనుషుల్లో ఉన్న వివేచనా జ్ఞానాన్ని పని చేయించడం ద్వారా మాత్రమే ఏ విధమైన మౌఢ్యాన్ని అయినా రూపుమాపవచ్చుననీ హేతువాదుల నిశ్చితా భిప్రాయం’’.

అంతేకాదు– ‘‘జాతి, మత, కుల, వర్గ ప్రాతిపదికల మీద మనం ఆధారపడితే – విజ్ఞానం, తత్వం, స్వేచ్ఛ, సమత, న్యాయం, సౌభ్రా తృత్వం ప్రాతిపదికలుగా నిర్ణయించవలసిన మానవతావాద నీతి దుర్లభమవుతుంది. మానవులంతా ఒకటే అనుకున్నప్పుడు, మాన వుల మధ్య విభిన్నమయిన నీతులు ఉండటానికి వీల్లేదు... అంతే గాదు, నేటి జాతులన్నీ రక్త సాంకర్యం పొందినవే. సిద్ధాంత సాంకర్యం పొందినవే. వర్గాలన్నీ ఆర్థిక స్థాయీ సాంకర్యం పొంది ఉన్నవే.

అందువల్ల భిన్న జాతి, మత వర్గాల మధ్య స్పష్టమైన విభజన రేఖ గీయడం సాధ్యం కాదు. అందువల్ల జాతి, మత వర్గాల పేర్లతో మనుషుల్ని విభజించడం హేతువిరుద్ధం. అలాంటి హేతు విరుద్ధమైన విభజనను సృష్టించినవారు ఆయా కాలాల్లో పాలక వర్గాలుగా (శాసకులుగా) పెంపొందిన బాపతే. వారు చిరంతన సత్యాలుగా పేర్కొన్న సిద్ధాంతాలన్నీ మానవుణ్ణి పెంపుడు జంతువుగా, సిద్ధాంతదాసుడిగా, డూడూ బసవన్నగా తయారు చేయడానికే దారి తీశాయి. కానీ, మనిషి పెంపుడు జంతువు కావడానికి స్వభావతః ఇష్ట పడడు కనుకనే ఎప్పటికప్పుడు వ్యవస్థీకృత సిద్ధాంతాల మీద తిరుగు బాటు చేస్తూ వచ్చాడు. అదే– భావ విప్లవమంటే’’ అన్నది రావిపూడి మాట! 

అందుకే కారల్‌ మార్క్స్‌ మహనీయుడు ‘మతం మత్తుమందు’ అని ఏనాడో నిర్వచించి పాఠం చెప్పవలసి వచ్చింది. ‘విజ్ఞానాభి వృద్ధితో పాటు పరిణామం చెందే ఆలోచనా వైఖరిగానే హేతువాదం వన్నె తేలుతుందనీ, ఆలోచనలోనూ, ఆచరణలోనూ హేతువాదం ఒక ఉద్యమమ’నీ వేయి విధాల నిరూపిస్తూ వచ్చాడు రావిపూడి 
వెంకటాద్రి! కనుకనే ఓ కవి కుమారుడున్నట్టు–
‘‘కలవరపడి వెనుదిరిగితె కాలం ఎగబడుతుంది
కదనుతొక్కి చెలరేగితే కాలం భయపడుతుంది
కర్మయోగి ఎన్నడూ కాలాధీనుడు కాదు –
కనురెప్పలు మూతపడితె కాలం జోకొడుతుంది
కంఠమెత్తి తిరగబడితే కాలం జేకొడుతుంది!’’
ఆఖరి శ్వాసలో కూడా స్థూలంగా అదే రావిపూడి తీర్మానం కూడా!


-ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement