ఓ జ్ఞానజ్యోతీ, భారత రాజ్యాంగ నిర్మాతా, ప్రపంచ మేధావీ అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును కోనసీమకు పెట్టడంలో ఒక చారిత్రక నేపథ్యం ఉంది. అంబేడ్కర్ స్వయంగా తూర్పుగోదావరి ప్రాంతమంతా పర్యటించారు. ఈ ప్రాంతమంతా చారిత్రకంగా బౌద్ధ భూమి. ఇక్కడ వేల సంవత్సరాలు బౌద్ధం విరాజిల్లింది. అందుకే ఇక్కడ సామాజిక సామరస్యం ఎక్కువ. సర్ ఆర్థర్ కాటన్ మహోన్నతమైన కృషి వల్ల ఇక్కడ వ్యవసాయ విస్తరణ జరిగింది. ప్రాజెక్టుల నిర్మాణంలోనూ, బ్యారేజీల నిర్మాణంలోనూ, నీటిపారుదల కాల్వల నిర్మాణంలోనూ ప్రజలందరూ కులమత భేదాలు లేకుండా భాగస్వాములయ్యారు. ఇక్కడ భాష కూడా అందరూ ఒకే రకంగా కుల మతాలకు అతీతంగా మాట్లాడతారు. ఊనికలు ఒకే రకంగా ఉంటాయి. ఇక్కడ కులాలు రూపొందాయి కానీ కులాలు లేవు. అంబేడ్కర్ స్ఫూర్తితో ఇక్కడ విద్య వికసించింది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరులో వ్యక్తిత్వ నిర్మాణం ఉంది. విద్యా వికాసం ఉంది. ప్రపంచ జ్ఞానం ఉంది. ముఖ్యంగా ఆత్మగౌరవం ఉంది. బౌద్ధ సంస్కృతీ వికాసం ఉంది. సామాజిక సమతుల్యత ఉంది. ఆర్థిక సముత్తేజం ఉంది. కుల నిర్మూలన ఉంది. అంబేడ్కర్ పేరు వలన కోనసీమకే కీర్తి వస్తుంది. అంబేడ్కర్‌ది అంతర్జాతీయ నామవాచకం. అందుకే కోనసీమకు అంబేడ్కర్ పేరు ఉచితమై నది. ఆ పేరును భారతదేశంలో ఎక్కువ విశ్వవిద్యాలయాలకు పెట్టారు. భారత దేశంలో ఉన్న ఏడు లక్షల గ్రామాల్లో ఎక్కువ గ్రామాలకు పెట్టిన పేరు అంబేడ్కర్. ఆయన నామవాచకంలో విద్యా, సాంస్కృతిక వికాసం ఉంది. అంబేడ్కర్ కుల నామవాచకం కాదు. కుల నిర్మూ లనా ప్రతీక! అది మతాలకు, కులాలకు సంబంధం లేని జాతీయ స్ఫూర్తిని కలిగిస్తుంది.
అంబేడ్కర్ విగ్రహాన్ని లండన్‌లోని ‘ఇండియన్ హౌస్’లో రూపొందించుకున్నారు. నేను స్వయంగా వీక్షించాను. ఆ విగ్రహ సమక్షంలో నా రచన ‘కాస్ట్ అండ్ ఆల్టర్నేటివ్ కల్చర్’ పుస్తకాన్ని వీపీ సింగ్ ఆవిష్కరించారు. లండన్ మ్యూజియం లైబ్రరీలో అంబేడ్కర్ చిత్ర పటం ఉంది. అదీ నేను స్వయంగా వీక్షించాను. లండన్ ‘హౌస్ ఆఫ్ కామన్స్’లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ శత జయంతి చేశారు. దానికి నేను హాజరయ్యాను. అంబేడ్కర్ నామవాచకం బుద్ధుని తర్వాత, అశోకుని తర్వాత భారతదేశ ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచింది.
నిజానికి కోనసీమ ప్రేమసీమ! ఇక్కడ అంబేడ్కర్ పేరు పెట్టినందుకు వచ్చిన ఆవేశం నీటి తుంపరల నుండి వచ్చిన అగ్నిచ్ఛట లాంటిది. కొన్నిసార్లు ఆవేశం అనర్థానికి దారి తీస్తుంది. ప్రతి ఆవేశం వెనుక కొన్ని రాజకీయ కారణాలుంటాయి. ఈ రాజకీయ కారణాలకు అతీతమైన వాడు అంబేడ్కర్. భారతదేశాన్ని కులరహిత సమాజంగా తీర్చిదిద్దాలనుకున్నవారు. సమాజ పరిణామంలో కులం ఇటీవల వచ్చింది. మళ్లీ అది పోతుంది. కుల భావనకు విరుగుడు జ్ఞానార్జనే అని అంబేడ్కర్ చెప్పారు. మను షులకు మనుషులు పుడతారనేది జ్ఞానం. కులాలకు మనుషులు పుట్టరనేదే తత్త్వం. మామూలు మనుషులు, ప్రతిభ లేని మనుషులు కులం పేరు చెప్పుకుని బతకాలని చూస్తారు. కులానికి అతీతమైన నామవాచకాలు ఇప్పుడు దేశానికి అవసరం.
అంబేడ్కర్‌ను మహాత్మా గాంధీ ‘డాక్టర్’ అని పిలిచారు. ఆనాటి ప్రజా సమూహాలు అంబేడ్కర్‌ను ‘బాబా సాహెబ్’ అని పిలిచాయి. అంటే తండ్రి అని అర్థం. పెరియార్ రామస్వామి నాయకర్ అంబేడ్కర్‌ను ‘బాబా సాహెబ్’ అనే ప్రస్తావించారు. ఆయన భారతదేశానికి తండ్రి స్థాయికి బతికి ఉన్నప్పుడే ఎదిగారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అంబేడ్కర్ మరణించినప్పుడు ‘భారత దేశ ధ్రువతార’ రాలిపోయిందని అన్నారు.
అంబేడ్కర్ ఐదు లక్షల మందితో 1956 అక్టోబర్‌లో పూనాలో జరిపిన బౌద్ధ దీక్షకు కోనసీమ నుండి ఆ రోజుల్లోనే ప్రతినిధులు విస్తృతంగా హాజరయ్యారు. ఆయన అందరి మెదళ్లలో దీపాలు వెలిగిస్తూ వెళ్ళారు. కానీ మీరు భవంతులు తగలబెడుతున్నారు. తగలబడిన ప్రతి భవంతీ కొత్తరూపం తీసుకుంటుంది. అంబేడ్కర్ భావజాలంతో మీలో మార్పు రావాలి. నీకు తిరగబడే చైతన్యాన్నిచ్చిన వాడు కూడా ఆయనే అని ముందు గుర్తించాలి. భేదాభిప్రాయాల్ని సదభిప్రాయంగా మార్చు కోవడమే అంబేడ్కరిజం.
సుప్రసిద్ధ నరవర్గ శాస్త్రవేత్తల ప్రకారం భారతదేశం క్రీస్తు పూర్వమే ఆర్యుల, ద్రావిడుల, మంగోలుల, సిథియన్ల, మూలవాసుల సమ్మిశ్రితం. అందుకే అంబేడ్కర్... భారతదేశంలో ప్రతి ఒక్కరూ సంకరం నుండి ఆవిర్భవించిన వారే అని చెప్పారు. నిర్దిష్ట కులం లేదని చెప్పారు. ఇప్పుడు కులాతీత జీవనంతో ఉన్న రాజకీయ నాయకులు, కులాంతర వివాహితులు, ఆర్థిక సంపన్నులు, లౌకిక భాషాభివ్యక్తులై ఉండి కూడా.. కులం పునాదుల మీద రాజకీయాలు నిర్మించాలనుకోవడం అపహాస్యమే! కులం మనిషిని సంకుచితుణ్ణి చేస్తుంది. కులం భావావేశాలను రెచ్చగొడుతుంది. దాని ఫలితమే ప్రస్తుతం కోనసీమలో నెలకొన్న పరిస్థితులు. (క్లిక్: మళ్లీ మొదటికొచ్చిన కశ్మీర్ సమస్య)
భారత దేశ చరిత్రలో గానీ, సాహిత్యంలో గానీ 500 సంవత్సరాల పూర్వం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆధిపత్య కులాలేమీ లేవు. అన్నీ ఆయా కాలాల్లో రూపొందిన కులాలే. ఇప్పుడు మనకు కావల్సింది అంబేడ్కర్ ప్రజాస్వామ్య లౌకికవాద ఆచరణ. ఆ స్ఫూర్తితోనే మనం ఆయన నామవాచకాన్ని బహుదా మననం చేసుకుంటున్నాం. కోనసీమకు అంబేడ్కర్ పేరు ఒక లేత సూర్య కాంతి. అంబేడ్కర్ పేరులో చైతన్య జ్వలనం ఉంది. అందుకే ఆ పేరు పాటలుగా, మాటలుగా, సూక్తులుగా, నిర్వచనాలుగా, జీవన గాథలుగా విస్తరిస్తోంది. అందుకే అంబేడ్కర్ పేరును ఆహ్వానిద్దాం! ఆకాశ నక్షత్రాలుగా వెలుగొందుదాం! (క్లిక్: కరోనా కాదు.. అసమానతే.. అసలు వైరస్!)
- డాక్టర్ కత్తి పద్మారావు
దళిత ఉద్యమ నిర్మాత
Comments
Please login to add a commentAdd a comment