ఆధునికతకు అంబేడ్కరిజాన్ని జోడించాలి | Ambedkarism Should Added to Modernity: Professor James Stephen | Sakshi
Sakshi News home page

ఆధునికతకు అంబేడ్కరిజాన్ని జోడించాలి

Published Wed, Jan 4 2023 12:31 PM | Last Updated on Wed, Jan 4 2023 12:31 PM

Ambedkarism Should Added to Modernity: Professor James Stephen - Sakshi

యువతరాన్ని అంబేడ్కర్‌తో అనుసంధానం చేయాలి. వాస్తవిక సమాజ పరిస్థితులను దగ్గరగా పరిశీలిస్తూ యుక్తవయసులోనే విప్లవాత్మకమైన ఆలోచనలు చేసిన వ్యక్తి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌. అత్యధిక ఆదాయాన్ని సంపాదించిపెట్టే వృత్తిగా నిలచే బారిష్టర్‌ను చదివే అవకాశం ఉన్నా, సమాజానికీ, దేశానికీ ఉపయుక్తంగా నిలచే అర్థశాస్త్రాన్ని కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పూర్తిచేసిన ఆయన వ్యక్తిత్వం నేటి తరానికి అవగతం కావా ల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్‌ని ఒక రివల్యూషనరీ థింకర్‌గా చెప్పవచ్చు.

అంబేడ్కర్‌ ఆలోచనలే పునాదిగా ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ స్థాపన జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అగ్ర రాజ్యాల ఆర్థిక వ్యవస్థలు సైతం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా... భారతీయ ఆర్థిక వ్యవస్థ చెక్కుచెదరకుండా తగిన సుస్థిరత్వాన్ని కలిగి ఉందంటే అలా ఉండటానికి అంబేడ్కర్‌ ఆలోచనలు, ప్రయత్నాలు సఫలీ కృతం అయ్యాయనే అర్థమవుతుంది. ఎకనామిక్స్‌లో చదువు పూర్తయిన తర్వాత మాత్రమే ఆయన  బారిష్టర్‌ చదువు కున్నారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుంచి పీహెచ్‌డీని పూర్తిచేసిన ఆయన ప్రతిభను ప్రస్తుత తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

భవిష్యత్‌ను దర్శించిన ఆలోచనలు అంబేడ్కర్‌ సొంతం. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత చైనా ఎప్పటికైనా భారత్‌కు ముప్పు తెస్తుందని గుర్తించిన వ్యక్తి అంబేడ్కర్, ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం చైనాకు బదులు భారత్‌కు వచ్చే విధంగా కృషిచేయాలని ఆయన చేసిన సూచనలను నాటి నేతలు పక్కన పెట్టడం అందరికీ తెలిసిందే. దీని పర్యవసానాలను చూస్తూనే ఉన్నాం.  ఇప్పటికే చైనా తన వీటో అధికారాన్ని భారత్‌కు వ్యతిరేకంగా 9 పర్యాయాలు వాడుకుంది.

వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించడం, పారిశ్రామికీకరణతో కలిగిన మార్పులు, ఎకనామిక్‌ హోల్డింగ్‌.. వంటి అంశాలు నేడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. కానీ వీటిని అంబేడ్కర్‌ 1927–28లోనే  ప్రస్తా వించారనే విషయం చాలా మందికి తెలియదు. 

అంబేడ్కర్‌ను కేవలం రాజ్యాంగ నిర్మాతగా మనం పిలుస్తుంటాం. ఆయన చేసిన పనుల్లో ఒకటిగా మాత్రమే ఇది నిలుస్తుంది. దీనితో పాటు దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులూ, స్థితిగతులపై సమగ్ర అవగాహనా, ఆలోచనా భవిష్యత్‌ ప్రణాళిక కలిగిన ఏకైక వ్యక్తిగా ఆయన్ని పేర్కొనవచ్చు. దేశాన్ని ఆధునికత, పట్టణీకరణ, పారిశ్రామికీకరణతో కూడిన నాగరికత కలిగి స్వయం సమృద్ది సాధించిన దేశంగా పునర్నిర్మించాలని ఆకాంక్షించిన ఏకైక తత్వవేత్త అంబేడ్కర్‌. 

అంబేడ్కర్‌ ఆలోచనలు, ఆకాంక్షలు, ఆశయాలను నేటి యువతలోనికి చొప్పించి భవిష్యత్‌ భారతావనిని పునర్నిర్మించే ప్రయత్నం జరగాలి. ఈ ప్రయత్నం చేసే దిశగా ఆంధ్ర విశ్వ విద్యాలయంలో నెలకొల్పిన ‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చైర్‌’ కృషిచేస్తుంది. గ్రంథాలయాలు, బ్యాంక్‌లు, తరగతులు, అభ్యసన విధానాలు, ఆర్థిక వ్యవస్థలు డిజిటల్‌ రూపంలోకి మారిపోయాయి. వీటినే ఆధారంగా చేసుకుని డిజిటల్‌ మాధ్యమాలను లాభదాయకంగా చేసుకుంటూ సమకాలీన యువతకు, సమకాలీన విధానాలతో అబేడ్కర్‌ ఆలోచనలు, తత్వాలను చేరువ చేసే విధంగా ఈ కేంద్రం పనిచేస్తుంది. సోషల్‌ సైంటిస్ట్‌లతో పాటు సోషల్‌ ఇంజనీర్స్‌ను సమ న్వయం చేస్తూ, సమ్మిళితంగా పనిచేస్తే సమస్యలకు సాంకేతికంగా పరిష్కారాలను చూపడం సాధ్యపడుతుంది. అంబేడ్కర్‌ను కేవలం సోషల్‌ సైన్స్‌ విభాగాలకే పరిమితం చేయకుండా టెక్నాలజీకి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది.

ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మసీతో పాటు ప్రొఫెషనల్‌ కోర్సులను అభ్యసిస్తున్న అన్ని విభాగాల విద్యార్థులను ఐక్యం చేస్తూ డిజిటల్‌ మాధ్యమాలు వేదికగా అంబేడ్కర్‌ను వైవిధ్యమైన కోణాలలో పరిచయం చేస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. (క్లిక్‌ చేయండి: ‘భీమా కోరేగావ్‌’ స్ఫూర్తితో పోరాడుదాం!)


- ఆచార్య ఎం. జేమ్స్‌ స్టీఫెన్‌ 
‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పీఠం’ ప్రొఫెసర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement