moderinization
-
ఆధునికతకు అంబేడ్కరిజాన్ని జోడించాలి
యువతరాన్ని అంబేడ్కర్‌తో అనుసంధానం చేయాలి. వాస్తవిక సమాజ పరిస్థితులను దగ్గరగా పరిశీలిస్తూ యుక్తవయసులోనే విప్లవాత్మకమైన ఆలోచనలు చేసిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. అత్యధిక ఆదాయాన్ని సంపాదించిపెట్టే వృత్తిగా నిలచే బారిష్టర్‌ను చదివే అవకాశం ఉన్నా, సమాజానికీ, దేశానికీ ఉపయుక్తంగా నిలచే అర్థశాస్త్రాన్ని కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పూర్తిచేసిన ఆయన వ్యక్తిత్వం నేటి తరానికి అవగతం కావా ల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్‌ని ఒక రివల్యూషనరీ థింకర్‌గా చెప్పవచ్చు. అంబేడ్కర్ ఆలోచనలే పునాదిగా ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ స్థాపన జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అగ్ర రాజ్యాల ఆర్థిక వ్యవస్థలు సైతం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా... భారతీయ ఆర్థిక వ్యవస్థ చెక్కుచెదరకుండా తగిన సుస్థిరత్వాన్ని కలిగి ఉందంటే అలా ఉండటానికి అంబేడ్కర్ ఆలోచనలు, ప్రయత్నాలు సఫలీ కృతం అయ్యాయనే అర్థమవుతుంది. ఎకనామిక్స్‌లో చదువు పూర్తయిన తర్వాత మాత్రమే ఆయన బారిష్టర్ చదువు కున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పీహెచ్‌డీని పూర్తిచేసిన ఆయన ప్రతిభను ప్రస్తుత తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్‌ను దర్శించిన ఆలోచనలు అంబేడ్కర్ సొంతం. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత చైనా ఎప్పటికైనా భారత్‌కు ముప్పు తెస్తుందని గుర్తించిన వ్యక్తి అంబేడ్కర్, ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం చైనాకు బదులు భారత్‌కు వచ్చే విధంగా కృషిచేయాలని ఆయన చేసిన సూచనలను నాటి నేతలు పక్కన పెట్టడం అందరికీ తెలిసిందే. దీని పర్యవసానాలను చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చైనా తన వీటో అధికారాన్ని భారత్‌కు వ్యతిరేకంగా 9 పర్యాయాలు వాడుకుంది. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించడం, పారిశ్రామికీకరణతో కలిగిన మార్పులు, ఎకనామిక్ హోల్డింగ్.. వంటి అంశాలు నేడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. కానీ వీటిని అంబేడ్కర్ 1927–28లోనే ప్రస్తా వించారనే విషయం చాలా మందికి తెలియదు. అంబేడ్కర్‌ను కేవలం రాజ్యాంగ నిర్మాతగా మనం పిలుస్తుంటాం. ఆయన చేసిన పనుల్లో ఒకటిగా మాత్రమే ఇది నిలుస్తుంది. దీనితో పాటు దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులూ, స్థితిగతులపై సమగ్ర అవగాహనా, ఆలోచనా భవిష్యత్ ప్రణాళిక కలిగిన ఏకైక వ్యక్తిగా ఆయన్ని పేర్కొనవచ్చు. దేశాన్ని ఆధునికత, పట్టణీకరణ, పారిశ్రామికీకరణతో కూడిన నాగరికత కలిగి స్వయం సమృద్ది సాధించిన దేశంగా పునర్నిర్మించాలని ఆకాంక్షించిన ఏకైక తత్వవేత్త అంబేడ్కర్. అంబేడ్కర్ ఆలోచనలు, ఆకాంక్షలు, ఆశయాలను నేటి యువతలోనికి చొప్పించి భవిష్యత్ భారతావనిని పునర్నిర్మించే ప్రయత్నం జరగాలి. ఈ ప్రయత్నం చేసే దిశగా ఆంధ్ర విశ్వ విద్యాలయంలో నెలకొల్పిన ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చైర్’ కృషిచేస్తుంది. గ్రంథాలయాలు, బ్యాంక్‌లు, తరగతులు, అభ్యసన విధానాలు, ఆర్థిక వ్యవస్థలు డిజిటల్ రూపంలోకి మారిపోయాయి. వీటినే ఆధారంగా చేసుకుని డిజిటల్ మాధ్యమాలను లాభదాయకంగా చేసుకుంటూ సమకాలీన యువతకు, సమకాలీన విధానాలతో అబేడ్కర్ ఆలోచనలు, తత్వాలను చేరువ చేసే విధంగా ఈ కేంద్రం పనిచేస్తుంది. సోషల్ సైంటిస్ట్‌లతో పాటు సోషల్ ఇంజనీర్స్‌ను సమ న్వయం చేస్తూ, సమ్మిళితంగా పనిచేస్తే సమస్యలకు సాంకేతికంగా పరిష్కారాలను చూపడం సాధ్యపడుతుంది. అంబేడ్కర్‌ను కేవలం సోషల్ సైన్స్ విభాగాలకే పరిమితం చేయకుండా టెక్నాలజీకి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మసీతో పాటు ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసిస్తున్న అన్ని విభాగాల విద్యార్థులను ఐక్యం చేస్తూ డిజిటల్ మాధ్యమాలు వేదికగా అంబేడ్కర్‌ను వైవిధ్యమైన కోణాలలో పరిచయం చేస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. (క్లిక్ చేయండి: ‘భీమా కోరేగావ్’ స్ఫూర్తితో పోరాడుదాం!) - ఆచార్య ఎం. జేమ్స్ స్టీఫెన్ ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పీఠం’ ప్రొఫెసర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం -
నెల్లూరు రైల్వేస్టేషన్‌కు ఆధునిక హంగులు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక సౌకర్యాలు, సరికొత్త హంగులతో నెల్లూరు రైల్వేస్టేషన్ అందుబాటులోకి రానుంది. ఈ స్టేషన్ ద్వారా రోజూ సుమారు 30 వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ దృష్ట్యా నెల్లూరు రైల్వేస్టేషన్‌ను రూ.102 కోట్లతో అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. గత ఆగస్టులో ఎస్సీఎల్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ సంస్థకు పనులు అప్పగించింది. 2024 మే నెలకల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్టేషన్లో పశ్చిమం వైపు ఉన్న జీ+2 భవనం, తూర్పు వైపు ఉన్న జీ+1 భవన నిర్మాణాలను పొడిగిస్తూ ప్రత్యేక ఆకర్షణతో ఆధునికీకరించడం, ప్లాట్‌ఫాం నంబర్ 1, 2, 3, 4 నుంచి తూర్పు, పశ్చిమంలోని అరైవల్ బ్లాక్‌కు చేరుకునేలా సబ్వే నిర్మాణాలు, ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సరఫరా, నీటి శుద్ధి, భూగర్భ, ఓవర్ హెడ్ ట్యాంకుల ఏర్పాటు, మురుగు నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణాలు చేపట్టనున్నారు. స్టేషన్ ఆవరణలోని కోర్టు, రైల్వే పోలీసుల కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా కార్యాలయాల కోసం తాత్కాలిక నిర్మాణాలు పూర్తి చేశారు. శాశ్వత నిర్మాణాలకు మార్కింగ్ పనులు చేశారు. ప్లాట్‌ఫాం నంబర్ 1లో కవర్ ఓవర్ ప్లాట్ ఫాంలను ఏర్పాటు చేసేందుకు పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యింది. పనులను పర్యవేక్షిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్ తెలిపారు. (క్లిక్ చేయండి: వలంటీర్ మారినా ఫోన్ నంబర్ మారదు) -
ఎయిర్‌పోర్టుకు ఆధునిక సొబగులు
విమానాశ్రయానికి అంతర్జాతీయ ఖ్యాతి 3.165 కిలోమీటర్లకు రన్‌వే విస్తరణ పెరుగనున్న ఎప్రాన్ సామర్థ్యం ఐసొలేషన్, ప్రహరీ నిర్మాణం మధురపూడి : రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు సరికొత్త సొబగులు సంతరించుకోనున్నాయి. అంతర్జాతీయ ఖ్యాతి దిశగా విమానాశ్రయం పరుగులు తీస్తోంది. గగనతల ప్రయాణాలతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ప్రయాణికులకు సేవలందిస్తోంది. ప్రస్తుతం ఆధునిక సొబగులను రూపుదిద్దుకోనుంది. జంబోజెట్, ఏటీఆర్, ఏ 320, 321, బీ,73 7––900 సిరీస్(ఏటీఆర్) విమానాలు సైతం రాత్రివేళల్లో రాకపోకలు సాగించేలా విమానాశ్రయాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీస్ అధికారులు తీర్చిదిద్దుతున్నారు. దీని కోసం సుమారు రూ.250 కోట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. దిల్లీ, గుజరాత్‌లకు చెందిన కాంట్రాక్టు సంస్థలు టెండర్ ప్రక్రియలో పనులు చేపట్టారు. ఎయిర్‌పోర్టు చుట్టూ 1200 ఎకరాల విస్తీర్ణాన్ని కాపాడేందుకు వీలుగా 17.5 కిలో మీటర్ల విస్తీర్ణంలో ప్రహరీ నిర్మాణాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అధికారులు చేపట్టారు. ప్రధానంగా ఎయిర్‌పోర్టు రోడ్డును ఆనుకొని ఉన్న ప్రాంతంలో ప్రహరీ నిర్మాణం జరుగుతోంది. అనుకూల వాతావరణం విమాన ప్రయాణాలకు వేసవి అనువుగా ఉంటుంది. ఫిబ్రవరి నుంచి విమాన సర్వీసులు పెరుగుతాయి. మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకూ అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం 3 విమానయాన సంస్థలు 6 సర్వీసులను నిర్వహిస్తున్నాయి. ఇవి హైదరాబాద్, చెన్నై, బెంగుళూర్‌లకు ప్రత్యక్షంగా, పుణ్యక్షేత్రాలయిన తిరుపతి, షిర్డీ, తదితర ప్రాంతాలకు అనుసంధానంగా సేవలందిస్తున్నాయి. వీటిని మరింతగా పెంచేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అధికారులు ప్రణాళికను రూపొందించారు. శరవేగంగా అభివృద్ధి రాజమహేంద్రవరం విమానాశ్రయం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఏప్రాన్ అభివృద్ధి పనులు 75 శాతం పూర్తయ్యాయి. మరో 25 శాతం మార్చినాటికి పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో పార్కింగ్ బేస్ నిర్మాణం అత్యంత ప్రధానమైంది. రన్‌వే పై దిగిన విమానాలను, ఏఫ్రాన్లోని పార్కింగ్ బేస్‌ల్లో నిలుపుతారు. ఇప్పటి వరకూ 2 చిన్న విమానాలకు మాత్రమే సరిపడ్డ పార్కింగ్ బేస్ ఉంది. దీనిని మరో 4 పెద్ద విమానాలను పార్కింగ్ చేసేందుకు వీలుగా నిర్మాణంజరిగింది. దీనికి సంబంధించిన పనులు పూర్తి కావాల్సి ఉంది. బోయింగ్ విమానాలకు రెడీ ఎయిర్‌పోర్టును బోయింగ్ విమానాలకు అనుకూలంగా తీర్చిదిద్దారు. ఏ–320, 321, బీ–737 నుంచి 900 సిరీస్ విమానాలను పార్కింగ్ చేసేందుకు అనుకూలంగా తయారయ్యింది. ఒకేసారి 4 పెద్ద విమానాలను పార్కింగ్ చేసేందుకు పార్కింగ్ బేస్ రెడీ అయ్యాయి. అంతర్జాతీయ ఖ్యాతికి చేరువలో బ్రిటిషు కాలంలో ఏర్పాటు చేసిన రాజమహేంద్రవరం విమానాశ్రయం అంతర్జాతీయ ఖ్యాతికి ఎదుగుతోంది. ప్రపంచ యుద్ధం సందర్భంలో రక్షణ కోసం నిర్మించిన విమానాశ్రయానికి అప్పట్లో అవసరాన్నిబట్టి ఒక్కో సర్వీసు చేరేది. ప్రస్తుతం ఆరు సర్వీసులు కొనసాగుతున్నాయి. వీటిలో రోజూ 300 నుంచి 650 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే 180 మంది ప్రయాణికులు ప్రయాణించే బోయింగ్ విమానాల రాకతో సుమారు 1000 నుంచి 1,200 మంది ప్రయాణించే వీలుంటుంది. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ప్రయాణికులు పెరగడంతో విశాఖపట్నం ఎయిర్పోర్టుస్థాయిని అధిగమించే అవకాశంఉంది. రన్‌వే విస్తరణ ఎయిర్‌పోర్టు రన్‌వే ప్రస్తుతం 1.75 కిలోమీటర్లు ఉంది. దీనిని 3.165 కిలోమీటర్లకు విస్తరించనున్నారు. ఒకే సారి 2 పెద్దవి, చిన్న విమాన సర్వీసులు రావచ్చు. ప్రయాణికులకు అత్యంత భద్రత ఏర్పడుతోంది. దీనిలో భాగంగా ఐసోలేషన్బేస్ నిర్మాణం జరుగుతుంది. అంతర్జాతీయ ఉగ్రవాదులు విమాన ప్రయాణికులు హైజాక్ చేస్తే, సునాయాసంగా రక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుంటుంది. అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయడం వల్ల సులభతరంగా హైజాకర్ల నుంచి ప్రయాణికులను రక్షించవచ్చు. ప్రత్యేక కార్యక్రమాలు ఎయిర్‌పోర్టు చుట్టూ చెట్లు నాటడం, పర్యావరణం పరిరక్షణ చర్యలు చేట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. రన్‌వే, ఏప్రాన్లపై కురిసిన వర్షం నీటిని మళ్లిస్తారు. దానిలో భాగంగా 20 వెల్స్ ఏర్పాటు చేసి, దానిని సమీప గ్రామాల్లోని సాగు భూములకు సాగుకు నీరందించేందుకు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా ఎస్టీవీ (సీలేజ్ ట్రీట్మెంట్ ప్లాన్), జెడ్వీపీ (జీరోవేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్)ల ప్రకారం వృథా కావాల్సిన నీటిని వినియోగంలోకి తీసకు రానున్నారు. వేగవంతంగా అభివృద్ధి పనులు అభివృద్ధి పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నాం. రన్‌వే పనులు వచ్చే ఏడాది మార్చికి, కాంపౌండ్ వాల్ పనులు ఈ ఏడాది జూన్‌కు పూర్తయ్యేందుకు చర్యలు తీసుకున్నాం. అలాగే ఏప్రాన్ అభివృద్ధి పనులు తుది దశకు చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్‌కు పూర్తవుతాయి. ఈ అభివృద్ధి పనులతో అంతర్జాతీయ ఖ్యాతిని పొందేందుకు అవకాశాలున్నాయి. - ఎం.రాజకిషోర్, ఎయిర్ పోర్టు డైరెక్టర్