ఎయిర్‌పోర్టుకు ఆధునిక సొబగులు | rajamahendravaram airport moderinization | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టుకు ఆధునిక సొబగులు

Published Sun, Feb 19 2017 11:28 PM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

ఎయిర్‌పోర్టుకు ఆధునిక సొబగులు

ఎయిర్‌పోర్టుకు ఆధునిక సొబగులు

విమానాశ్రయానికి అంతర్జాతీయ ఖ్యాతి
3.165 కిలోమీటర్లకు రన్‌వే విస్తరణ
పెరుగనున్న ఎప్రాన్‌ సామర్థ్యం 
ఐసొలేషన్‌, ప్రహరీ నిర్మాణం
మధురపూడి : రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు సరికొత్త సొబగులు సంతరించుకోనున్నాయి. అంతర్జాతీయ ఖ్యాతి దిశగా  విమానాశ్రయం పరుగులు తీస్తోంది. గగనతల ప్రయాణాలతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ప్రయాణికులకు సేవలందిస్తోంది. ప్రస్తుతం ఆధునిక సొబగులను రూపుదిద్దుకోనుంది. జంబోజెట్, ఏటీఆర్, ఏ 320, 321, బీ,73 7––900 సిరీస్‌(ఏటీఆర్‌) విమానాలు సైతం రాత్రివేళల్లో రాకపోకలు సాగించేలా విమానాశ్రయాన్ని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీస్‌ అధికారులు తీర్చిదిద్దుతున్నారు. దీని కోసం సుమారు రూ.250 కోట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. దిల్లీ, గుజరాత్‌లకు చెందిన కాంట్రాక్టు సంస్థలు టెండర్‌ ప్రక్రియలో పనులు చేపట్టారు. ఎయిర్‌పోర్టు చుట్టూ 1200 ఎకరాల విస్తీర్ణాన్ని కాపాడేందుకు వీలుగా 17.5 కిలో మీటర్ల విస్తీర్ణంలో ప్రహరీ నిర్మాణాన్ని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీస్‌ ఆఫ్‌ ఇండియా అధికారులు చేపట్టారు. ప్రధానంగా ఎయిర్‌పోర్టు రోడ్డును ఆనుకొని ఉన్న ప్రాంతంలో ప్రహరీ నిర్మాణం జరుగుతోంది. 
అనుకూల వాతావరణం
విమాన ప్రయాణాలకు వేసవి అనువుగా ఉంటుంది. ఫిబ్రవరి నుంచి విమాన సర్వీసులు పెరుగుతాయి. మార్చి, ఏప్రిల్, మే, జూన్‌ వరకూ అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం 3 విమానయాన సంస్థలు 6 సర్వీసులను నిర్వహిస్తున్నాయి. ఇవి హైదరాబాద్, చెన్నై, బెంగుళూర్‌లకు ప్రత్యక్షంగా, పుణ్యక్షేత్రాలయిన తిరుపతి, షిర్డీ, తదితర ప్రాంతాలకు అనుసంధానంగా సేవలందిస్తున్నాయి. వీటిని మరింతగా పెంచేందుకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీస్‌ ఆఫ్‌ ఇండియా అధికారులు ప్రణాళికను రూపొందించారు. 
శరవేగంగా అభివృద్ధి
రాజమహేంద్రవరం విమానాశ్రయం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఏప్రాన్‌ అభివృద్ధి పనులు 75 శాతం పూర్తయ్యాయి. మరో 25 శాతం మార్చినాటికి పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో పార్కింగ్‌ బేస్‌ నిర్మాణం అత్యంత ప్రధానమైంది. రన్‌వే పై దిగిన విమానాలను, ఏఫ్రాన్‌లోని పార్కింగ్‌ బేస్‌ల్లో నిలుపుతారు. ఇప్పటి వరకూ 2 చిన్న విమానాలకు మాత్రమే సరిపడ్డ పార్కింగ్‌ బేస్‌ ఉంది. దీనిని మరో 4 పెద్ద విమానాలను పార్కింగ్‌ చేసేందుకు వీలుగా నిర్మాణంజరిగింది. దీనికి సంబంధించిన పనులు పూర్తి కావాల్సి ఉంది. 
బోయింగ్‌ విమానాలకు రెడీ
ఎయిర్‌పోర్టును బోయింగ్‌ విమానాలకు అనుకూలంగా తీర్చిదిద్దారు. ఏ–320, 321, బీ–737 నుంచి 900 సిరీస్‌ విమానాలను పార్కింగ్‌ చేసేందుకు అనుకూలంగా తయారయ్యింది. ఒకేసారి 4 పెద్ద విమానాలను పార్కింగ్‌ చేసేందుకు పార్కింగ్‌ బేస్‌ రెడీ అయ్యాయి. 
అంతర్జాతీయ ఖ్యాతికి చేరువలో
బ్రిటిషు కాలంలో ఏర్పాటు చేసిన రాజమహేంద్రవరం విమానాశ్రయం అంతర్జాతీయ ఖ్యాతికి ఎదుగుతోంది. ప్రపంచ యుద్ధం సందర్భంలో రక్షణ కోసం నిర్మించిన విమానాశ్రయానికి అప్పట్లో అవసరాన్నిబట్టి ఒక్కో సర్వీసు చేరేది. ప్రస్తుతం ఆరు సర్వీసులు కొనసాగుతున్నాయి. వీటిలో రోజూ 300 నుంచి 650 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే 180 మంది ప్రయాణికులు ప్రయాణించే బోయింగ్‌ విమానాల రాకతో సుమారు 1000 నుంచి 1,200 మంది ప్రయాణించే వీలుంటుంది. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ప్రయాణికులు పెరగడంతో విశాఖపట్నం ఎయిర్‌పోర్టుస్థాయిని అధిగమించే అవకాశంఉంది. 
 రన్‌వే విస్తరణ
 ఎయిర్‌పోర్టు రన్‌వే ప్రస్తుతం 1.75 కిలోమీటర్లు ఉంది. దీనిని 3.165 కిలోమీటర్లకు విస్తరించనున్నారు. ఒకే సారి 2 పెద్దవి, చిన్న విమాన సర్వీసులు రావచ్చు. ప్రయాణికులకు అత్యంత భద్రత ఏర్పడుతోంది. దీనిలో భాగంగా ఐసోలేషన్‌బేస్‌ నిర్మాణం జరుగుతుంది. అంతర్జాతీయ ఉగ్రవాదులు విమాన ప్రయాణికులు హైజాక్‌ చేస్తే, సునాయాసంగా రక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుంటుంది. అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయడం వల్ల సులభతరంగా హైజాకర్ల నుంచి ప్రయాణికులను రక్షించవచ్చు. 
ప్రత్యేక కార్యక్రమాలు
ఎయిర్‌పోర్టు చుట్టూ చెట్లు నాటడం, పర్యావరణం పరిరక్షణ చర్యలు చేట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. రన్‌వే, ఏప్రాన్‌లపై కురిసిన వర్షం నీటిని మళ్లిస్తారు. దానిలో భాగంగా 20 వెల్స్‌ ఏర్పాటు చేసి, దానిని సమీప గ్రామాల్లోని సాగు భూములకు సాగుకు నీరందించేందుకు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా ఎస్టీవీ (సీలేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాన్‌), జెడ్‌వీపీ (జీరోవేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌)ల ప్రకారం వృథా కావాల్సిన నీటిని వినియోగంలోకి తీసకు రానున్నారు. 
వేగవంతంగా అభివృద్ధి పనులు
అభివృద్ధి పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నాం. రన్‌వే పనులు వచ్చే ఏడాది మార్చికి, కాంపౌండ్‌ వాల్‌ పనులు ఈ ఏడాది జూన్‌కు పూర్తయ్యేందుకు చర్యలు తీసుకున్నాం. అలాగే ఏప్రాన్‌ అభివృద్ధి పనులు తుది దశకు చేరాయి. ఈ  ఏడాది ఏప్రిల్‌కు పూర్తవుతాయి. ఈ అభివృద్ధి పనులతో అంతర్జాతీయ ఖ్యాతిని పొందేందుకు అవకాశాలున్నాయి. 
- ఎం.రాజకిషోర్, ఎయిర్‌ పోర్టు డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement