భద్రతా వలయంలో ఎయిర్‌పోర్ట్
భద్రతా వలయంలో ఎయిర్‌పోర్ట్
Published Tue, Apr 18 2017 11:04 PM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM
విస్తృత తనిఖీలు
ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు
మధురపూడి (రాజానగరం) : ఉగ్రవాదుల దాడులు, విమానాల హైజాక్ వదంతుల నేపథ్యంలో రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. రోజూ విమాన సర్వీసుల్లో 800 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రోజూ సుమారు 250 మంది ప్రయాణికుల బంధువుల, స్నేహితులు, సందర్శకులతో రద్దీగా ఉంటోంది.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు...
దేశంలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లకు ఉగ్రవాదల నుంచి హైజాక్ హెచ్చరికలు ఉండడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అధికారులు భద్రతాచర్యలు చేపట్టారు. ప్రాంతీయ విమానాశ్రయాల్లో నిఘా పెంచాలని, భద్రతకు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్‌పోర్ట్‌లోని ఆస్తుల పరిరక్షణ, ప్రయాణికుల రక్షణ మేరకు భద్రతాచర్యలు చేపట్టారు. ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎం.రాజ్‌కిషోర్, అధికారులతో సమావేశం నిర్వహించి, పలు సూచనలు ఇచ్చారు. ఎస్పీఎఫ్ కమాండెంట్ డీఎన్‌ఏ బాషా భద్రత సిబ్బంది పనితీరును తనిఖీచేసి, భద్రతకు సంబంధించిన సూచనలు ఇచ్చారు.
జిల్లాలో మావోయిస్టులు, ఉగ్రవాదుల కదలికలపై అనుమానాలు
దేశంలో నిఘా వర్గాలకు చిక్కిన ఉగ్రవాది నుంచి సమాచారం మేరకు అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఉగ్రవాదుల హైజాక్ ప్రమాదం ఉందని గుర్తించారు. ఆ మేరకు అన్ని విమానాశ్రయాల్లో రక్షణ చర్యలకు ఆదేశాలిచ్చిన సంగతి తెల్సిందే. గతంలో ఉగ్రవాదులు ఈ తరహా చర్యలకు పాల్పడ్డారు. ఆ నేపథ్యంలో చర్యలు తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఒడిశా రాష్ట్రంలో కూడా మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉండడం కూడా విమానాశ్రయం భద్రతకు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం విమానాశ్రయంపై టెర్రరిస్టులు, మావోయిస్టుల కన్ను పడేందుకు ఎక్కువ అవకాశం ఉంది.
ప్రత్యేక నిఘా
ఎయిర్‌పోర్ట్ ప్రత్యేకమైన నిఘా నీడన ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే సందర్భాల్లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో జాగ్రత్తలు పాటించారు. రెండు రోజులుగా విస్తృత తనిఖీలు చేస్తున్నారు. 130 మంది ఎస్పీఎఫ్ భద్రత సిబ్బంది, పోలీసులు టెర్మినల్ భవనంలో ప్రయాణికులకు రెండు దఫాలుగా తనిఖీలు నిర్వహించారు. ఎస్పీఎఫ్ ఎస్సైలు ఎం.రమణ, ధనుంజయరావు, విజయ్‌కుమార్‌లు పటిష్ట బందోబస్తు చేపట్టారు. అనుమానితులను లోనికి అనుమతించడం లేదు. ఎయిర్‌పోర్ట్ చుట్టూ ప్రత్యేక బృందాలు మఫ్టీలో తనిఖీలు చేస్తున్నారు.
ప్రత్యేక ఫోర్స్ గస్తీ
ఎయిర్‌పోర్టులో ప్రత్యేక శిక్షణ పొందిన ఎస్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. వారితో ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టాం. ఎయిర్‌పోర్టు, రన్‌వే, యాప్రాన్, పాత టెర్మినల్ భవనాల వద్ద గస్తీ నిర్వహించాం. ప్రయాణికుల రక్షణ, ఎయిర్‌పోర్ట్ ఆస్తుల పరిరక్షణ మా బాధ్యత.
- డీఎన్‌ఏ బాషా, ఎస్పీఎఫ్ కమాండెంట్
ముందు జాగ్రత్తగా..
రాజమహేంద్రవరం విమానాశ్రయం రక్షణ వలయంలో ఉంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ప్రత్యేక బందోబస్తు చేపడుతున్నాం.
- ఎం.రాజ్‌కిషోర్, ఎయిర్‌పోర్టు డైరెక్టర్
Advertisement
Advertisement